Srikakulam Crime News
-
రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల దుర్మరణం
శ్రీకాకుళం, రణస్థలం: సోమవారం తూరుపు తెల్లారకముందే ఇద్దరి జీవితాలు తెల్లారిపోయాయి. టైర్ పంక్చర్ అయ్యిందని ఓ డ్రైవర్ లారీని నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన రోజుల తరబడి నిలిపివేస్తే.. మరో డ్రైవర్ అంతకంటే నిర్లక్ష్యంతో అతివేగంగా బండి నడుపుతూ ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. వీరిద్దరి అలసత్వం కారణంగా రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రణస్థలం మండలం కోష్ట వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మందస మండలం చిన్న నారాయణపురానికి చెందిన మడియా ఢిల్లీశ్వరరావు(22), మడియా వసంత(20)గా గుర్తించారు. ఈ ఘటనలోనే డ్రైవర్ మూర్తి, పాప కుసుమ(8)లకు తీవ్ర గాయాలయ్యాయి. జేఆర్ పురం పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొన్న కారు చిన్న నారాయణపురానికి చెందిన ఢిల్లీశ్వరరావు, వసంతలు వరుసకు అన్నాచెల్లెళ్లు. వీరు డిగ్రీ, డైట్ పూర్తి చేసి వేసవిలో శిక్షణ తీసుకుందామని విశాఖలోని మేనమామ తులసీదాస్ ఇంటికి వెళ్లారు. ఇంతలో లాక్డౌన్ ప్రకటించడంతో చాలా రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రెండు రోజుల ముందే ఇంటికి వద్దామని అక్కడి సిటీ కమిషనర్ అనుమతి తీసుకున్నారు. అన్నాచెల్లెళ్లతో పాటు మేనమామ కూతురు కుసుమ కూడా బయల్దేరింది. సోమవారం ఉదయం 3.30 గంటల సమయంలో డ్రైవర్ వీరిని తీసుకుని కారులో మందస మండలానికి పయనమయ్యారు. రణస్థలం మండలం కోష్ట గ్రామానికి సమీపానికి వచ్చేసరికి.. జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని వీరి కారు అతివేగంగా వచ్చి బలంగా ఢీకొంది. దీంతో వెనుక సీటులో ఉన్న ఢిల్లీశ్వరరావు, వసంతలు అక్కడికక్కడే మృతి చెందారు. ముందుసీట్లలో ఉన్న డ్రైవర్ మూర్తి, కుసుమలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మేమున్నాం సేవా సంస్థ అంబులెన్స్‌లో క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జేఆర్‌పురం ఎస్ఐ ఇ.శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలకు రిమ్స్‌లోనే శవ పంచనామా చేయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. చిన్ననారాయణపురంలో విషాద ఛాయలు మందస: మండలంలోని చిన్ననారాయణపురానికి చెందిన మడియా పాపారావు కుమారుడు ఢిల్లీశ్వరరావు, మడియా త్రినాథ్ కుమార్తె వసంతలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నా యి. పాపారావు, త్రినాథ్ అన్నదమ్ములు. ఉన్న త ఉద్యోగాలు చేసి కుటుంబాలకు అండగా నిలబడతారని అనుకుంటే ఇలా యుక్త వయసులో నే వదిలేసి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు రోదించారు. వసంత తల్లిదండ్రులు బెంగళూరులో ఉండడంతో సమాచారం వారికి చేరవేశారు. అక్కడి పోలీసుల నుంచి అనుమతి లభించడంతో వారు జిల్లాకు ప్రయాణమయ్యారు. -
చెల్లి పెళ్లి చూడకుండానే..
శ్రీకాకుళం, పెందుర్తి: ఎన్‌హెచ్–16 బైపాస్ ఆనందపురం–అనకాపల్లి రహదారి మరోసారి రక్తమోడింది. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు శ్రీకాకుళం వాసులు దుర్మరణం పాలయ్యారు. లారీ–కారు ఢీకొన్న ఘటనలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నరసన్నపేటకు చెందిన గనగళ్ల జగదీష్ (24), బంధువు జల్లేపల్లి జయలక్ష్మి(65) కుటుంబాలు కలిసి మెలిసి ఉంటాయి. వీరికి సన్నిహిత కుటుంబం పెందుర్తిలో నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పెందుర్తిలోని వారింట్లో శుభకార్యానికి మీనాక్షమ్మ, జగదీష్ కారులో వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత తిరిగి శ్రీకాకుళం బయలుదేరారు. అయితే పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న జగదీష్, ముందు సీట్లో ఉన్న మీనాక్షమ్మ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకుపోయిన మీనాక్షమ్మ, జగదీష్ మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెల్లి పెళ్లి చూడకుండానే.. నరసన్నపేట: పెందుర్తి రోడ్డు ప్రమాదంలో గనగళ్ల జగదీష్, బంధువు జల్లేపల్లి జయలక్ష్మి మృతి చెందడంతో నరసన్నపేట పట్టణం బజారు వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వచ్చే నెల 15న తన చెల్లి పెళ్లి అంగరంగ వైభవంగా చేయడానికి జగదీష్ నెల రోజులుగా బిజీగా ఉన్నాడు. ఇంతలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడు జగదీష్ మాజీ వార్డు సభ్యుడు శ్రీను కుమారుడు. ఈయన ఇంటి ఎదురుగా ఉంటున్న జయలక్ష్మి కూడా మృతి చెందడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ♦ ఆనందపురం దాటాక తండ్రి శ్రీనుతో ఫోన్లో మాట్లాడిన జగదీష్ అక్కడికి కొద్ది నిమషాల తర్వాత ప్రమాదానికి గురయ్యాడు. సాయంత్రం మూడు గంటలకు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మంత్రి కృష్ణదాస్ సంతాపం... రోడ్డు ప్రమాదంలో జగదీష్‌తోపాటు జయలక్ష్మి మృతి చెందడం పట్ల ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కృష్ణచైతన్య, పార్టీ నాయకులు ఆరంగి మురళి, కేసీహెచ్‌బీ గుప్తా తదితరులు సంతాపం తెలిపారు. -
గర్భం దాల్చిన గిరిజన విద్యార్థిని
శ్రీకాకుళం, మందస: మండలంలోని బుడారిసింగి పంచాయతీ గుడ్డికోల గ్రామానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈమె స్వస్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బత్రసాయి సమీపంలోని గౌడు గ్రామం. గుడ్డికోల గ్రామానికి చెందిన యువకుడికి సదరు బాలిక వరుసకు మేనకోడలు. ఈమె తల్లిదండ్రులు మరణించడంతో బాలికను ఒడిశా నుంచి తీసుకువచ్చి యువకుడు వివాహం చేసుకున్నట్టు తెలిసింది. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం కావడంతో సిరిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గిరిజన బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా గర్భిణి అనే విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ శరత్‌చంద్రశివకుమార్ ఐటీడీఏ(సీతంపేట)కు సమాచారం అందించారు. వైఎస్సార్ క్రాంతి పథం ఏపీఎం ఎ.లలితను గుడ్డికోల గ్రామానికి వెళ్లి పరిస్థితి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు రావడంతో ఏపీఎంతో పాటు సీసీ ముఖలింగం గ్రామానికి వెళ్లి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. గిరిజన బాలిక రెండు నెలల గర్భిణిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు ఐటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
భర్త సెల్ విసిరితే ముక్కుకు తగిలి చనిపోయిందని..
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ ప్రేమను జీవితాంతం కొనసాగించలేకపోయారు. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. పలాస పొందర వీధిలోని పొందర కులానికి చెందిన పొందర తేజేశ్వరరావు, ఉదయపురంలోని చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మౌనికలు ఇరు కుటుంబాలను ఎదురించి మరీ నాలుగేళ్ల కిందట కులాంతర పెళ్లి చేసుకున్నారు. పలాస జీడిపిక్క బొమ్మకు సమీపాన కేటీ రోడ్డుకు ఆనుకుని ఉ న్న ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి కాపురం నాలుగేళ్లు సజావుగానే సాగింది. ఈ దంపతులు ఓ పాపకు కూడా జన్మనిచ్చారు. ఆదివారం రాత్రి దంపతులు సినిమాకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ మౌనిక ప్రాణాలు కోల్పోయింది. సెల్‌ఫోన్ తగిలి చనిపోయిందని, భర్త సెల్ విసిరితే ముక్కుకు తగిలి చనిపోయిందని స్థానికంగా రకరకాలు మాట్లాడుకుంటున్నారు. భర్త కూడా ఇలాగే చెబుతున్నారు. ఆదివారం రాత్రి సంఘటన జరిగితే సోమవారం ఉదయం పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించంతో సీఐ వేణుగోపాలరావు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం తర్వాతే వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి బంధువులు ‘కులాంతర వివాహం చేసుకున్నప్పుడే మా అమ్మాయిచనిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏమీ చనిపోలేదు’ అని మాట్లాడడం గమనార్హం. -
బతుకు జీవుడా..!
ఒక్కసారిగా పెద్ద కుదుపుతో బస్సు ఆగింది.. నిద్దట్లోనే ఒకరిపై ఒకరు పడ్డ ప్రయాణికులకు కాసేపు ఏమైందో అర్థం కాలేదు.. చుట్టూ అంధకారం.. సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడివున్నాయి. ప్రమాదం జరిగిందని తెలుసుకొని బిలబిలమంటూ దిగిపోయారు.. ఆ షాక్ నుంచి తేరుకొని సామాన్లు తెచ్చుకొనేలోపే కళ్ల ముందే బస్సు దగ్ధమైంది. ఆకాశాన్నంటిన అగ్ని కీలలను చూసి వారెవరికీ నోట మాట రాలేదు. రణస్థలం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బస్సులోనివారంతా ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి వస్తున్న టూరిస్టులు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు. రణస్థలం: రోడ్డు ప్రమాదం ఒక షాక్.. మంటల్లో బస్సు దగ్ధం మరో షాక్.. అంతసేపు తాము ప్రయాణించిన వాహనమేనా ఇలా కాలి బూడిదైందని తలచుకుంటేనేఒళ్లు గగుర్పొడిచే సంఘటన అది.. అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు, పోలీసులు, స్థానిక ప్రజలు వెంటనే సహాయ చర్యలందించడంతో వారు కాస్తంత తేరుకున్నారు.. అయితే సామాన్లన్నీ కాలిబూడిద కావడంతో ఊరుకాని ఊరిలో కట్టుబట్టలతో మిగిలారు. ఉత్తరాఖండ్ వాసులు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో దగ్ధమైంది. ముందు వెళుతున్న వరిశాం శ్యాం పిస్టన్స్ పరిశ్రమకు చెందిన బస్సు హఠాత్తుగా కుడివైపునకు మలుపు తిరగడంతో వెనుక వేగంగా వస్తున్న టూరిస్టు బస్సును గుద్ది అవతల రోడ్డులో ఉన్న అమ్మోనియం లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 45మంది ఉన్నారు. నిద్దట్లో ఉన్నవారంతా ఉలిక్కిపడి లేచి బస్సు దిగిపోయారు. ఇంతలో షార్ట్‌సర్క్యూట్ అయి బస్సు వారి కళ్ల ముందే పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులంతా చకచకా బస్సు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడ్డ కొద్దిమంది పర్యాటకులు, శ్యాం పిస్టన్స్ ఉద్యోగులు, లారీ డ్రైవర్‌కు లావేరు, రణస్థలం నుంచి వచ్చిన 108 వాహనాల్లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అరబిందో పరిశ్రమ, ప్రభుత్వ అగ్నిమాపక కేంద్రాల నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపుచేశాయి. హిందీలో ఆర్తనాదాలు ప్రమాదం జరిగిన వెంటనే హిందీలో ఆర్తనాదాలు వినిపించాయి. బస్సు యాక్సిడెంట్ యువా.. బస్సు జల్ గయ్... తూరంత్ బహార్ ఉతరో... ఉతరో (బస్సుకు ప్రమాదం జరిగింది. వెంటనే బయటకు దిగిపోండి) అంటూ హాహాకారాలతో ఉత్తరాఖండ్‌వాసులు బస్సు దిగిపోయారు. కొద్దికొద్దిగా మంటలు వ్యాపిస్తుండగా బస్సులో ఉన్న 45 మంది ఎమర్జన్సీ గేటు, ప్రధాన గేటు నుంచి బట్టలు, బ్యాగులు వదిలేసి హడావుడిగా దిగిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు, పోలీసులు, స్థానికులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ యంత్రాంగం ఒక బస్సు ఏర్పాటు చేసి టూరిస్టులను విశాఖ పంపించింది. అక్కడి నుంచి వారు రైలు తదితర రవాణా సాధనాల ద్వారా స్వస్థలానికి వెళతారు. నెల రోజులపాటు కాశీ, పూరి, రామేశ్వరం, కన్యాకుమారి వంటి తీర్థయాత్రలు చేసేందుకు ఉత్తరాఖండ్ నుంచి టూరిస్టులు రెండు బస్సుల్లో బయలుదేరారు. అందులో ఒక బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాలతో బయటపడినప్పటికీ డబ్బులు, ఏటీఎం కార్డులతో సహా సామాను దగ్ధం కావడంతో టూరిస్టులు కట్టుబట్టలతో మిగిలారు. అధికారులు, స్థానికుల చొరవకు ప్రశంసలు సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారులు సీఐ మల్లేశ్వరరావు, ఎస్సై అశోక్‌బాబు, ఫైర్ అధికారులు, ఆర్డీవో ఎం.వి.రమణ, తహసిల్దార్ ఎం.సుధారాణి స్పందించారు. స్థానిక మాజీ సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్, గ్రామ పెద్దలు, అరబిందో యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానికులు టూరిస్టులకు సపర్యలు చేశారు. సకాలంలో స్పందించి భోజనాలు, తాగునీరు, టూరిస్టులు విశాఖపట్నం వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. సమస్తం బూడిదైంది... నెల రోజులపాటు దైవ క్షేత్రాలు తిరిగేందుకు సుఖియాంచల్ ట్రావెల్స్ తో మాట్లాడుకున్నాం. పూరి చూసుకొని వస్తున్నాం. ప్రస్తుతం రామే శ్వరం వెళుతున్నాం. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. దుస్తులు, నగదు, ఆధార్, పాన్‌కార్డులు, ఏటీఎం కార్డులు సమస్త కాలిపోయాయి. తిరిగి వెళ్లేందుకైనా డబ్బులు లేవు. – రావత్ బహుగుణ్, టూరిస్టు -
మాటలకందని విషాదం
శ్రీకాకుళం, కొత్తూరు: నూతన సంవత్సరాన్ని ఎంతో సందడిగా గడపాల్సిన ఆ ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని అడ్డంగి గిరిజన గ్రామానికి చెందిన సవర రాజారావు (28) మంగళవారం విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాజారావు తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని పోషించుకుంటూ వస్తున్నాడు. రాజారావు విద్యుత్ షాక్‌కు గురికావడంతో ఆ కుటుంబం వీధిన పడింది. అడ్డంగి గ్రామానికి రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్‌కో సిబ్బందికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. విద్యుత్ వైర్లకు తగిలి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని ట్రాన్స్‌కో సిబ్బంది గిరిజనులకు సూచించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన నలుగురు గిరిజన యువకులు విద్యుత్ వైర్లకు తగిలి ఉన్న చెట్ల కొమ్మలు తొలగించేందుకు బయలుదేరి వెళ్లారు. విద్యుత్ సరఫరాను సిబ్బంది నిలిపివేశారనే భావనతో రాజారావు వైరకు ఆనుకొని ఉన్న జీడి చెట్ల కొమ్మలను తొలగించే ప్రయత్నం చేశాడు. ఇంతలో షాక్‌కు గురై అక్కడకక్కడే మృతి చెందాడు. వీఆర్వో జి.రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ బి.సింహద్రి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రాజారావు (అవివాహితుడు) మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబాన్ని పోషిస్తున్న అన్నయ్య మృతి చెందడంతో చెల్లి, తమ్ముళ్ల రోదనలు మిన్నంటాయి. -
ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్‌నర్స్ ఆత్మహత్య
పాలకొండ రూరల్: శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న కాకర్ల హేమలత (32) గురువారం ఆసుపత్రిలోని డ్యూటీ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం 4:30 గంటలకు తన డ్యూటీ రూమ్‌కు వెళ్లిన ఆమె గంట వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో హేమలత కుటుంబసభ్యులు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. దీంతో వారు సహచర సిబ్బందికి ఫోన్ చేశారు. సహచరులు డ్యూటీ రూమ్ కిటికీ నుంచి చూడగా హేమలత ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్నట్లు తెలిసింది. అయితే దీన్ని పోలీసులు ధృవీకరించలేదు. -
అంతుచిక్కని విదేశీ కరెన్సీ అపహరణ
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: పట్టణంలోని దినవారి బజారు సమీపంలోని సాయి ట్రావెల్స్‌లో నిర్వహిస్తున్న వెస్టర్న్ యూనియన్ నగదు బదిలీ కేంద్రం వద్ద సోమవారం రూ.3 లక్షల విలువైన విదేశీ కరెన్సీ చోరీకి గురైంది. ఈ కేసు విషయమై సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు పోలీసులు చేసిన దర్యాప్తులో చోరీకి పాల్పడినవారు టర్కీ దేశానికి చెందిన ఇద్దరు యువకులుగా అనుమానిస్తున్నారు. నగదు బదిలీ కేంద్రంలో పనిచేస్తున్న నిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ మంగళవారం కేసు నమోదు చేశారు. అనుమాతులలో ఒకరికి సంబంధించిన ఫొటోలను సీసీ కెమెరా ద్వారా సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీఐ ఎం.వినోద్‌బాబు తెలిపారు. -
తల్లిపై కుమార్తె యాసిడ్ దాడి
సాక్షి, శ్రీకాకుళం : ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని కుమార్తె పట్టుబట్టింది. వద్దని తల్లిదండ్రులు వారించారు. తాము తెచ్చిన సంబంధాన్నే చేసుకోవాలన్నారు. ఈ విషయంపై తల్లీకుమార్తెల మధ్య కొద్దిరోజులుగా తగాదా జరుగుతోంది. గురువారం మరోసారి తీవ్రస్థాయిలో ఇంట్లోనే వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన కుమార్తె ఇంట్లోని బాత్రూమ్లో వాడే యాసిడ్ బాటిల్‌తో తల్లి ముఖంపై కొట్టింది. ఈ ఘటన శ్రీకాకుళం పరిధిలోని ఏఎస్ఎన్ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కాలనీలో నివసిస్తున్న రామప్పడు, ప్రభావతిల కుమార్తె జ్యోత్స్న వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివింది. ఆ సమయంలో ఓ అబ్బాయిని ప్రేమించింది. ఇటివలే బీటెక్ పూర్తయింది. ఓ అబ్బాయిని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. దీనికి తల్లిదండ్రులు తిరస్కరించారు. ఇదే విషయంపై తల్లీకుమార్తె ప్రతి రోజూ తగాదా పడుతున్నారు. ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపిస్తామని తల్లి ప్రభావతి చెప్పినప్పటికీ కుమార్తె జ్యోత్స్న.. తనకున్న తెలివి తేటలతో బాండ్ పేపర్‌పై ‘కోరుకున్న వాడితోనే పెళ్లి చేస్తామని’ రాసి ఇవ్వాలన్నది. ఈ విషయంలో తల్లికి కోపం రావడంతో ఆమె ససేమిరా అనేసింది. బాత్రూంలో ఉన్న యాసిడ్ బాటిల్‌ను తీసిన జ్యోత్స్న తల్లి ప్రభావతిపై విసిరికొట్టింది. వెంటనే ముఖంపై బొబ్బలు ఏర్పడ్డాయి. దుస్తులన్నీ కాలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న తండ్రి 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తల్లీకుమార్తెల నుంచి వివరాలు సేకరించారు. రిమ్స్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. ఈ మేరకు విచారణ చేస్తున్నామని, తల్లీకుమార్తెలకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని రెండో పట్టణ ఎస్ఐ ముకుందరావు తెలిపారు. -
మృత్యు తీరం.. స్నానానికి వెళ్లి..
అంతవరకు అక్కడే కలిసి తిరిగారు. అక్కడే కలిసి తిన్నారు. నవ్వుకున్నారు.. ఆడుకున్నారు.. సందడిగా గడిపారు. ఒక్క క్షణంలో పరిస్థితులు తారుమారైపోయాయి. వారి నవ్వులన్నీ సముద్ర ఘోషలో కలిసిపోయాయి. సందడులు రోదనలుగా మారిపోయాయి. అందంగా కనిపించిన సముద్ర తీరం తన భయంకర రూపాన్ని ప్రదర్శించింది. నది నీటి కలయికతో రూపు కోల్పోయి ఉన్న తీరం నలుగురు యువకులను అమాంతం లోపలకు లాక్కుపోయింది. కళింగపట్నం బీచ్‌లో ఆదివారం స్నానానికి దిగిన నలుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయి ఒడ్డు చేరగా.. మిగిలిన ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. యువకులంతా ఒకే కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. చేతికి అందివచ్చిన బిడ్డలు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది. సాక్షి, గార(శ్రీకాకుళం రూరల్): కార్తీక ఆదివారం సందర్భంగా గార మండలంలోని కళింగపట్నం–మత్స్యలేశం పరిధిలో బీచ్‌కు వచ్చిన ఆరుగురు ఇంటర్ యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు. శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్‌కుమార్ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్, షేక్ అబ్దుల్లా, లింగాల రాజసింహాలు ఆదివారం బీచ్‌కు వెళ్లారు. అక్కడే భోజనం ముగించుకొని కొంతసేపు ఇసుక దిబ్బలపై ఆడుకున్నారు. వారిలో రాజసింహా ఒడ్డునే ఉండగా, ఐదుగురు యువకులు సముద్రంలో దిగారు. ప్రమాదం పసిగట్టలేని వారంతా ఒకరిపై సరదాగా నీరు జల్లుకుంటూ ఆనందంగా గడిపారు. నీటిలో వడి ఎక్కువగా ఉండడంతో లోపలకు వెళ్లిపోవడం వారు గమనించలేకపోయారు. గమనించే సరికే నీరు లోపలకు లాక్కువెళ్లిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన మెరైన్ పోలీసులు షేక్ అబ్దుల్లాను కాపాడగలిగారు. శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్‌కుమార్ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్‌లు మాత్రం నీటిలో మునిగిపోయారు. వీరిలో కొంత సేపటి తర్వాత సుధీర్ మృతదేహం కనిపించగా పోలీసులు ఒడ్డుకు తీసుకువచ్చారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. పౌర్ణమి రోజులు కావడంతో రాత్రిపూట సముద్రం ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. రోజంతా సందడి కనిపించిన తీరంలో ఈ ఘటనతో భయానక వాతావరణం నెలకొంది. మెరైన్ సీఐ అంబేడ్కర్, ఇన్చార్జి ఎస్సై సింహాచలం, స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాలింపు చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు అబ్దు ల్లా, రాజసింహతో మాట్లాడి సంఘటన తీరును తెలుసుకున్నారు. డీఎస్పీ మూర్తి, శ్రీకాకుళం పట్టణ సీఐ లలిత, తహసీల్దార్ జెన్ని రామారావు, మెరైన్ ఎస్ఐ జగన్ తదితరులు ఉన్నారు. ఆఖరి క్షణంలో... సముద్రస్నానంలో గల్లంతైన స్నేహితులు అంతా మెరిట్ స్టూడెంట్లే! శ్రీకాకుళం రూరల్: ఆ విద్యార్థులంతా టెన్త్‌లో మంచి మార్కులు సాధించిన వారే. ఒక్కొక్కరూ ఒక్కో పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్ ఒకే క్యాంపస్‌లో చదవడంతో మంచి స్నేహితులు అయ్యారు. రెండు రోజులు సెలవులు కావడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా పిక్నిక్కు వెళ్లారు. తిరిగి వచ్చేస్తామనే అనుకున్నారు గానీ.. ఇంతలో విధి ఇలా వికృతంగా ఆడుకుంది. కళింగపట్నం బీచ్‌లో గల్లంతైన వారంతా శ్రీకాకుళంలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గల్లంతైన వారి కుటుంబ నేపథ్యా లు పరిశీలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో కథ. గల్లంతైన వారిలో ముగ్గురు వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడం విషాదకరం. బిడ్డల పరిస్థితిపై సమాచారం అందుకున్న ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఎదిగి ఆదుకుంటారనుకున్న బిడ్డలు ఇలా అర్ధంతరంగా వదిలివెళ్లిపోయారని తెలిసి కంటికీమింటికీ ఏకధారగా రోదించారు. పచ్చళ్లు అమ్ముకుంటూ.. గల్లంతైన వారిలో ఒకడైన సుధీర్ తండ్రి కృష్ణ పచ్చళ్లు అమ్ముకుంటూ బతుకుతున్నారు. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళానికి వలస వచ్చిన వీరు పాతబ్రిడ్జి సమీపంలోని హయాతీనగరంలో నివాసముంటూ పచ్చళ్లు తయారు చేస్తుంటారు. సుధీర్ ఇంటర్ ఎంపీసీ సెకండియర్ చదువుతున్నారు. సుధీర్ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. ఒక్కగానొక్క కొడుకు సముద్రంలో మునిగి చనిపోయాడని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించారు. సుధీర్ పదో తరగతి వరకూ శ్రీకాకుళంలోని కేశవరెడ్డి స్కూల్లో చదివాడు. ఇంటికి వెళ్దామన్నా రాలేదు.. రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఇంటికి వెళ్దామని తన తమ్ముడు యోగ్యనారాయణ పండాను బతిమలాడినా రాలేదని యజ్ఞ నారాయణ పండా అక్క ఇంద్రావతి పండా రోదిస్తూ చెప్పింది. వీరిద్దరూ కలిసి శ్రీకాకుళంలోని మహాలక్ష్మీనగర్ కాలనీలో తమ బంధువుల ఇంటి వద్ద అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు. తండ్రి పూర్ణచంద్రపండా ఇచ్ఛాపురంలోని నర్మదేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. తల్లి నమితా పండా గృహిణి. వీరికి ఇద్దరు సంతానం. అందులో రెండో అబ్బాయి నారాయణ పండా. ఇతను పదోతరగతి వరకూ ఇచ్ఛాపురంలోని జ్ఞానభారతి పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఇంటర్మీడియట్ శ్రీచైతన్యలోని బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బిడ్డ పరిస్థితి తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అక్క ఇంద్రావతి రోదన ఆపడం ఎవరి తరం కాలేదు. దేవుని సేవలు చేస్తున్నా.. గల్లంతైన వారిలో ఒకరైన సంజయ్ తండ్రి ఐరన్ కుమార్ నిత్యం దేవుని సేవలోనే ఉంటారు. ఇండియన్ ఇమాజినల్ మిషన్‌లో ఆయన పనిచేస్తున్నారు. ఈ దంపతులకు కూడా సంజయ్ ఒక్కగానొక్క సంతానం. నిత్యం దేవుని సేవలో గడిపే తమకు ఇంత పెద్ద దుఖం వస్తుందని ఊహించలేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. ఎదిగి వచ్చిన కొడుకు ఇలా అయిపోవడంతో తల్లడిల్లిపోయారు. వీరు శ్రీకాకుళంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నారు. తల్లి సుశీలా డీఆర్డీఏలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి కరుమారి సంజయ్ శ్రీచైతన్యలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు కేంద్రీయ విద్యాలయంలో పదోతరగతి పూర్తి చేశాడు. బయటకు వెళ్తానని చెప్పి.. ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్తానని చెప్పిన కొడుకు మళ్లీ తిరిగిరాకుండా వెళ్లిపోతాడని అనుకోలేదని శివరామిరెడ్డి తల్లిదండ్రులు రామిరెడ్డి, లత భోరున విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు చిర్ల శివరామరెడ్డి ఇలా సముద్రంలో గల్లంతవుతాడని ఊహిం చలేదని వారు రోదిస్తున్నారు. శ్రీకాకుళంలోని 80 ఫీట్‌రోడ్‌లో వీరు నివాసం ఉంటున్నారు. తండ్రి వృత్తిరీత్యా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. శ్రీచైతన్య కళాశాల్లో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాడు. పదోతరగతి కుడా శ్రీచైతన్య టెక్నో స్కూల్లోనే చదివాడు.(చదవండి: సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు) -
30 శాతం రాయితీతో నచ్చిన వాహనం..
ప్రభుత్వ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకున్నాడు. పలువురిని నమ్మించి 30 శాతం రాయితీతో వాహనాలను విక్రయించాడు. వారు మరికొంత మందికి చెప్పటంతో మోసం మొదలుపెట్టాడు. ఈ నకిలీ పథకం అంతటా వ్యాపించడంతో వ్యాపారం మరింత పెరిగింది. సుమారు 110 వాహనాలను విక్రయించాడు. రూ.కోట్లలో వ్యాపారం సాగింది. ప్రస్తుతం గుట్టు రట్టుకావడంతో సదరు వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. శ్రీకాకుళం ,టెక్కలి రూరల్: టెక్కలి బాలాజీనగర్–2లో నివాసముంటున్న జి.హెచ్.రాజా అలియాస్ తిరుపతిరావు (పాస్టర్) గత కొద్ది నెలలుగా టెక్కలితోపాటు కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, సారవకోట, నరసన్నపేట, జలుమూరు తదితర మండలాల ప్రజలకు 30 శాతం రాయితీతో నచ్చిన వాహనం విక్రయిస్తానని నమ్మబలికాడు. కొంత కాలం తర్వాత వాహనాలు కావాలనుకునే వారికి నెల రోజల వ్యవధిలో ఇస్తామని చెప్పేవాడు. సుమారు 216 మంది వరకు వాహనాల కోసం డబ్బులు చెల్లించారు. కొంతమందికి వాహనాలు ఇస్తామన్న సమయానికి ఇవ్వకపోడంతో ప్రశ్నించారు. నోయిడాలోని మొయిన్ బ్రాంచ్ నుంచి తన వద్దకు వాహనాలు రాలేదని, వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పాడు. సుమారు రూ.3 కోట్ల 20 లక్షల వరకు వసూలు చేశాడని తెలుస్తోంది. ప్రజల వద్ద సేకరించిన డబ్బులతోనే కొన్నొ వాహనాలు కొనుగోలు చేసేవాడు. ఎవరైనా పలుకుబడి ఉన్నవారికి వాహనాలు ఇచ్చి వారిని నమ్మించుకుంటూ వస్తున్నట్లు సమాచారం. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, నూర్పుడి యంత్రాలు వంటివి 30 శాతం తక్కువ రేటుకు ఇస్తామనడంతో పేద, మధ్య తరగతి ప్రజలతోపాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ నకిలీ స్కీం మాయలో పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి హైదారాబాధ్లో కూడా బ్రాంచ్ ఉన్నట్లు సమాచారం. దానిని అక్కడ ప్రశాంత్‌కుమార్ అనే వ్యక్తి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. చల్ల రాజా ప్రవర్తనపై అనుమానం వచ్చిన సంతబొమ్మాళి గ్రామానికి చెందిన సిమ్మ కృష్ణరావు సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ కామేశ్వరరావు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టెక్కలిలో ఏర్పాటు చేసుకున్న కార్యాలయం గుట్టు రట్టు.. రాజా అలియాస్ తిరుపతిరావుది పాతపట్నం మండలం తెంబూరు గ్రామం. పదో తరగతి సైతం ఉతీర్ణత చెందలేదు. గ్రామంలో పాస్టర్‌గా ఉన్నారు. గతేడాది వచ్చిన తిత్లీ తుఫాన్లో ఇల్లు కూలిపోవడంతో టెక్కలికి వచ్చాడు. ఈ సమయంలోనే హైదారాబాధ్లోని ప్రశాంత్‌కుమార్‌తో పరిచడం ఏర్పడింది. ఇరువురు కలిసి ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని ఈ నకిలీ వ్యాపారం గుట్టుగా సాగించారు. ప్రజల వద్ద నుంచి మరింత మొత్తం సేకరించి ఆ సొమ్ముతో వచ్చే ఏడాదిలోగా ఉడాయించేందుకు పక్కా ప్రణాళికలు వేసికున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
విషాదం: మామ, అల్లుడి మృతి
సాక్షి, చీపురుపల్లి(శ్రీకాకుళం): అప్పుడే తెల్లవారింది. అసలే ఆదివారం. సాధారణంగా మాంసాహార ప్రియుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే ఆశతో చికెన్ సెంటర్ నడుపుతున్న ఆ ఇద్దరు మామా అల్లుళ్లు ఉదయాన్నే దుకాణం తెరిచారు. బేరం బాగుంటుందనీ... సాయంత్రం కాస్తంత కాసులతో ఇంటికెళ్తామని ఆశించారు. కానీ వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్ది గంటల్లోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్త ఆ రెండు కుటుంబాలను హతాశులను చేసింది. పట్టణంలోని మెయిన్రోడ్లో గల మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా దశాబ్దాల క్రితం నుంచి షేక్ బాషా చికెన్ సెంటర్ ఉంది. దాని యజమాని షేక్ బాషా(45), ఆయన అల్లుడు షేక్ సైదు(28) ఉదయం 5 గంటలకే చికెన్ సెంటర్‌కు వచ్చి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించారు. 7 గంటల సమయంలో షేక్ సైదు కోళ్లను డ్రసింగ్ చేసేందుకు సంబంధిత మెషీన్లో వేశాడు. ఇంతలోనే విద్యుత్ షాక్ తగలడంతో ఆ మెషిన్‌కు చెందిన డ్రమ్‌తో బాటు సైదు ఎగిరిపడ్డాడు. ఆ శబ్దం విన్న మామ బాషా అల్లుడిని పట్టుకున్నాడు. అప్పటికే విద్యుత్ షాక్ తగిలి ఉన్న సైదుతో బాటు బాషా కూడా అక్కడికక్కడే క్షణాల్లో మృతి చెందారు. పట్టణంలో కలకలం పట్టణంలో పేరు మోసిన చికెన్ సెంటర్ కావడంతో ఎప్పటి మాదిరిగానే దుకాణంలో ఎక్కువ రద్దీ ఉంది. ఉదయాన్నే కొనుగోలుదారులతో సందడిగా ఉంది. ఇంతలో జరిగిన ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతి చెందారు. కలలా జరిగిన ఈ సంఘటనతో వారంతా కలవరపడ్డారు. దాదాపు పాతికేళ్లుగా ఆ మార్కెట్‌తో బాషాకు అనుబంధం ఉంది. ఇన్నేళ్లుగా అందరి ఆదరణ చూరగొన్న ఆయన తన అల్లుడితో సహా కన్నుమూయడంతో పట్టణంలో విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనాథలైన రెండు కుటుంబాలు హడ్కోకాలనీకి చెందిన షేక్ బాషా పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య అమ్మాజీతో బాటు గోరీ, పీరు, మహీదా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు గోరీకి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన షేక్ సైదాతో నాలుగేళ్ల క్రితం వివాహం చేశాడు. బాషాకు మగ పిల్లలు లేకపోవడంతో అల్లుడు సైదాను నరసన్నపేట నుంచి చీపురుపల్లి తీసుకొచ్చాడు. తన వ్యాపారంతో బాటు కుటుంబాలను చూసుకునేందుకు తోడుగా ఉంటాడని భావించాడు. తానుంటున్న వీధిలోనే వేరే ఇంట్లో కూతురితో కాపురం పెట్టించారు. తన కుటుంబానికి ఎప్పటికైనా ఆసరాగా నిలుస్తాడని భావించాడు. కానీ విధి వక్రీకరించింది. విద్యుత్‌షాక్ రూపంలో వారి కలలను కల్లలు చేసింది. ఈ సంఘటనతో మగదిక్కు కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బాసటగా నిలిచిన వైఎస్సార్సీపీ నాయకులు.... చికెన్ సెంటర్లో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందిన సంఘటన తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఆ కుటుంబాలకు బాసటగా నిలిచారు. మృతుడు షేక్ బాషాకూడా పార్టీ సానుభూతిపరుడు కావడం... ముస్లిం వర్గానికి నాయకత్వం వహిస్తుండటంతో పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో బాటు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పార్టీ మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను సందర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
నగరంలో భారీ చోరీ
సాక్షి, శ్రీకాకుళం : నగరంలోని కత్తెరవీధిలో నివాసమంటున్న వాండ్రంగి శ్రీనివాసరావు ఇంట్లో శనివారం రాత్రి దొంగలుపడ్డారు. 32 తులాల బంగారం, రూ. 6 లక్షల నగదు, మూడు తులాల వెండి దోచుకెళ్లారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం పూరీ వెళ్లారు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి తాళాలను పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారం, నగదు, వెండిని తీసుకెళ్లారు. అయితే ఇంటి పైభాగంలో శ్రీనివాసరావు తల్లి దమయంతి నివాసముంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి ముందు ఓ వ్యక్తి ఉండడాన్ని దమయంతి గమనించి, ఎవరని ప్రశ్నించారు. తన కుమారుడు కాపలా ఉండమని చెప్పారా అని అడిగారు. దీంతో ఆ వ్యక్తి అవునని సమాధానం ఇచ్చాడు. ఉదయం 6 గంటల సమయంలో పాలు ఇచ్చేందుకు వచ్చిన మహిళ ఇంటి తాళాలు తీసి, లైట్లు వేసి ఉండడం గమనించి, విషయాన్ని శ్రీనివాసరావు తల్లి దమయంతికి తెలియజేశారు. ఇంట్లో చిందరవందరగా వస్తువులు, బీరువా తెరిచి ఉండడాన్ని గుర్తించారు. దీనిపై రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు హుటాహుటిన శ్రీకాకుళం చేరుకున్నారు. పోలీసుల పరిశీలన సంఘటన స్థలాన్ని శ్రీకాకుళం డీఎస్పీ చక్రవర్తి, సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ శంకరరావు పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రలను, ఆధారాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు. కత్తెర వీధి నుంచి గొంటి వీధి వరకు వెళ్లి అక్కడ ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద పోలీసు డాగ్ ఆగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రీనివాసరావు లైసెన్స్డ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాసరావు, దమయంతి ఫిర్యాదు మేరకు సీఐ శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైకో చేష్టలతో చనిపోతున్నా...
‘నేను చనిపోతే ఈ ఏరియాలో మాత్రమే విషయం తెలుస్తుంది.. కానీ నేను తులసీ(ప్రియుడు) అనే సైకో చేష్టల వల్ల ఇలా(సూసైడ్) చేసుకున్నానని బీహర్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో కూడా తెలియాలి. ఇది నా చివరికోరిక – మీనాక్షి డైరీ సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : ప్రేమించానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేధింపులకు గురి చేశాడు. చివరకు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడంతో కుటుంబ సభ్యుల పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది. ఐదు నెలలుగా తానూ ఏ విధంగా నరకం అనుభవించిందో తన డైరీలో రాసుకుని పెట్టుకుంది. చివరకు మంచినీటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పలాస మండలం గురుదాసుపురం గ్రామానికి చెందిన సొర్ర మీనాక్షి(25) మామిడిమెట్టు పంచాయతీ పరిధి రంగోయి గ్రామానికి సమీప రోడ్డు పక్కన ఉజ్జిడమ్మతల్లి గ్రామదేవత ఆలయం వద్ద బావిలో మృతదేహమై తేలింది. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు మోహనరావు, రూపావతిల ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, సునీతలకు వివాహాలయ్యాయి. చివరి కుమార్తె మీనాక్షి పలాస–కాశీబుగ్గలో ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదివింది. ఈమెతో కలిసి మందస మండలం రట్టి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అందాల తులసిరావు కలిసి ఇంటర్మీడియట్ చదివాడు. బీహార్ సీఆర్పీఎఫ్ యూనిట్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనతో పాత పరిచయం ఉన్నందున తన ఫోన్ నంబరు ఇచ్చింది. అప్పట్నుంచి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరకు సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేసి నరకం చూపించి చనిపోయే విధంగా ప్రేరేపించాడు. బావిలో మృతదేహం లభ్యం.. ప్రియుడు తులసీరావు పెట్టిన మానసిక వేధింపులు, తనకు చేసిన అన్యాయాన్ని మీనాక్షి ఈ నెల 5న తన డైరీలో రాసుకుని దాచి పెట్టుకుంది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు తన మొబైల్లో భద్రపరుచుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం రోడ్డు పక్కన బావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బహుశా శనివారం రాత్రి బావిలో పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే రెండు రోజులుగా కుమార్తె కనిపించకుండా పోయిందని, ఇంత దారుణానికి ఒడిగడుతుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ ఎస్ఐ మహమ్మద్‌ఆలీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సోమవారం ఉదయం బావిలో నుంచి తీయనున్నారు. సూసైడ్ నోట్లో.... ఒకప్పుడు తులసీ, కృష్ణ మంచి స్నేహితులు. తులసి నా విషయంలో చేసిన ప్రతీ అన్యాయం కృష్ణతో చెప్పుకునేదాన్ని. నా ఫోన్ నంబర్ తీసుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పే వ్యక్తి ఇలా చేస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కానీ పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే నా మనసు అంగీకరించట్లేదు. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ విలువేంటో నాక్కూడా తెలుసు. నేను పోతే నా కుటుంబానికి తులసీ వాళ్ల కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. కారణం నేనే అయినప్పుడు అందరికీ దూరమవుతున్నాను. తను కూడా వాళ్ల నాన్న ప్రాణం కంటే నాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. గర్వపడ్డాను.. తన మనస్సులో నాకు ఇంత మంచి స్థానం ఉందా అని? కానీ ఇప్పుడిప్పుడు అర్థమైంది. తనకు నా మీద ఉన్నది ప్రేమ కాదు. నన్ను అందరిలో పరువు తీసి నన్ను నరకం చూపించి నా లోకంలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చేంత వరకు నాకు తెలియలేదు. బతికే పది రోజులైనా ఏ టెన్షన్ లేకుండా సరదాగా బతకాలి అనుక్షణం భయంతో బతికితే ఆ బతుకే వేస్ట్ ఐ మిస్ యూ మై ఫ్యామిలీ. -
చదువుకుంటానని మేడపైకి వెళ్లి..
సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : రోజూ మాదిరిగానే మేడ మీదకు చదువుకుందామని వెళ్లిన విద్యార్థి విద్యుత్ షాక్ గురై మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘ నాయనా.. నువ్వెంతో ప్రయోజకుడవుతావని, ఎన్నో కలలు కన్నాం.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు పోయావా’ అంటూ.. వీరు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ విషాద సంఘటన గురువారం కొత్తూరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... కొత్తూరు గ్రామానికి చెందిన సారిపల్లి రామకృష్ణ, లక్ష్మి దంపతుల మొదటి సంతానం భార్గవ్(14) కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ తన ఇంటి శ్లాబ్‌పై అందరి పిల్లలతో కలిసి చదువుకుంటుంటాడు. అదే మాదిరిగా గురువారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ బల్బుకు విద్యుత్ తీగతో కనెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. ఒక్కసారిగా కిందపడి అపస్మారక స్థితి చేరుకున్న అతడిని స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానిక సీహెచ్‌సీలో చేర్పించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ వైద్యం అందించేసరికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించిన వీరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. సమాచారం మేరకు సీఐ ఎల్ సన్యాసినాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. -
‘అమ్మ’కు నగ్న వీడియో బెదిరింపులు..సూసైడ్ నోట్
అంజలీ నువ్వు బాగా చదువుకోవాలిరా.. నాన్న నీపైన పెట్టుకున్న హోప్స్ నువ్వు రీచ్ అవుతావని నా నమ్మకం. ఐషూ నువ్వు నా అమ్మవి.. నీ హెల్త్ బాగులేదని తెలిసి కూడా నిన్ను విడిచి వెళ్లిపోతున్నా.. నువ్వు ఎప్పుడూ భయపడకు. నేనెప్పుడూ నీతోనే ఉంటా.. కాళీ.. బాగా చదువుకో.. బాగా భోజనం చేయి.. నేను ఎలాంటి తప్పు చేయలేదు. విడిచిపోతున్నందుకు నన్ను క్షమించండి.. వాళ్లు ముగ్గురికీ శిక్ష పడాలి. అదే నా చివరి కోరిక. - ఓ తల్లి బిడ్డలను విడిచివెళిపోతూ రాసుకున్న చివరి మాటలివి.. అమ్మా అని పిలుస్తూనే తనపై కన్నేసిన ఓ కామాంధుడి వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఓ వివాహిత మూగ రోదనకు అక్షర రూపమిది.. పక్కింట్లో ఉంటూ కుటుంబానికి స్నేహితునిగా మెలిగిన వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకునేందుకు యత్నించడంతో.. అతని బెదిరింపులను భరించలేక ఓ గృహిణి (30) బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. పూర్తి వివరాలను తన డైరీలో సూసైడ్ నోట్ రూపంలో రాయడంతో వెలుగులోకి వచ్చిన విషయాలు సంచలనం సృష్టించాయి. సాక్షి, కంచిలి (శ్రీకాకుళం): ఆమెది ఓ చక్కనైన కుటుంబం. భర్త కీలు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు కంచిలి శాఖలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు ముత్యాల్లాంటి పిల్లలు. చుట్టుపక్కల వారిని కూడా సొంత మనుషుల్లా భావించే మంచితనం ఆమెది. ఆ సౌశీల్యాన్నే ఆ దుర్మార్గుడు దుర్వినియోగపరిచాడు. ఆమెకు నరకం చూపించాడు. బ్యాంక్ అధికారి సత్యనారాయణ కంచిలిలో తన కుటుంబంతో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న మాధవరావు వారి పక్క పోర్షన్లో అద్దెకు ఉండేవాడు. ఆ పక్క పోర్షన్లో ఈశ్వర్‌రెడ్డి, తులసి అనే దంపతులు ఉండేవారు. ఒకేచోట ఉంటున్న వీరి మధ్య స్నేహం ఏర్పడి కలుపుగోలుగా ఉండేవారు. నిందితుడు మాధవరావు మృతురాలిని, ఆమె భర్తను అమ్మా.. నాన్న.. అని పిలిచేవాడని తెలుస్తోంది. మృతురాలు సూసైడ్ నోట్లో రాసిన వివరాల ప్రకారం తనపై కన్నేసిన మాధవరావు.. ఆమె బాత్రూంలో స్నానం చేసే సమయంలో రహస్యంగా వీడియో, ఫోటోలు తీసి, ఆమెను భయపెట్టి లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తుండేవాడు. మాధవ్‌కు పక్క పోర్షన్లో ఉండే ఈశ్వర్‌రెడ్డి, తులసి దం పతులు సహకరించారు. ముగ్గురూ కలిసి తరచూ ఈ వీడియో, ఫోటోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని భయపెట్టేవారు. కానీ మృతురాలు ఈ విషయాన్ని భర్తకుగాని, కన్నవారికిగాని చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించేది. మృతురాలి కుమార్తె అంజలి వద్ద వివరాలు సేకరిస్తున్న ఎస్ఐ వెంకటేష్ (ఇన్సెట్లో) నిందితుడు మాధవ్ (ఫైల్) బదిలీపై వెళ్ళినా.. కొన్నాళ్ల తర్వాత మాధవ్ వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లిపోయాడు. అయినా ఆమెకు ఫోన్లు చేస్తూ, భర్త లేని సమయంలో వచ్చి భయపెడుతూ ఉండేవాడు. మాధవ్ పెడుతున్న వేధింపులను భరించలేక వారం రోజుల క్రితం భర్తకు, మిగతా కుటుంబ సభ్యులకు జరిగిందంతా ఆమె వివరించింది. మాధవ్‌ను పిలిచి వార్నింగ్ ఇస్తానని భర్త ఊరడించారు. ఇంతలో రెండు రోజుల క్రితం 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఎవరో వంటగది కిటికీ వద్దకు వచ్చి పిలిచి తనపై పువ్వు విసరడంతో భర్తకు చెప్పింది. పరిసరాల్లో వెతికినప్పటికీ ఎవరూ కన్పించలేదు. తాజా సంఘటనతో మరింత కుంగిపోయిన బాధితురాలు గురువారం మధ్యాహ్నం భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో.. పిల్లలకు భోజనం పెట్టి నిద్రపుచ్చిన తర్వాత వంటగదిలోనే సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకొంది. తన బలవన్మరణానికి మాధవ్, ఈశ్వర్‌రెడ్డి, తులసి దంపతుల మానసిక వేధింపులే కారణంగా పేర్కొంటూ తన డైరీలో వివరంగా రాసింది. మృతురాలికి భర్తతోపాటు పిల్లలు అంజలి (12), ఐశ్వర్య (10), రెండున్నరేళ్ల బాబు దేవిశ్రీప్రసాద్ ఉన్నారు. శైలజ మృతిపై తండ్రి సుద్దాల జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తూరు మండలానికి చెందిన ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగి అల్లాడ మాధవరావు, సంతబొ మ్మాళి మండలానికి చెందిన భార్యభర్తలు తులసి, ఈశ్వర్రెడ్డిలపై ఇన్చార్జి ఎస్ఐ కె.వెంకటేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. ఆత్మహత్య గురువారం మధ్యాహ్నమే జరిగినప్పటికీ.. రాత్రికి గానీ డైరీ గుర్తించకపోవడంతో శుక్రవారం ఉదయానికి గానీ సంఘటన వెలుగులోకి రాలేదు. -
అన్నయ్యా.. నా పిల్లలను బాగా చూసుకో...
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ‘నా భార్య పిల్లలను నీవే చూసుకోవాలి’ అని తన అన్నయ్య శ్రీనివాసరావుకు బాధాతప్తం హృదయంతో ఫోన్ చేసి మాట్లాడిన పలుకులే తమ్ముడు పిట్ట ఢిల్లీరావు(32)కు చివరివయ్యాయి. తన తలలో ఏర్పడిన కణితి బాధ భరించలేక, కుటుంబ సభ్యులకు భారం కాకూడదని నిర్ధారించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోంపేట పట్టణంలోని తెలగవీధికి చెందిన ఈయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సోంపేట పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్న ఈయన తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరచుగా తలనొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించారు. తలలో కణితి ఏర్పడిందని, ప్రమాదస్థాయిలో ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక తలనొప్పి తగ్గదని నిర్ధారించుకుని శుక్రవారం మధ్యాహ్నం 12 గంట ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయాన్ని అరగంట ముందు హైద్రాబాద్‌లో ఉంటున్న తన అన్నయ్యకు సమాచారం అందించాడు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పెద్ద కుమారుడికి భోజనం క్యారేజ్ తీసుకెళ్లిన భార్య తేజేశ్వరికి విషయం తెలిసి బోరుమని రోదించింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ కే వెంకటేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెల్లారిన బతుకులు
సాక్షి, ఆమదాలవలస(శ్రీకాకుళం): వారం వారం గుంటూరు వెళతారు.. అక్కడి నుంచి బలిష్టమైన గొర్రెలను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తారు.. హోల్‌సేల్ మార్కెట్‌కు వెళితే నాలుగు డబ్బులు మిగులుతాయన్నది వారి ఆశ.. అందుకే రాత్రి బయలుదేరి తెల్లారేసరికల్లా అక్కడికి చేరుకోవాలనుకున్నారు. గంటలో గమ్యస్థానం చేరుతామనగా చీకటి తెరలు వీడకుండానే రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన కోటిపల్లి శాంతారావు (25), జలుమూరు మండలం మాకివలసకు చెందిన బోర కన్నయ్య (48), శ్రీకాకుళం రూరల్ మండలం భైరివానిపేటకు చెందిన కింతలి సింహాచలం (వాహన యజమాని), శ్రీకాకుళం రూరల్ మండలం శిలగాం సింగివలసకు చెందిన కురిటి అప్పన్న, చొట్టవానిపేటకు చెందిన మురపాక శ్రీను గుంటూరులో గొర్రెలమండికి వెళ్లి గొర్రెలను కొనుగోలు చేసేందుకు టాటా మ్యాజిక్ వాహనంలో గురువారం రాత్రి బయల్దేరారు. మధ్యలో మరో యువకుడు వాహనాన్ని ఎక్కాడు. శుక్రవారం తెల్లవారుజామున మరో గంటలో గుంటూరులోని గొర్రెలమండి చేరుకోవాల్సి ఉండగా, జాతీయరహదారిపై పక్కన ఆపివున్న కంటైనర్‌ను వాహనం అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు ఘటనాస్థలిలో ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో కోటిపల్లి శాంతారావు గోరా కన్నయ్యలతో పాటు మధ్యలో ఎక్కిన గుర్తు తెలియని యువకుడు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన నాలుగు నెలలకే.. మృతుల్లో కోటిపల్లి శాంతారావుకు నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. ఆమదాలవలస మండలం సొట్టోడుపేటలో ఉన్న తన భార్య మాధవి ఇంటి నుంచి దసరాకు గొర్రెలు కొనుగోలుకు లగేజి వాహనంపై బయల్దేరాడు. శాంతారావు నడగాంలో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రమాద ఘటన తెలియడంతో రెండు గ్రామాల్లోనూ విషాదం అలుముకుంది. గుండె నిండా విషాదం నింపుకొని శాంతారావు తల్లిదండ్రులు బారికి వాడు, సూరమ్మలతోపాటు భార్య మాదవిలు హుటాహుటిన మంగళగిరి వెళ్లారు. -
మామపై కత్తితో అల్లుడి దాడి
సాక్షి, భామిని (శ్రీకాకుళం): కూతురు కాపురాన్ని చక్కదిద్దడానికి వచ్చిన మామపై అల్లుడు కత్తి దూశాడు. ఈ ఘటన మండలంలో గురువారం కలకలం రేపింది. గాయపరిచిన నిందితుడిని తండ్రే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు అప్పగించి ఫిర్యాదు చేయడం విశేషం. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి మామ వై చిన్నారావు మండలంలోని బిల్లుమడలోని తన అల్లుడు కే సంతోష్‌కుమార్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కూతురు, అల్లుడు తగాదా విషయమై మాట్లాడుతున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన అల్లుడు తనకు అందుబాటులో ఉన్న కత్తితో మామపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన నిందితుడు తండ్రి తవిటయ్య నేరుగా బత్తిలి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. అనంతరం గాయపడిన వై చిన్నారావును కొత్తూరు ఆస్పత్రిలో చేర్పించాడు. డాక్టర్ ప్రశాంత్ వైద్య సేవలందించి పాలకొండ ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. కొత్తూరు సీఐ ఎల్ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో బత్తిలి ఎస్సై అజార్ అహ్మద్ ఆస్పత్రిలో బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. -
టైతో ఉరేసుకున్న విద్యార్థి..
సాక్షి, శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం మండల పరిధిలోని శాస్త్రులపేట శివారులో ఉన్న ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల (మహాత్మా జ్యోతిబా పూలే) విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రేమసాయి పట్నాయక్ (14) బుధవారం వేకువ జామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వస్థలం టెక్కలి పట్టణంలోని రాచవీధి. తల్లి చిన్నప్పుడే మృతి చెందింది. తండ్రి రాంప్రసాద్ పట్నాయక్ చదివిస్తున్నాడు. విద్యార్థి తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆమెతో ప్రేమసాయి నిత్యం వివాదాస్పదంగా ఉంటున్నట్లు సమాచారం. విద్యార్థి మృతికి గల కారణం కుటుంబంలో గడిచిన కొన్నేళ్లుగా కలహాలు ఎక్కువగా ఉండటమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం వేధింపులు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఎలా జరిగిందంటే.. మంగళవారం రాత్రి ఎనిమిదో తరగతికి చెందిన 40 మంది విద్యార్థులతో స్టడీ అవర్స్‌కు వెళ్లి 9.30 గంటలకు తిరిగి వచ్చి డార్మింటరీలో అందరితోపాటే ప్రేమసాయి నిద్రపోయాడు. సమయం ఉదయం 5 గంటల 30 నిమిషాలైంది. రోజూ లాగానే యోగా టీచర్ వచ్చి విజల్ వేయడంతో విద్యార్థులంతా నిద్ర మేల్కోన్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఓ విద్యార్థి వెళ్లాడు. చివరి బాత్రూంలో ఉన్న ట్యాప్ నుంచి వాటర్ పడుతున్న శబ్ధాన్ని గమనించాడు. నీటిని కట్టేందుకు బాత్రూం తలుపు తీయబోయాడు. లోపల గెడ పెట్టి ఉండడంతో రంధ్రం గుండా చూసేసరికి తోటి విద్యార్థి అందులో వేళ్లాడి ఉండం గమనించాడు. తోటి విద్యార్థులతో కలిసి ఈ విషయాన్ని యోగా టీచర్‌కు, వాచ్‌మేన్‌కు చేరవేశాడు. ఆత్మహత్య చేసుకున్న తీరు ఇదీ.. స్కూల్ యూనిఫాంకు సంబంధించిన ఎరుపురంగు టైను మెడకు కట్టుకొని డార్మింటరీలోని 5 నంబర్ (చివరి) టాయిలెట్లో ఉన్న ట్యాప్ గుండా పైకి ఎక్కాడు. 12 అడుగుల ఎత్తులో ఉన్న కిటికీ గ్రిల్స్‌కు టైను కట్టి దానిని మెడకు బిగుంచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెల్సుకున్న స్కూల్ యాజమాన్యం వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ లక్ష్మణరావు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. స్కూల్లో జరిగే ప్రతి ఫంక్షన్లోనూ.. స్కూల్లో జరిగిన ప్రతి ఫంక్షన్లోనూ ప్రేమ్‌సాయి పట్నాయక్ ముందు ఉండేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ గీతాలు ఎక్కువగా ఆలపించేవాడన్నారు. ఈ నెల 14న హిందీ దివాస్‌కు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెండు రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రారంభమైన 9 నెలలకే.. మహాత్మాజ్యోతిభా పూలే స్కూల్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు 410 మంది విద్యార్థులున్నారు. 2019 మార్చి నుంచి తరగతులు ప్రారంభించారు. ఇంతలో ఈ అఘాయిత్యం జరగడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతులకు సంబంధించిన రెండో బ్లాక్‌లోనే ప్రేమ్‌సాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ బ్లాక్‌లో ఉండేందుకు విద్యార్థులంతా భయాందోళన చెందుతున్నారు. చూడగానే భయం వేసింది టాయిలెట్స్‌కు వెళ్లి తిరిగి వస్తుండుగా చివరి బాత్రూంలో ట్యాప్ నుంచి వాటర్ పడుతున్న శబ్ధం వచ్చింది. వెంటనే వెనక్కి వెళ్లి చూశాను. అప్పటికే ప్రేమ్‌సాయి పట్నాయక్ కిటికీ ఊచలకు వేళాడుతూ కనబడ్డాడు. భయంతో పరుగు తీస్తూ మా టీచర్‌కు, వాచ్ మేన్‌కు చెప్పాను. - కె.రామ్మోహన్ (తోటి విద్యార్థి) పొద్దున్నే నిద్ర లేపుతాను ప్రతి రోజు పొద్దున్నే విద్యార్థులందరికీ నేనే నిద్రలో నుంచి లేపుతాను. వేకువ జామున 5.30 కల్లా డార్మింటరీకి వెళ్లి విజిల్ వేయడంతో అందరూ గ్రౌండ్‌కు వచ్చేస్తారు. ఎవరైనా సిక్లో ఉంటే క్లాస్ లీడర్‌తో మాకు నేరుగా సమాచారం వస్తే వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. – ఎం.మధుసూదనరావు, పీఈటీ హాస్టల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు విద్యార్థి మృతిపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ప్రిన్సిపాల్ యు.గణపతి, హౌస్ టీచర్ జి.వి.రామ్‌ప్రసాద్, వాచ్‌మేన్ వి.సింహాచలంపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వీరి ముగ్గురికి జిల్లా వెనుకబడుల తరగతుల సంక్షేమ శాఖాధికారి కృతిక బుధవారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. - విద్యార్థి ప్రేమ్‌సాయి పట్నాయక్ -
హత్యా... ఆత్మహత్యా!
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం) : మండలంలోని పోతయ్యవలసకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన సాగునీటి కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని ఆదివారం ఉదయం నరసన్నపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ మృతదేహం అక్కడకు ఎలా వచ్చిందనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. కాలువలో ఎక్కువగా నీరు లేదు. పైగా దూరం నుంచి కొట్టుకు వచ్చే అవకాశం కూడా లేదు. ఆ ప్రాంతంలో పిచ్చిమొక్కలు అధికంగా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ బయట హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. శరీరంపైన గాయాలేమైనా ఉన్నాయా అని పరిశీలించడానికి వీలు కాలేదు. పూర్తిగా ఉబ్బి గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం పొలానికి వెళ్తున్న కొంతమంది రైతులు ఇక్కడ కాలువలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఎస్ఐ వీ సత్యనారాయణ, ఏఎస్ఐ నాగభూషనరావు వెళ్లి పరిశీలించారు. శరీరంపై లుంగీ, చుక్కల షర్ట్ ఉన్నాయి. వేలికి గోలిరంగు ఉంది. దుస్తుల్లో వెతికినా ఏ విధమైన ఆధారాలు దొరకలేదు. శ్రీకాకుళం రిమ్స్ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మృతుని ఆచూకీ తెలిస్తే నరసన్నపేట పోలీసులకు సంప్రదించాలన్నారు. -
రాజాంలో దొంగల హల్చల్
సాక్షి, రాజాం : రాజాం పట్టణంలో సోమవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. దేవాలయాల్లోని హుండీలనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలోని సంతమార్కెట్‌లోని మల్లికార్జునస్వామి ఆలయంలో రెండు హుండీలు, కాకర్లవీధి శివాలయంలోని హుండీ, పుచ్చలవీధి శివారులో ఉన్న వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయ హుండీ, చీపురుపల్లి రోడ్డులోని అభయాంజనేయస్వామి దేవాలయంలోని హుండీని పగులుకొట్టి అందులోని నగదును దోచుకున్నారు. ఈ ఆలయాలన్నీ దగ్గర, దగ్గరగా ఉండడంతో చోరీలు వెంటవెంటనే జరిగినట్లు పోలుసీలు భావిస్తున్నారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలకు ఏదో అడ్డంపెట్టి ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. అందులోని ఒక కెమెరాలో మాత్రమే ఓ వ్యక్తి చెందిన ఫుటేజీ దొరికింది. ఉదయం యథావిధిగా ఆలయాలకు వెళ్లిన పురోహితులు, ఆలయ సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఒకేరోజు నాలుగు ఆలయాల్లో దొంగతనాలు జరిగిన వార్త పట్టణంలో వ్యాపించడంతో సంచలనంగా మారింది. దొంగతనం జరిగిన కాకర్లవీధి శివాలయం, వాసవీకన్యకాపరమేశ్వరి దేవాలయాలు రాజాం పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండడం విశేషం. దొంగతనం జరిగినట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఫుటేజీలో ఉన్నది ఎవరు? కన్యకాపరమేశ్వరి ఆలయంలో సీసీ కెమెరాకు చిక్కిన నిందితుని ఫొటో ఆధారంగా పోలీసులు కేసును ఛేదించే పనిలో ఉన్నారు. 12.45 గంటల సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు సీసీ ఫుటేజీలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సూర్యకుమారి తెలిపారు. -
నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ఒడిశా విద్యార్థిని తృప్తిమయి పండా హత్య కేసు నిందితుడు మూడేళ్ల తర్వాత సోంపేట పోలీసులకు నేరుగా లొంగిపోయాడు. 2016లో బేసిరామచంద్రాపురం పరిసరాల్లో సంచలనం సృష్టించిన విద్యార్థిని హత్య కేసు మిస్టరీ వీడింది. మూడేళ్లుగా నిందితుడి కోసం దేశంలో ప్రధాన పట్టణాలైన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, పూణే తదితర ప్రాంతాల్లో సోంపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. ఎట్టకేలకు నిందితుడే నేరుగా సోంపేట పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. పెను సంచలమైన కేసు.. సోంపేట సీఐ కె.శ్రీనివాసరావు మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండలంలోని బేసిరామచంద్రాపురం జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని యువతి (23) మృతదేహం 2016 ఆగస్టు 27వ తేదీన లభ్యం అయ్యింది. అప్పట్లో ఈ కేసు పెను సంచలనమైంది. ఒడిశాలోని ఛత్రపురం గ్రామానికి చెందిన బివేకానంద పండా, స్వర్ణమయు పండాల కుమార్తె తృప్తిమయి పండాగా తర్వాత గుర్తించారు. ఈ హత్య కేసు ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తృప్తిమయి పండా, తన డిగ్రీ క్లాస్మేట్ సిక్కల్ కుమార్ బెహరాలు సన్నితంగా మేలిగేవారు. ఒడిశాలోని ఛత్రపురంలో డిగ్రీ పూర్తి చేసుకున్న తృప్తిమయి పండా బరంపురం కల్లికట్ కళాశాలలో ఎం.సీ.ఏ ప్రథమ సంవత్సరంలో చేరింది. స్నేహితురాలు అనురాధతో కలిసి ప్రైవేట్ వసతిగృహంలో ఉండేది. అనుమానంతోనే హత్య.. సిక్కల్ కుమార్ బెహరాది ఫ్యాక్షన్ కుటుంబం కావటంతో సోదరుడు సుకుడా బెహరాను వ్యతిరేకవర్గం హత్య చేసింది. సిక్కల్ కుమార్ బెహరా వర్గంలోని కొందరు సభ్యులు అవతలి వర్గం వారిని మట్టుపెట్టారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సక్కల్ కుమార్ బెహరా హైదరాబాద్ వెళ్లాడు. ఇంతలో తృప్తిమయి పండా బరంపురంలో ఓ కానిస్టేబుల్‌తో ప్రేమలో పడిందని సుకుమార్ అనుమానించాడు. తనను దూరం పెడుతుందని మానసిక క్షోభకు గురయ్యాడు. తృప్తిమయి పండా స్నేహితురాలు అనురాధకు ఫోన్ చేసి తాను హైదరాబాద్ నుంచి బరంపురం వస్తున్నానని, తృప్తిమయి పండాను కలవాలనుకుంటున్నానని తెలిపాడు. అనురాధ వీరిద్దరినీ 2016 ఆగస్టు 25న బరంపురంలో కలిపింది. తృప్తిమయి పండాకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై బరంపురం నుంచి బారువ బీచ్‌కు తీసుకువచ్చాడు. ఆగస్టు 26వ తేదీ రాత్రి బారువ నుంచి బరంపురం తిరుగు ప్రయాణం సమయంలో బేసిరామచంద్రాపురం లేఅవుట్ వద్ద కాసేపు ఆగారు. ఇద్దరి మధ్యన తీవ్ర గొడవ జరిగింది. నిందితుడు తీసుకువచ్చిన కత్తితో తృప్తిమయి పండా గొంతుకోసి, పొట్టపై మూడుసార్లు పొడిచి హత్య చేశాడు. ఆ కత్తిని అక్కడే దాచి పెట్టాడు. అక్కడి నుంచి బరంపురం వెళ్లాడు.తనకు హైదరాబాద్‌లో పని ఉందని ఇంటి వద్ద చెప్పి వెళ్లిపోయాడు. పోలీసులు కేసును అప్పుడే ఛేదించినా నిందితుడు ఆచూకీ లభ్యం కాలేదు. నిందితుడే స్వయంగా పోలీసులకు లొంగిపోయి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ మేరకు నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టుకు (రిమాండ్‌కు) తరలించినట్లు సీఐ తెలిపారు. బారువ ఎస్ఐ నారాయణస్వామి, పోలీసు సిబ్బంది సతీస్‌కుమార్, లోకనాథం, మథు, ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం
రెప్పపాటు కాలంలో మొత్తం జరిగిపోయింది. కళ్ల ముందే కష్టార్జితం బూడిదపాలైంది. ప్రమాదాన్ని నివారించేలోగానే అంతా ఆవిరై చివరకు కట్టుబట్టలే మిగిలాయి. ఈ ఎస్సీ కాలనీలో నివసిస్తున్న వారంతా ఉపాధి కూలీలు. తమ ఇళ్లు మంటలపాలయ్యాయని తెలుసుకొని పరుగు పరుగున వచ్చిన వారికి మొండిగోడలు దర్శనమివ్వడంతో కుప్పకూలిపోయారు. కొందరి ఆర్తనాదాలు మిన్నంటగా.. మరికొందరు సొమ్మసిల్లిపోయారు. సాయం చేసేందుకు ముందుకు వచ్చిన గ్రామస్తులు బాధితులను ఓదార్చడమే తప్ప జరిగిన నష్టాన్ని నివారించలేని పరిస్థితి.. ఇవీ రాజాం మండలంలోని పొగిరి గ్రామంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనిపించిన దృశ్యాలు. సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : వారంతా నిరు పేదలు.. కాయకష్టం చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి బతుకులు ఈడుస్తున్నవారు.. కూలికి వెళ్తేనే గానీ పూట గడవని దుస్థితి. వచ్చిన కాస్తో కూస్తో కూలీ డబ్బులను ఇళ్లలోనే దాచుకుని అవసరానికి వినియోగించుకునే అల్పజీవులే వీరంతా. సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో వీరంతా కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. పొగిరి గ్రామంలోని ఎస్సీ కాలనీలో జె.గౌరి ఇంటి సమీపంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దగ్గర్లోని విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి ఉంటాయని గ్రామస్తులు భావిస్తున్నారు. ఆ సమయంలో ఈ కాలనీలో నివాసముంటున్నవారంతా ఉపాధి పనులకు వెళ్లిపోయారు. దీంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించేవరకూ ప్రమాదాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. అగ్నికి వాయువు తోడు కావడంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించాయి. గ్రామంలో ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాద విషయాన్ని ఉపాధి పనుల్లో ఉన్న బాధితులు తెలుసుకుని తమ ఇళ్లకు చేరుకునే సమయానికే మొత్తం నష్టం జరిగిపోయింది. అప్పటికే ఈ పూరిళ్లలో ఉన్న వంట గ్యాస్ బండలకు అగ్ని అంటుకొని అవి పేలడంతో మంటల వ్యాప్తి అధికమైంది. మంటలను అదుపు చేసేందుకు వెళ్లిన యువకులు, గ్రామస్తులు సైతం గ్యాస్ బండల పేలుళ్లను తట్టుకోలేక, ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయలేక భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. ఈలోగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి చొప్పున రెండు వీధుల్లో మంటలు వ్యాపించి మొత్తం 31 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా నష్టం... ఈ ప్రమాదంలో బాధితులకు భారీ నష్టమే మిగిలింది. ఇళ్లల్లోని మొత్తం వస్తు సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో పూరిళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. చౌడువాడ వెంకటరమణకు చెందిన రూ.40 వేలు నగదు మొత్తం కాలిపోయింది. 11 ఇళ్లలో బీరువాలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. నాలుగు ఇళ్ల నుంచి గ్యాస్ బండలు పెద్ద శబ్దం చేస్తూ పేలాయి. పన్నెండు కుటుంబాలకు చెందిన టీవీలు పూర్తిగా కాలిపోయాయి. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికేట్లు మొత్తం బూడిదయ్యాయి. పాపారావుకు చెందిన సౌండ్ సిస్టమ్ మొత్తం కాలిపోవడంతో ముద్దముద్దలుగా దర్శనమిస్తోంది. పలువురు బాధితులకు చెందిన ఎల్ఐసీ బాండ్లు, బ్యాంకు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు, కరెంటు మీటర్లు, బంగారు అభరణాలు వంటివి మొత్తం బూడిదయ్యాయి. వీటిని చూసి బాధితుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. కొంతమంది బాధితులు ఈ ప్రమాదాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపడిపోయారు. ప్రమాదం జరిగే సమయానికి వేరే ప్రాంతాల్లో ఉన్న బాధితులు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని ఇంటికి చేరుకోగానే మొండిగోడలు చూసి లబోదిబోమంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా విలపిస్తూ చెట్టుకొకరు.. పుట్టకొకరుగా రోడ్డున పడ్డారు. ఈ ప్రమాదంలో రూ.9 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు రెవెన్యూ అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. బాధితులకు తక్షణ సాయం నిమిత్తం ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. యువత సేవా కార్యక్రమాలు ప్రమాద స్థలం వద్దకు గ్రామానికి చెందిన యువకులు చేరుకుని తొలుత మంటలను అదుపుచేసేందుకు సాహసించారు. కాలిపోతున్న ఇళ్ల నుంచి గ్యాస్ బండలు పేలడంతో ప్రమాద తీవ్రత అధికం కావడంతో ప్రజలను అప్రమత్తం చేసి ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా సేవలు అందించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు పొగిరి లెనిన్, జడ్డు జగదీష్, కామోదులు శ్రీరంగనాయుడు, శనపతిరాము తదితరులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని బాధితులకు సాయం అందించారు. బాధితులుకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటుచేశారు. రాజాం టౌన్ సీఐ సోమశేఖర్‌తోపాటు తహశీల్దార్ పి.వేణుగోపాలరావు, ఆర్ఐ శివకృష్ణ తదితరులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని బాధితుల వద్ద వివరాలు సేకరించారు. తక్షణ నష్టపరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితులకు రెడ్‌క్రాస్ సాయం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న రాజాం రెడ్‌క్రాస్ ప్రతినిధి కొత్తా సాయిప్రశాంత్‌కుమార్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్రావుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన అక్కడి నుంచి ప్రతి కుటుంబానికి ఒక వంటసామగ్రి కిట్‌తోపాటు దోమల తెర, దుప్పట్లు తీసుకొచ్చి పొగిరిలో 31 అగ్నిప్రమాద కుటుంబాలకు అందించారు. గ్రామ పెద్ద పొగిరి లెనిన్ చేతుల మీదుగా వీటిని బాధితులకు అందజేశారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు చెప్పారు. విజయవాడలో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఆయన అగ్ని ప్రమాద ఘటనపై స్పందించా రు. విజయవాడ నుంచి రాజాం మండలంలోని అధికారులకు ఫోన్ చేసి బాధితులకు సహాయం అందించాలని ఆదేశించారు. స్థానిక నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని బాధితులతో మాట్లాడారు. తక్షణ ప్రభుత్వం సాయం అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. -
ప్రాణం తీసిన బిందె
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : తాగునీటి కోసం మహిళల మధ్య తలెత్తితున్న చిన్నపాటి ఘర్షణలతో ప్రాణాలు పోతున్న ఉదంతాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పట్టణంలోని పల్లివీధిలో ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన గొడవ ఓ మహిళా ప్రాణం తీసేందుకు కారణమైంది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎస్ఐ కే వెంకటేశ్ వివరాల ప్రకారం... సోమవారం ఉదయం 6–30 గంటల సమయంలో ఉద్దానం రక్షిత పథకం నుంచి తాగునీరు సరఫరా అయ్యింది. రోజూ నీటి సరఫరా సమయంలో లైన్లో బిందెలు పెట్టుకోవడం వీధివారికి ఆనవాయితీ. ఈ సమయంలో తాతపూడి పద్మ(36), ఈమె తల్లి తెప్పల ఈశ్వరమ్మల కంటే వెనుక వచ్చిన అదేవీధికి చెందిన తెప్పల సుందరమ్మ బిందెలు పెట్టడంతో చిన్నపాటి ఘర్షణ ఏర్పడింది. ఆ తర్వాత సుందరమ్మ కుళాయి నుంచి తన ఇంటికి వెళ్లిపోయింది. వారిద్దరూ ఎన్నో మాటలు అంటున్నారని కుళాయి దగ్గర ఉన్న మరో మహిళ గున్నమ్మ సుందరమ్మకు చెప్పింది. వెంటనే సుందరమ్మ అక్కడకు వచ్చి గొడవ పడింది. ఖాళీ బిందెతో దాడి చేసి, పద్మను జుత్తు పట్టి లాగడంతో కింద పడి పోయింది. దీంతో ఎడమ చెంపపై బయటకు కనిపించని తీవ్ర గాయం కావడంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా వీధివాసులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలు పద్మ, సుందరమ్మ కుటుంబీకులు దగ్గర బంధువులు కావడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లి మృతదేహం వద్ద కుమార్తె రోదిస్తున్న తీరు స్థానికులను కన్నీళ్లు తెప్పించింది. పద్మ భర్త ప్రసాద్ ఫిర్యాదు మేరకు సోంపేట ఎస్ఐ 304/2 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.