goswami
-
ఐపీఓ ద్వారా రూ. 5,430 కోట్ల సమీకరణ
ముంబై: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి రూ. 440–463 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 4,180 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ గోస్వామి ఇన్ఫ్రాటెక్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 32 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 600 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 320 కోట్లు దీర్ఘకాలిక మూలధన అవసరాలకు, మరో రూ. 80 కోట్లు కన్స్ట్రక్షన్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది.కంపెనీ ప్రధానంగా ఐదు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఇవి.. మెరైన్ అండ్ ఇండస్ట్రియల్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైడ్రో, అండర్‌గ్రౌండ్, ఆయిల్ అండ్ గ్యాస్. 2024 జూన్ 30కల్లా కంపెనీ ఆర్డర్‌బుక్ విలువ రూ. 31,747 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 3,154 కోట్ల ఆదాయం, దాదాపు రూ. 92 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
అందమైన మోసం
పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భరత నాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ (సినిమా అనేది ప్రపంచంలో అత్యంత అందమైన మోసం) ఉపశీర్షిక. ఈ చిత్రంలో మీనాక్షీ గోస్వామి హీరోయిన్. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కేవీఆర్ మహేంద్రతో కలిసి సూర్య తేజ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు.పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘భరత నాట్యం’ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమాలో తెలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి. -
సీజే జస్టిస్ గోస్వామికి హైకోర్టు ఘన వీడ్కోలు
సాక్షి, అమరావతి: ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామికి ఆదివారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ గోస్వామి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి చాలా కఠినమైనదని, సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. ఈ వృత్తి జీవితంలో పైకొచ్చిన తరువాత కూడా నిత్యం సవాళ్లను ఎదుర్కొంటునే ఉంటామన్నారు. ఆశను ఎప్పుడూ వదులుకోకూడదని చెప్పారు. విజయానికి దగ్గరిదారులు వెతకొద్దని, కష్టపడే తత్వానికి ప్రత్యామ్నాయం లేనేలేదని పేర్కొన్నారు. తక్కువ కాలమైనా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయడం తనకు ఎంతో సంతోషానిచ్చిందన్నారు. తనకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఏజీ శ్రీరామ్ మాట్లాడుతూ జస్టిస్ గోస్వామి సేవలను కొనియాడారు. గవర్నర్ తేనీటి విందు: బదిలీపై వెళుతున్న చీఫ్ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి గౌరవార్థం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో ఆదివారం రాత్రి తేనేటి విందు ఇచ్చారు. సీజే గోస్వామి, నీలాక్షి గోస్వామి దంపతులను గవర్నర్ సత్కరించి వీడ్కోలు పలికారు. గవర్నర్ సతీమణి సుప్రవ హరిచందన్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మ సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్ వించిపేట (విజయవాడ పశ్చిమ): శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం శ్రీలలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సీజే గోస్వామి దంపతులకు ఈవో భ్రమరాంబ, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం చీఫ్ జస్టిస్‌కు ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. జస్టిస్ పీకే మిశ్రా సీజేగా 13న ప్రమాణం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఈ నెల 13న ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, న్యాయమూర్తులు, మంత్రులు తదితరులు పాల్గొననున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి జస్టిస్ మిశ్రా ఈ నెల 12న విజయవాడ చేరుకుంటారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ఆదివారం సీఎం ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు పరిశీలించారు. -
జస్టిస్ శివశంకర్ మరిన్ని పుస్తకాలు రచించాలి
సాక్షి, అమరావతి: న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఉపయుక్తంగా జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు మరిన్ని పుస్తకాలు రచించాలని, ఆయన కలం ఆగకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి ఆకాంక్షించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకాన్ని మంగళగిరిలో గురువారం సీజే గోస్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీజే అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ.. ఇటీవల జస్టిస్ శివశంకర్ తనను పుస్తక ఆవిష్కరణకు ఆహ్వానించారన్నారు. ‘ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకానికి తొలి పాఠకుడిని తానేనని చెప్పారు. న్యాయవ్యవస్థలోని వివిధ అంశాలను వివరణాత్మకంగా ఈ పుస్తకం ద్వారా అందించారన్నారు. శివశంకర్ పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. ఓ మంచి పుస్తకం పది మంది స్నేహితులతో సమానమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి తెలిపారు. ఈ పుస్తకం న్యాయవాద వృత్తిలోకి వచ్చే భవిష్యత్ తరాలకు టార్చ్‌బేరర్ వంటిది అన్నారు. శివశంకర్, తాను ఇద్దరు గోదావరి జిల్లాలకు చెందినవారమేనని పేర్కొన్నారు. శివశంకర్ రాసిన వర్డ్స్, ప్రిన్సిపిల్స్, ప్రెసిడెంట్స్ పుస్తకం న్యాయవాదులతోపాటు, న్యాయమూర్తులకు కూడా ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఆయన గతంలో రాసిన పుస్తకాలు న్యాయ వ్యవస్థపై సమాచారంతోపాటు జ్ఞానాన్ని అందించాయని న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జొయ్‌మాల్య బాగ్చి, దుర్గాప్రసాదరావు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
హైకోర్టులో మారిన రోస్టర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో రోస్టర్ మారింది. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి బాధ్యతలు చేపట్టిన తరువాత పూర్తిస్థాయిలో రోస్టర్ మార్చడం ఇదే తొలిసారి. ఈ నెల 26న మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రత్యేకంగా కేసులు విచారించనుంది. అయితే, ఏ కేసులు విచారించనుందో స్పష్టంగా పేర్కొనలేదు. మూడు రాజధానులకు సంబంధించిన కేసులనే త్రిసభ్య ధర్మాసనం విచారించనున్నట్టు తెలిసింది. ఆ రోజున రాజధానుల కేసుల విచారణ విధి, విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. గతంలో ఈ కేసులను అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. జస్టిస్ మహేశ్వరి బదిలీ కావడంతో ఆ కేసుల విచారణ మళ్లీ మొదటకొచ్చింది. ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు కావడంతో రాజధాని కేసుల్లో కదలిక వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోస్టర్ మార్పులు ఇలా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోస్వామి రోస్టర్‌లో కీలక మార్పులే చేశారు. తాజా రోస్టర్ ప్రకారం.. కీలక శాఖలైన గనులు, పరిశ్రమలు, రహదారులు, భవనాలకు సంబంధించిన కేసులను జస్టిస్ బట్టు దేవానంద్ విచారించనున్నారు. క్వాష్ పిటిషన్లు, హోం శాఖకు సంబంధించిన వ్యాజ్యాలను ఇకపై జస్టిస్ రావు రఘునందన్‌రావు విచారించనున్నారు. బెయిల్ పిటిషన్లు, క్రిమినల్ రివిజన్ పిటిషన్లు, క్రిమినల్ ట్రాన్స్ఫర్ పిటిషన్లను జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ విచారిస్తారు. అత్యంత కీలకమైన రెవెన్యూ కేసులను జస్టిస్ మఠం వెంకటరమణకు అప్పగించారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు, సీఆర్డీఏ కేసులను జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ విచారిస్తారు. -
సీజేగా జస్టిస్ గోస్వామి ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. అనంతరం జస్టిస్ గోస్వామిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు వేర్వేరుగా శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్చాలతో అభినందించారు. బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్ భానుమతి, పలువురు న్యాయవాదులు, జస్టిస్ గోస్వామి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. తేనీటి కార్యక్రమం అనంతరం జస్టిస్ గోస్వామి హైకోర్టుకు చేరుకున్నారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో కలసి కేసులను విచారించారు. జస్టిస్ గోస్వామి మంచి క్రికెటర్ కూడా.. జస్టిస్ గోస్వామి 1961 మార్చి 11న అస్సాం రాష్ట్రం జోరాత్‌లో జన్మించారు. 1985లో గౌహతి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యి.. సివిల్, క్రిమినల్, సర్వీసు, రాజ్యాంగపరమైన కేసులను వాదించారు. 2011లో గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. అనంతరం గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ గోస్వామి మంచి క్రికెటర్ కూడా. ఆయన రంజీ ట్రోఫీలో అస్సాం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ లెవల్ అండర్ 19, అండర్ 21లో ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించారు. -
నేడు సీజేగా జస్టిస్ గోస్వామి ప్రమాణం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు జరుగుతుంది. తరువాత జస్టిస్ గోస్వామి హైకోర్టుకు చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి కేసులను విచారిస్తారు. -
అదనపు సిబ్బంది కావాల్సిందే!
రెండు రాష్ట్రాలకూ అవసరమన్న ఐపీఎస్‌లు హోం శాఖ కార్యదర్శి గోస్వామితో భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పోలీసు సిబ్బందిని చట్ట ప్రకారం రెండు రాష్ట్రాలకూ పంచినప్పటికీ రెండుచోట్లా అదనపు సిబ్బంది అవసరమవుతారని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి వివరించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన గోస్వామితో డీజీపీ బి.ప్రసాదరావు నేతృత్వంలో విభజన ప్రక్రియలో పాలు పంచుకుంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ తదితర విభాగాలకు ప్రస్తుతం ఒక అధిపతే ఉండగా.. విభజన తర్వాత ఇద్దరు ఉండాల్సి వస్తుందని, ఈ రకంగానే మరికొన్ని కీలక పోస్టుల్నీ పెంచాల్సి ఉందని చెప్పారు. అదనపు బందోబస్తు అవసరమైన సమయంలో ఇప్పటివరకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బలగాలను తరలిస్తున్నారని, విభజన తర్వాత ఇది సాధ్యం కాదు కనుక ఆ మేరకు సిబ్బంది సంఖ్యనూ పెంచాల్సి ఉంటుందని వివరించారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగే హైదరాబాద్‌కు అవసరమైన స్థాయిలో అదనపు సిబ్బందిని కేటాయించాల్సిన అవసరాన్నీ అధికారులు గోస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. ‘గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలను కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. ఈ విభాగాలకు కేంద్రం ఏటా ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్‌కూ అదనంగా ఇవ్వాలి..’ అని సూచించారు. గ్రేహౌండ్స్ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి: గ్రేహౌండ్స్ విభాగాన్ని పూర్తి స్థాయిలో కేంద్రం అధీనంలోకి తీసుకునే అంశాన్ని గోస్వామి ప్రస్తావించారు. దీన్ని రాష్ట్ర అధికారులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. దేశంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన విభాగంగా పేరొందిన, అనేక రాష్ట్రాల్లో విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించిన గ్రేహౌండ్స్ కమెండో దళంతో పాటు దాని శిక్షణ విభాగాన్ని కచ్చితంగా రాష్ట్ర పరిధిలోనే ఉంచాలన్నారు. గ్రేహౌండ్స్‌తో పాటు ఇతర విభాగాలకూ కేంద్రం విడుదల చేసే నిధుల వినియోగంపై పర్యవేక్షణకు మాత్రమే కేంద్రం పరిమితం కావాలని సూచించారు. రాష్ట్ర ఐపీఎస్ అధికారులందరికీ ఆప్షన్లు ఇచ్చే విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని గోస్వామి చెప్పారు. సమావేశానంతరం అధికారులు ఆయనకు బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో విందు ఇచ్చారు. ఇలావుండగా బుధవారం గోస్వామి జాతీయ పోలీసు అకాడమీని సందర్శించారు. వసతులపై నేడు గవర్నర్ సమీక్ష: ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగనున్న హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కొనసాగడానికి అవసరమైన వసతులపై గవర్నర్ నరసింహన్ గురువారం సంబంధిత కమిటీ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు.