
హిరమండలంలో బైక్‌పై వెళ్తున్న దొంగలు
శ్రీకాకుళం, కొత్తూరు: మండల కేంద్రంలో సోమవారం ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా పరుగులు తీయండంతో స్థానికంగా కలకలం రేపింది. బంగారానికి మెరుగు పెడతామనే నెపంతో హిరమండలంలో ఇద్దరు యువకులు పుస్తెలతాడుకి తీసుకొని బైక్‌పై పరారయ్యారు. దీనిపై హిరమండలం పోలీసులు.. కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందివ్వడంతో పాటు సీసీ కెమెరా పుటేజ్‌లను పంపించారు. అప్రమత్తమైన ఎస్‌ఐ వై.రవికుమార్ తన సిబ్బందితో కొత్తూరులో అపరిచిత వ్యక్తులపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో హిరమండలం నుంచి వచ్చే వాహనాలను నిశితంగా పరిశీలించి, అనుమానం ఉన్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. ఇందులో భాగంగా బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపే ప్రయత్నం చేయగా..
వారు నిలుపుదల చేయకుండా అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారిని పోలీసులు వెంబడించగా.. ఇరువురూ తలో దారిలో తప్పించుకున్నారు. ఇందులో ఒకరిని గ్రామంలోని రజక వీధి వద్ద మహిళలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో యువకుడు వీధిలో పరుగులు తీస్తూ అటుగా బైక్ మీద వెళ్తున్న ఏ.భగవాన్‌కు సాయం కోరాడు. అయితే యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వాహనదారుడు... అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. దీనిపై ఇరువురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వివరాలను సేకరించారు. ఇద్దరు యువకులు ఒడిశాలోని ఖండవ గ్రామానికి చెందిన మీసాల అర్జున్, జొన్ని కొలియో అని ఎస్‌ఐ తెలిపారు. అయితే తాము కొత్తూరులో సినిమా చూసేందుకు వచ్చామని, పోలీసులు బైక్‌ను నిలుపుదల చేసే సరికి హెల్మెట్ లేకపోవడంతో భయంతో పరుగులు తీసామని తెలిపినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు బయటకు వెల్లడించని పోలీసులు.. యువకులను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
మెరుగు పేరిట బురిడీ
హిరమండలం: బంగారానికి మెరుగు పెట్టిస్తామని మాయమాటలు చెప్పి ఓ మహిళా నుంచి రెండు తులాల బంగారు పుస్తెల తాడును తీసుకొని ఇద్దరు యువకులు ఉడాయించారు. మండలంలోని కైవాడ వీధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఆ వీధిలో సోమవారం మధ్యాహ్నం సమయంలో పి.ఏకాసమ్మ అనే మహిళ ఒంటరిగా వద్దకు వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల.. బంగారానికి మెరుగు పెడతామని నమ్మబలికారు. దీంతో బాధితురాలు మెడలో ఉన్న బంగారాన్ని వారికి అందించగా.. ఆమెను మాటల్లో పెట్టి, అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో ఏకాసమ్మ పోలీసులను ఆశ్రయించగా.. ఎస్‌ఐ కె.గోవిందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దీనిపై స్థానిన దుకాణంలో ఉన్న సీసీ పుటేజ్‌లో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై వివరాలు సేకరిస్తున్నారు.