విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు నిర్మల(ఫైల్)
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: మున్సిపాలిటి పరిధిలోని బెల్లుపడ గ్రామం పెద్దకొండవీధికి చెందిన నీలాపు నిర్మల(29) అనే వివాహిత శుక్రవారం వేకువజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వేపోలీసులు, మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక టోల్ ప్లాజాలో పనిచేస్తున్న నీలాపు పురుషోత్తంతో బెల్లుపడ పెద్ద కొండవీధికి చెందిన నిర్మలకు 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు దిలీప్, ప్రేమ్, కుమార్తె నిహారిక ఉన్నారు. తనతో ఫోన్‌లో మాట్లాడాలంటూ నిర్మలను అదే గ్రామానికి చెందిన బి.గంగాధర్ అనే యువకుడు కొంతకాలంగా వేధిస్తున్నాడు. గురువారం సాయంత్రం కూడా ఫోన్‌లో మాట్లాడి వేధింపులకు గురిచేయడాన్ని భర్త గమనించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమయ్యాడు.
ఇప్పుడే వద్దని, శుక్రవారం ఇద్దరం కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్దామని చెప్పిన నిర్మల కొద్దిసేపటి తర్వాత అదే గ్రామంలో ఉన్న కన్నవారింటికి వెళ్లింది. రాత్రికి అక్కడే నిద్రపోయి శుక్రవారం వేకువజామున లేచి స్థానిక రైల్వేస్టేషన్‌కు చేరుకుని బరంపురం వైపు వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిర్మల భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ కె.రవికుమార్ తెలిపారు. కాగా, నిర్మల మృతితో బెల్లుపడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment