సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ గోస్వామికి పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం జగన్. చిత్రంలో గవర్నర్ హరిచందన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. అనంతరం జస్టిస్ గోస్వామిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు వేర్వేరుగా శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్చాలతో అభినందించారు. బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్ భానుమతి, పలువురు న్యాయవాదులు, జస్టిస్ గోస్వామి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. తేనీటి కార్యక్రమం అనంతరం జస్టిస్ గోస్వామి హైకోర్టుకు చేరుకున్నారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో కలసి కేసులను విచారించారు.
జస్టిస్ గోస్వామి మంచి క్రికెటర్ కూడా..
జస్టిస్ గోస్వామి 1961 మార్చి 11న అస్సాం రాష్ట్రం జోరాత్‌లో జన్మించారు. 1985లో గౌహతి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యి.. సివిల్, క్రిమినల్, సర్వీసు, రాజ్యాంగపరమైన కేసులను వాదించారు. 2011లో గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. అనంతరం గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ గోస్వామి మంచి క్రికెటర్ కూడా. ఆయన రంజీ ట్రోఫీలో అస్సాం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ లెవల్ అండర్ 19, అండర్ 21లో ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment