నిందితుడిని పట్టించిన తల వెంట్రుకలు | Mahanthi Murder Case Mystery Reveals in Srikakulam | Sakshi
Sakshi News home page

వీడిన యువతి హత్యకేసు మిస్టరీ

Published Thu, Feb 21 2019 8:42 AM | Last Updated on Thu, Feb 21 2019 8:42 AM

Mahanthi Murder Case Mystery Reveals in Srikakulam - Sakshi

కనకలత మహంతి(ఫైల్‌ ఫొటో)

శ్రీకాకుళం: సోంపేట మండలం బేసి రామచంద్రాపురంలో ఈ నెల 16న జరిగిన కనకలత మహంతి (22) హత్య కేసు మిస్టరీ వీడింది. మృతదేహం వద్ద లభించిన తల వెంట్రుకలే నిందితుడ్ని పట్టించాయి. సంఘటన జరిగిన నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ వెంకటరత్నం నగదు రివార్డులను బుధవారం అందజేశారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు.

టవల్‌తో గొంతు బిగించి హత్య..
హత్య జరిగిన తర్వాత కనకలత తల్లి రాధామణి మహంతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారని ఎస్పీ తెలిపారు. కనకలత మహంతి ప్రతిరోజూ స్నానం కోసం చెరువుకు వెళ్తుండేదని, అక్కడికి దగ్గరలోనే కల్లు దుకాణం ఉండడంతో ఆ దిశగా పోలీసులు దృష్టి సారించారని, పోస్టుమార్టం రిపోర్టులో సైతం గొంతు బిగించి చంపినట్లు తేలడం, సంఘటన స్థలంలో టవల్‌ లభించడంతో కేసు కొలిక్కి వచ్చిందన్నారు. కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, క్లూస్‌టీం ఆధారాలు సేకరించిందని చెప్పారు. సంఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరిగిన సీల తాతారావుపై సిబ్బంది దృష్టి సారించారని, మృతదేహంపై గోరు గాయాలు ఉండగా, తాతారావు శరీరంపైనే గోటి గాయాలు ఉండడంతో అనుమానం పెరిగిందన్నారు.

ఇతనికి నేరచరిత్ర ఉండడంతో నిఘా పెట్టారని పేర్కొన్నారు. మృతదేహం వద్ద లభించిన కొన్ని తల వెంట్రుకలను క్లూస్‌ టీం సేకరించారని, వాటిని చూడగా తాతారావుపై అనుమానం మరింత పెరిగిందని చెప్పారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. యువతి స్నానం చేస్తున్నప్పుడు కొద్దిరోజులుగా చూసేవాడని, అవకాశం కోసం ఎదురుచూస్తుండగా ఒంటరిగా ఆ రోజు స్నానానికి వెళ్తున్న కనకలత మహంతిని చూసి వెంబడించాడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెపై చేయి వేయగా భయపడటంతో మెడలో ఉన్న టవల్‌తో గొంతు బిగించి చంపినట్టు ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. సంఘటన జరిగినట్లు ముందుగా గ్రామస్తులకు చెప్పింది కూడా తాతారావేనని పేర్కొన్నారు. తాతారావును బుధవారం కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసులో ఇచ్ఛాపురం సీఐ కె.పైడపునాయుడు, సోంపేట ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గాప్రసాద్, మహిళా ఎస్‌ఐ ఎన్‌.గౌరి, కానిస్టేబుళ్లు కనకరాజు, లోకనాథం, ప్రసాద్, సతీష్, శ్రీను తదితరులు చురుగ్గా వ్యవహరించారని, వారికి నగదు రివార్డులను అందిస్తున్నట్లు చెప్పారు.

విలేకరులతో మాట్లాడుతున్న ఎస్పీ వెంకటరత్నం
జంట హత్య కేసులో పురోగతి..
శ్రీకాకుళం నగరంలో ఈ నెల 7న జరిగిన జంట హత్య కేసులో కూడా పురోగతి సాధించామని ఎస్పీ చెప్పారు. మరికొంత దర్యాప్తు జరగాల్సి ఉందని, త్వరలోనే ఆ కేసును కూడా ఛేదిస్తామన్నారు. సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement