mahanthi
-
మహంతు గారి'గది'
శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి హథీరాంజీ మఠం ద్వారా ఇచ్చిన ఆభరణాలు మాయయ్యాయి. కానుకల రూపంలో ఇచ్చిన వందలాది ఎకరాల భూములకు సంబంధించిన పక్కా సమాచారం లేదు. భూములు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులు మహంతు అర్జున్దాస్ఉంటున్న గదిలో దాచిపెట్టారని భావిస్తున్నారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అర్జున్‌దాస్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఒకరోజు ముందే విషయం తెలుసుకున్న అర్జున్‌దాస్ కనిపించకుండా పోయారు. ఆయన ఉంటున్న గది తాళాలు కూడా కనిపించలేదు. వారం రోజులు వేచి ఉన్న అధికారులు సోమవారం రెవెన్యూ అధికారులు, మఠం ప్రత్యేక అధికారి శ్రీకాళహస్తి ఈఓ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో తాళాలు పగులగొట్టి పత్రాలను స్వాధీనంచేసుకున్నారు. సాక్షి, తిరుపతి: హథీరాంజీ మఠం మహంతు గది తాళాలు పగులగొట్టి రెవెన్యూ, ప్రత్యేక అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అవినీతి గుట్టు రట్టవుతుందని భక్తులు భావిస్తున్నారు. కలియుగ వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వరునికి ఎంతో మంది రాజులు, చక్రవర్తులు హథీరాంజీ మఠం ద్వారా భూములతోపాటు వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలు కానుకలుగా సమర్పించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడు పర్యాయాలు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో కిరీటాలు, కంఠాభరణాలు, దేవుని ప్రతిమలతో పాటు అత్యంత విలువైన వజ్రాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు పూజా పాత్రలు, బంగారు ప్లేట్లు ఉన్నాయి. వీటిలో అత్యంత విలువైన పచ్చతోపాటు ప్రత్యేకమైన బంగారు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రలో స్వామివారికి నైవేద్యంగా పాలు ఇచ్చేవారట. ఎన్నో ఆరోపణలు స్వామివారికి మఠం ద్వారా అందిన బంగారు కానుకల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కొంత మంది మహంతులు వాటిని కరిగించినట్లు చెబుతున్నారు. 1968 ప్రాంతంలో మఠం నిర్వాహకులపై ఆరోపణలు వచ్చాయి. మఠానికి చెందిన బంగారు నగలను స్వాహా చేసినట్లు అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. కొంతమందిపై కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. అప్పట్లో జోక్యం చేసుకున్న దేవదాయ ధర్మాదాయ శాఖ హథీరాంజీ మఠానికి చెందిన బంగారు నగలను బ్యాంకుల్లో భద్రపర్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 1968–1969 ప్రాంతంలో మఠం నగలను చంద్రగిరితో పాటు తిరుపతిలోని బ్యాంకుల్లో భద్రపరిచారని, దాదాపు ఆరు చెక్కపెట్టెల్లో ఆ నగలను ఉంచినట్లు సమాచారం. ఎప్పుడైనా ఆ నగలను మఠం నిర్వాహకులు చూడాలంటే చిత్తూరులోని ప్రధాన కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ లాకర్లలో ఉంటున్న బంగారు నగల వివరాలను ఒక రిజిస్టర్లో నమోదుచేశారు. స్థిర చరాస్తులకు సంబంధించిన ఆ రిజిస్టర్లో మఠానికి చెందిన ఏయే నగలు ఉన్నాయి, వాటి బరువెంత.. తదితర వివరాలను పొందుపరిచారని తెలిసింది. మహంతులు వచ్చాకే.. 1975లో హథీరాంజీ మఠానికి దేవేంద్రదాస్ మహంతుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మహంతుకు పట్టాభిషేకం నిర్వహించారు. దీంతో బ్యాంక్ లాకర్లలోఉన్న బంగారు నగలను కోర్టు అనుమతితో దేవేంద్రదాస్ పట్టాభిషేకానికి వినియోగించారని తెలి సింది. ఆరునెలలకొకసారి లాకర్లలోని నగలను పరిశీలించాల్సి ఉంది. చెక్క పెట్టెలు తుప్పుబట్టాయా? బంగారు నగలు రంగు మారాయా? వంటి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. కానీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆ నగల పరిస్థితి ఏంటో తెలియదు. కొంతమంది మహంతులు కోర్టు అనుమతితో బ్యాంకు లాకర్లు తెరిచినట్లు సమాచారం. ఆ సందర్భంలోనే బంగారు నగల వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. అసలు నగల స్థానంలో గిల్టువి పెట్టినట్టు ప్రచారం ఉంది. రికార్డులను తనిఖీ చేస్తున్న అధికారులు 2006 తర్వాత గోల్మాల్ జరిగిందా? ప్రస్తుతం హథీరాంజీ మఠం మహంతుగా ఉంటున్న అర్జున్ దాస్ 2006లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్య కాలంలోనే నగలు గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2018 మార్చిలో లోకాయుక్త కోర్టు హథీరాంజీ మఠం నగల వివరాలను ఆరా తీసింది. 16 ప్రశ్నలను సంధించింది. మఠానికి సంబంధించి ఎలాంటి నగలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడైనా వాటిని పరిశీలించారా? అంటూ మఠంతో పాటు దేవదాయ ధర్మాదాయ శాఖను ప్రశ్నించింది. దేవదాయ శాఖ, ఇటు మఠం నిర్వాహకుల నుంచి సరైన సమాధానం రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పుణేలో భూముల కొనుగోలు? శ్రీవారికి కానుకల రూపంలో హథీరాంజీ మఠం ద్వారా మొత్తం 250 రకాల బంగారు ఆభరణాలు, నాణేలు, కిరీటాలు సమర్పించినట్లు సమాచారం. వీటన్నింటినీ చంద్రగిరిలోని ఓ బ్యాంక్ లాకర్లో ఉంచారు. మహంతులు వచ్చాక ఆ ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సస్పెన్షన్‌కు గురైన అర్జున్‌దాస్ వద్దే బ్యాంక్ లాకర్ తాళాలు ఉంచుకున్నారు. ఆయన కొద్ది రోజులుగా కనిపించకుండాపోయారు. కానుకల రూపంలో కోట్లు విలువచేసే ఆభరణాలు ఎక్కడ ఉంచారనే లెక్కలు అర్జున్ దాస్‌కు తప్ప మఠం నిర్వాహకుల వద్ద లేవు. లాకర్లో దాచి ఉంచిన వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు అమ్మి పుణేలో అర్జున్‌దాస్ బంధువుల పేరున 200 ఎకరాలను కొనుగోలు చేసినట్లు మఠంలో పనిచేసే వారు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలపై ఇన్చార్జి దృష్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాళహస్తి ఆలయ ఈఓ చంద్రశేఖరరెడ్డి నాలుగు రోజులుగా మఠంలో అధికారులతో సమావేశమవుతున్నారు. మఠం బ్యాంకు ఖాతా లపై ఆయన దృష్టి సారించారు. ఖాతాల్లోని మఠం సొమ్ము బయటకు వెళ్లకుండా చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకూ ఉన్న మహంత్ అర్జున్‌దాస్‌ను తప్పించినట్లు మఠానికి సంబంధించి ఖాతాలు ఉన్న ఏడు బ్యాంకులకు లేఖ రాశారు. ఇక నుంచి అన్ని కార్యకలాపాలు తామే చూసుకుంటామని స్పష్టం చేశారు. మహంతు గది తాళాలు పగులగొడుతున్న అధికారులు ఆ గది తాళాలు పగులగొట్టిన అధికారులు మహంత్ అర్జున్‌దాస్ ఉంటున్న గదిని తెరిస్తే తప్ప నిజానిజాలు వెలుగుచూసే అవకాశం లేదని మఠం సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ఆ గది తాళాలను రెవెన్యూ అధికారుల సమక్షంలో సోమవారం పగులగొట్టారు. గదిలో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఎన్ని పత్రాలు ఉన్నాయనే వివరాలను లెక్కించే పనిలో పడ్డారు. రికార్డులను పరిశీలించడానికి మరి కొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేశాక పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
నిందితుడిని పట్టించిన తల వెంట్రుకలు
శ్రీకాకుళం: సోంపేట మండలం బేసి రామచంద్రాపురంలో ఈ నెల 16న జరిగిన కనకలత మహంతి (22) హత్య కేసు మిస్టరీ వీడింది. మృతదేహం వద్ద లభించిన తల వెంట్రుకలే నిందితుడ్ని పట్టించాయి. సంఘటన జరిగిన నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ వెంకటరత్నం నగదు రివార్డులను బుధవారం అందజేశారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. టవల్‌తో గొంతు బిగించి హత్య.. హత్య జరిగిన తర్వాత కనకలత తల్లి రాధామణి మహంతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారని ఎస్పీ తెలిపారు. కనకలత మహంతి ప్రతిరోజూ స్నానం కోసం చెరువుకు వెళ్తుండేదని, అక్కడికి దగ్గరలోనే కల్లు దుకాణం ఉండడంతో ఆ దిశగా పోలీసులు దృష్టి సారించారని, పోస్టుమార్టం రిపోర్టులో సైతం గొంతు బిగించి చంపినట్లు తేలడం, సంఘటన స్థలంలో టవల్ లభించడంతో కేసు కొలిక్కి వచ్చిందన్నారు. కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, క్లూస్‌టీం ఆధారాలు సేకరించిందని చెప్పారు. సంఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరిగిన సీల తాతారావుపై సిబ్బంది దృష్టి సారించారని, మృతదేహంపై గోరు గాయాలు ఉండగా, తాతారావు శరీరంపైనే గోటి గాయాలు ఉండడంతో అనుమానం పెరిగిందన్నారు. ఇతనికి నేరచరిత్ర ఉండడంతో నిఘా పెట్టారని పేర్కొన్నారు. మృతదేహం వద్ద లభించిన కొన్ని తల వెంట్రుకలను క్లూస్ టీం సేకరించారని, వాటిని చూడగా తాతారావుపై అనుమానం మరింత పెరిగిందని చెప్పారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. యువతి స్నానం చేస్తున్నప్పుడు కొద్దిరోజులుగా చూసేవాడని, అవకాశం కోసం ఎదురుచూస్తుండగా ఒంటరిగా ఆ రోజు స్నానానికి వెళ్తున్న కనకలత మహంతిని చూసి వెంబడించాడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెపై చేయి వేయగా భయపడటంతో మెడలో ఉన్న టవల్‌తో గొంతు బిగించి చంపినట్టు ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. సంఘటన జరిగినట్లు ముందుగా గ్రామస్తులకు చెప్పింది కూడా తాతారావేనని పేర్కొన్నారు. తాతారావును బుధవారం కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసులో ఇచ్ఛాపురం సీఐ కె.పైడపునాయుడు, సోంపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్, మహిళా ఎస్ఐ ఎన్.గౌరి, కానిస్టేబుళ్లు కనకరాజు, లోకనాథం, ప్రసాద్, సతీష్, శ్రీను తదితరులు చురుగ్గా వ్యవహరించారని, వారికి నగదు రివార్డులను అందిస్తున్నట్లు చెప్పారు. విలేకరులతో మాట్లాడుతున్న ఎస్పీ వెంకటరత్నం జంట హత్య కేసులో పురోగతి.. శ్రీకాకుళం నగరంలో ఈ నెల 7న జరిగిన జంట హత్య కేసులో కూడా పురోగతి సాధించామని ఎస్పీ చెప్పారు. మరికొంత దర్యాప్తు జరగాల్సి ఉందని, త్వరలోనే ఆ కేసును కూడా ఛేదిస్తామన్నారు. సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతులు, నియామకాలు, బదిలీలపై నిషేధం
ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల పదోన్నతులపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ పూర్తయ్యేవరకు అన్ని రకాల పదోన్నతులపై నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని రకాల నియామకాలతోపాటు బదిలీలు, సీనియారిటీలు, సవరణలు, ఉద్యోగుల నియామకాల నియమ నిబంధనల్లో మార్పులు చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వాల్సి వస్తే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తగిన కారణాలను పేర్కొనాలని తెలిపారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాల్సిందిగా స్పష్టంచేశారు. -
ఏ రాష్ట్రానికి ప్రాధాన్యతో చెప్పండి
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు నమూనా పత్రం జారీ మెమో జారీ చేసిన సీఎస్ మహంతి {పాధాన్యత ప్రకారమే కేటాయింపు హక్కు కాదంటూ అండర్ టేకింగ్ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏ రాష్ట్ర కేడర్‌కు ఇష్టపడతారో ఈ నెల 16వ తేదీలోగా చెప్పాల్సిందిగా అఖిల భార త సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కోరారు. ఈ మేరకు నమూనా పత్రంతో పాటు మెమోను శుక్రవారం జారీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తొలి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్‌కు ఇస్తారో లేదా తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఇస్తారో నమూనా పత్రంలో తెలియజేయాలని సూచించారు. రెండు రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తే ఆ విషయం కూడా తెలియజేయవచ్చునని స్పష్టం చేశారు. తమ ప్రాధాన్యతల ప్రకారమే ఆయా రాష్ట్రాల కేడర్లకు కేటాయింపులు జరగాలనే హక్కు ఎవరికీ ఉండదని పేర్కొంటూ ఆ మేరకు అండర్ టేకింగ్‌ను అధికారుల నుంచి నమూనా పత్రంలో తీసుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే.. కేవలం ప్రాధాన్యతలు అడిగామని చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక పక్క ప్రాధాన్యతలను అడుగుతూ దాని కిందే ప్రాధాన్యతల ప్రకారం కేటాయింపులు చేయలేదని అడిగే హక్కు ఎవరికీ ఉండదని కూడా అండర్ టేకింగ్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని అధికారులంటున్నారు. ఇలావుండగా సదరు నమూనా పత్రాలను పూరించి సీల్డ్ కవర్లో ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5 గంటలకల్లా ఐఏఎస్‌లు అయితే సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ కార్యదర్శి శివశంకర్‌కు, ఐపీఎస్లైతే శాంతిభద్రతల అదనపు డీజీ వి.ఎస్.కె.కౌముదికి, ఐఎఫ్ఎస్లైతే అదనపు పీసీసీఎఫ్ ఆర్.జి. కలఘట్గికి సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డెరైక్ట్ రిక్రూటీలు, కన్ఫర్డ్ అధికారులు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే అఖిల భారత సర్వీస్ అధికారుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను ఈ నెల 16వ తేదీన ప్రత్యూష సిన్హా కమిటీ ఖరారు చేయనుంది. అనంతరం ఈ నెల 17 లేదా 18వ తేదీన వాటిని బహిర్గత పరచనుంది. డెరైక్ట్ రిక్రూట్మెంట్ అధికారులను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే కేటాయించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణరుుంచింది. అలాగే కన్ఫర్డ్ అధికారులను కూడా ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే కేటాయించనున్నారు. రాష్ర్ట కేడర్‌కు చెందిన ఇతర రాష్ట్రాల అధికారులను మాత్రం రోస్టర్ విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. -
తెలంగాణ కేడర్‌కు మహంతి
నిర్ధారించిన కేంద్రం 8న అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలు ఖరారు ఎన్నికల ఫలితాల తర్వాతే ఏ ప్రాంతానికి ఎవరో స్పష్టం హదరాబాద్: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి తెలంగాణ కేడర్ కిందకు వస్తారని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. రాష్ట్ర విభజన అంశాల్లో మహంతి తొలి నుంచీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మరోపక్క ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలు ఈ నెల 8వ తేదీన ఖరారు కానున్నాయి. ఇందుకోసం ఏర్పాటైన ప్రత్యూష సిన్హా కమిటీ 8వ తేదీన ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎస్ మహంతి హాజరు కానున్నారు. డెరైక్ట్ రిక్రూటీలైన ఐఏఎస్‌లను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి కేటాయించనున్నారు. అలాగే కన్ఫర్డ్ ఐఏఎస్‌లు, ఇతర రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లను రోస్టర్ విధానంలో ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తొలుత ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే తమను రోస్టర్ విధానంలో కేటాయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కన్ఫర్డ్ ఐఏఎస్‌లు ప్రత్యూష సిన్హా కమిటీకి విజ్ఞాపన పత్రం సమర్పించారు. రాష్ట్ర విభజనే ప్రాంతాల ఆధారంగా జరిగినందున కన్ఫర్డ్ ఐఏఎస్‌లను రోస్టర్ విధానంలో కేటాయించడం సమజసం కాదని వారు విన్నవించారు. దీంతో కమిటీ పునరాలోచనలో పడినట్లు తెలిసింది. కన్ఫర్డ్ ఐఏఎస్‌లను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే కేటాయించడమే ఉత్తమమనే అభిప్రాయానికి కమిటీ వచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఇక మిగిలిన రాష్ట్ర కేడర్‌కు చెందిన ఇతర రాష్ట్రాల ఐఏఎస్‌లను మాత్రం సీనియారిటీ ఆధారంగా రోస్టర్ విధానంలో పంపిణీ చేయనున్నారు. భార్య-భర్తలకు మాత్రం అప్షన్ ఉంటుంది. ఇందులో ఎవరు సీనియర్ అయితే వారి ఆప్షన్‌కు ఆమోదం తెలుపుతారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 293 ఐఏఎస్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను తొలుత జిల్లాల నిష్పత్తి ప్రకారం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి 125 మంది, సీమాంధ్ర రాష్ట్రానికి 168 మంది ఐఏఎస్‌లు వస్తున్నారు. వీరిలో పదోన్నతుల ద్వారా (కన్ఫర్డ్) ఐఏఎస్‌లైన వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 51 మంది ఉండగా సీమాంధ్రకు చెందిన వారు 49 మంది ఉన్నారు. వీరిని ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే కేటాయించనున్నారు. ఏ రాష్ట్రానికి ఎవరు అనే వివరాలను ఎన్నికలు కౌంటింగ్ పూర్తి అయిన తరువాతనే వెల్లడించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ పూర్తి అయిన తరువాతనే ఏ రాష్ట్రానికి ఏ అధికారి అనే వివరాలను వెల్లడించనున్నారు. -
సీమాంధ్ర సీఎం అధికార నివాసం గ్రీన్‌ల్యాండ్ కాదు.. లేక్‌వ్యూ
రెండు రాష్ట్రాల అతిధి గృహాలుగా పర్యాటక భవన్ విభజన సంబంధిత ఆదేశాలన్నీ ఎన్నికలయ్యాకే: సీఎస్ హైదరాబాద్: సీమాంధ్ర ముఖ్యమంత్రి అధికార నివాసంగా లేక్‌వ్యూ అతిధి గృహాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత గ్రీన్‌ల్యాండ్ అతిధి గృహాన్ని సీమాంధ్ర సీఎం అధికార నివాసంగా కేటాయించాలని భావించారు. అయితే గ్రీన్‌ల్యాండ్ పూర్తిగా రోడ్డు మీదకు ఉండటం, ట్రాఫిక్ సమస్యలు వస్తాయనే భావనతో లేక్వ్యూను కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే బేగంపేటలోని పర్యాటక భవన్ ను ఇరు రాష్ట్రాల అతిధి గృహాలకు వీలుగా మార్పులు చేయాలని నిర్ణయించారు. విభజన సంబంధిత ఆదేశాలను ఎన్నికలు పూర్తయ్యేవరకు జారీ చేయకూడదని నిర్ణరుుంచారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విభజనకు సిద్ధంగా ఉండాలని, సంబంధిత ఆదేశాలను మాత్రం ఎన్నికలు పూర్తయ్యూక జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సూచించారు. విభజనకు సంబంధించిన 21 కమిటీల ఉన్నతాధికారులతో సీఎస్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 15వ తేదీకల్లా కమిటీలన్నీ తుది సిఫారసులతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు మే 16వ తేదీన వెలువడి కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నందున వారితో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సీఎస్ తెలిపారు. ప్రస్తుతం శాఖలకు ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులుగా ఉన్న అధికారులే జూన్ 2వ తేదీన రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు ఫైళ్లతో పాటు ఆయా శాఖలకు చెందిన అంశాలను అప్పగించే బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. ప్రస్తుతానికి ఎక్కడున్న ఫర్నిచర్‌ను అక్కడే కొనసాగించాలని, ఎలాంటి మార్పులు చేయరాదని పేర్కొన్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు జూన్ 2వ తేదీన జరుగుతుందని అదే రోజు ఇరు రాష్ట్రాల అధికారులకు ఇప్పుడున్న శాఖాధికారులు అప్పగింతలు చేయాలని సూచించారు. -
అదనపు సిబ్బంది కావాల్సిందే!
రెండు రాష్ట్రాలకూ అవసరమన్న ఐపీఎస్‌లు హోం శాఖ కార్యదర్శి గోస్వామితో భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పోలీసు సిబ్బందిని చట్ట ప్రకారం రెండు రాష్ట్రాలకూ పంచినప్పటికీ రెండుచోట్లా అదనపు సిబ్బంది అవసరమవుతారని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి వివరించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన గోస్వామితో డీజీపీ బి.ప్రసాదరావు నేతృత్వంలో విభజన ప్రక్రియలో పాలు పంచుకుంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ తదితర విభాగాలకు ప్రస్తుతం ఒక అధిపతే ఉండగా.. విభజన తర్వాత ఇద్దరు ఉండాల్సి వస్తుందని, ఈ రకంగానే మరికొన్ని కీలక పోస్టుల్నీ పెంచాల్సి ఉందని చెప్పారు. అదనపు బందోబస్తు అవసరమైన సమయంలో ఇప్పటివరకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బలగాలను తరలిస్తున్నారని, విభజన తర్వాత ఇది సాధ్యం కాదు కనుక ఆ మేరకు సిబ్బంది సంఖ్యనూ పెంచాల్సి ఉంటుందని వివరించారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగే హైదరాబాద్‌కు అవసరమైన స్థాయిలో అదనపు సిబ్బందిని కేటాయించాల్సిన అవసరాన్నీ అధికారులు గోస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. ‘గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలను కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. ఈ విభాగాలకు కేంద్రం ఏటా ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్‌కూ అదనంగా ఇవ్వాలి..’ అని సూచించారు. గ్రేహౌండ్స్ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి: గ్రేహౌండ్స్ విభాగాన్ని పూర్తి స్థాయిలో కేంద్రం అధీనంలోకి తీసుకునే అంశాన్ని గోస్వామి ప్రస్తావించారు. దీన్ని రాష్ట్ర అధికారులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. దేశంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన విభాగంగా పేరొందిన, అనేక రాష్ట్రాల్లో విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించిన గ్రేహౌండ్స్ కమెండో దళంతో పాటు దాని శిక్షణ విభాగాన్ని కచ్చితంగా రాష్ట్ర పరిధిలోనే ఉంచాలన్నారు. గ్రేహౌండ్స్‌తో పాటు ఇతర విభాగాలకూ కేంద్రం విడుదల చేసే నిధుల వినియోగంపై పర్యవేక్షణకు మాత్రమే కేంద్రం పరిమితం కావాలని సూచించారు. రాష్ట్ర ఐపీఎస్ అధికారులందరికీ ఆప్షన్లు ఇచ్చే విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని గోస్వామి చెప్పారు. సమావేశానంతరం అధికారులు ఆయనకు బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో విందు ఇచ్చారు. ఇలావుండగా బుధవారం గోస్వామి జాతీయ పోలీసు అకాడమీని సందర్శించారు. వసతులపై నేడు గవర్నర్ సమీక్ష: ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగనున్న హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కొనసాగడానికి అవసరమైన వసతులపై గవర్నర్ నరసింహన్ గురువారం సంబంధిత కమిటీ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. -
ప్రత్యేక కార్యదర్శులకు సీఎస్ మెమో
సాక్షి, హైదరాబాద్: ఫైళ్లను పునఃపరిశీలించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి తిప్పిపంపిస్తున్న అన్నిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం మెమో జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని అందులో పేర్కొన్నారు. ఇతర శాఖలతో సంబంధం లేని ప్రభుత్వ ఆదేశాలను ఆయాశాఖలు వారంరోజుల్లోగా అమలు చేయాలని, ఇతర శాఖలతో ము డిపడి ఉన్న ఆదేశాలైతే పక్షం రోజుల్లో అమలుచేయాల్సి ఉందని మెమోలో స్పష్టం చేశారు.