హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రమాణం | Justice JK Maheshwari Oath As the Chief Justice of the AP High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రమాణం

Published Tue, Oct 8 2019 4:07 AM | Last Updated on Tue, Oct 8 2019 4:07 AM

Justice JK Maheshwari Oath As the Chief Justice of the AP High Court - Sakshi

సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరికి పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో గవర్నర్‌ హరిచందన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా(సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి సోమవారం ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. జస్టిస్‌ జేకే మహేశ్వరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జారీ చేసిన ఉత్తర్వులను(వారెంట్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్‌) హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ చదివి వినిపించారు. తరువాత సీజేగా జస్టిస్‌ మహేశ్వరి ప్రమాణం చేశారు.

అనంతరం గవర్నర్‌ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా జస్టిస్‌ మహేశ్వరిని శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిన్నటి వరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా (ఏసీజే) వ్యవహరించిన జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, పలువురు న్యాయమూర్తులు, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ జేకే మహేశ్వరి కుటుంబ సభ్యులు, మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. 

ఈ వారంలోనే హైకోర్టు సందర్శన 
ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తున్నప్పుడు జస్టిస్‌ జేకే మహేశ్వరి పొరపాటున ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బదులు మధ్యప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అని పలికారు. గవర్నర్‌ హరిచందన్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అని చదవగా, జస్టిస్‌ జేకే మహేశ్వరి ఆంధ్రప్రదేశ్‌ బదులు మధ్యప్రదేశ్‌ అని పొరపాటున చదివి ప్రమాణం పూర్తి చేశారు. సీజేతో సహా వేదికపై ఉన్న ప్రముఖులు దీనిని గుర్తించలేదు. సంప్రదాయం ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి జస్టిస్‌ జేకే మహేశ్వరిని పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ఆ వెంటనే జాతీయ గీతాలాపన పూర్తి కావడం, తేనీటి విందుకు హాజరుకావాలన్న ప్రకటన వెలువడడం జరిగిపోయాయి. ఆ వెంటనే జరిగిన పొరపాటును గవర్నర్‌ కార్యదర్శి ముఖేశ్‌కుమార్‌ మీనా గుర్తించి, స్వయంగా జస్టిస్‌ జేకే మహేశ్వరి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన గవర్నర్‌ హరిచందన్‌తో మాట్లాడారు. అప్పటికే అందరూ తేనీటి విందు జరిగే ప్రదేశానికి చేరుకున్నారు.

రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మరోసారి ప్రమాణం చేయించేందుకు గవర్నర్‌ సిద్ధమయ్యారు. తేనీటి విందు ప్రారంభానికి ముందే గవర్నర్‌ మరోసారి జస్టిస్‌ జేకే మహేశ్వరితో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. అనంతరం ఏజీ శ్రీరామ్‌ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులను(జీపీ) ప్రధాన న్యాయమూర్తికి పరిచయం చేశారు. ఈ వారంలో ఆయన హైకోర్టును సందర్శించే అవకాశాలున్నాయని హైకోర్టు వర్గాలు తెలిపాయి. కాగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ వేదపండితులు ఆశీర్వదించారు. 

నేడు శ్రీవారి సేవలో హైకోర్టు సీజే
తిరుమల : ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో పద్మావతి అతిథిగృహం వద్ద ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, అడిషనల్‌ ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ జెట్టి ఉన్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తికి శ్రీవారి దర్శన ఏర్పాట్లుచేశారు. అలాగే, మంగళవారం జరగనున్న శ్రీవారి చక్రస్నానం  కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement