సీఎస్ మహంతిని కలసిన గోస్వామి
రెండు రాష్ట్రాలకూ అవసరమన్న ఐపీఎస్‌లు
హోం శాఖ కార్యదర్శి గోస్వామితో భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పోలీసు సిబ్బందిని చట్ట ప్రకారం రెండు రాష్ట్రాలకూ పంచినప్పటికీ రెండుచోట్లా అదనపు సిబ్బంది అవసరమవుతారని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి వివరించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన గోస్వామితో డీజీపీ బి.ప్రసాదరావు నేతృత్వంలో విభజన ప్రక్రియలో పాలు పంచుకుంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ తదితర విభాగాలకు ప్రస్తుతం ఒక అధిపతే ఉండగా.. విభజన తర్వాత ఇద్దరు ఉండాల్సి వస్తుందని, ఈ రకంగానే మరికొన్ని కీలక పోస్టుల్నీ పెంచాల్సి ఉందని చెప్పారు. అదనపు బందోబస్తు అవసరమైన సమయంలో ఇప్పటివరకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బలగాలను తరలిస్తున్నారని, విభజన తర్వాత ఇది సాధ్యం కాదు కనుక ఆ మేరకు సిబ్బంది సంఖ్యనూ పెంచాల్సి ఉంటుందని వివరించారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగే హైదరాబాద్‌కు అవసరమైన స్థాయిలో అదనపు సిబ్బందిని కేటాయించాల్సిన అవసరాన్నీ అధికారులు గోస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. ‘గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలను కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. ఈ విభాగాలకు కేంద్రం ఏటా ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్‌కూ అదనంగా ఇవ్వాలి..’ అని సూచించారు.
గ్రేహౌండ్స్ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి: గ్రేహౌండ్స్ విభాగాన్ని పూర్తి స్థాయిలో కేంద్రం అధీనంలోకి తీసుకునే అంశాన్ని గోస్వామి ప్రస్తావించారు. దీన్ని రాష్ట్ర అధికారులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. దేశంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన విభాగంగా పేరొందిన, అనేక రాష్ట్రాల్లో విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించిన గ్రేహౌండ్స్ కమెండో దళంతో పాటు దాని శిక్షణ విభాగాన్ని కచ్చితంగా రాష్ట్ర పరిధిలోనే ఉంచాలన్నారు. గ్రేహౌండ్స్‌తో పాటు ఇతర విభాగాలకూ కేంద్రం విడుదల చేసే నిధుల వినియోగంపై పర్యవేక్షణకు మాత్రమే కేంద్రం పరిమితం కావాలని సూచించారు. రాష్ట్ర ఐపీఎస్ అధికారులందరికీ ఆప్షన్లు ఇచ్చే విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని గోస్వామి చెప్పారు. సమావేశానంతరం అధికారులు ఆయనకు బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో విందు ఇచ్చారు. ఇలావుండగా బుధవారం గోస్వామి జాతీయ పోలీసు అకాడమీని సందర్శించారు.
వసతులపై నేడు గవర్నర్ సమీక్ష: ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగనున్న హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కొనసాగడానికి అవసరమైన వసతులపై గవర్నర్ నరసింహన్ గురువారం సంబంధిత కమిటీ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు.