
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ క్రీడా లోకం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ క్రూరమైన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ.. అందుకు బాధ్యలైన వారికి తగిన గుణపాఠం చెప్పాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి తీవ్రంగా స్పందించాడు. భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలను పూర్తిగా నిలిపివేయాలని అతడు బీసీసీఐకి లేఖకు రాశాడు. ఇందుకు సంబంధించిన లెటర్‌ను తన ఎక్స్ ఖాతాలో గోస్వామి పోస్ట్ చేశాడు.
"ఈ విషాదకర ఘటన సమయంలో నేను ఒక విషయం చెప్పాలనకుంటున్నాను. ఇకపై పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం మానేయాలి. ఇప్పుడే కాదు పాక్‌తో పూర్తిగా క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును పాకిస్తాన్కు పంపనందుకు ఆ దేశ మాజీ క్రికెటర్లు కొంతమంది ఏదో ఏదో మాట్లాడారు.
ఆటను రాజకీయాలను కలపొద్దంటూ లేనిపోని మాటలు చెప్పారు. వారు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు. అమాయక భారతీయులను హత్య చేయడమే వారి జాతీయ క్రీడలా కనిపిస్తోంది. బ్యాట్‌లు, బంతులతో కాకుండా వారి బాషలోనే మనం కూడా సమాధానం చెప్పాలి" అని గోస్వామి తన నోట్‌లోపేర్కొన్నాడు.
కాగా ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఐపీఎల్ 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన శ్రీవత్స్ గోస్వామి, ఆ తర్వాత కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. అదేవిధంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో కలిసి భారత్ అండర్-19 జట్టుకు గోస్వామి ఆడాడు.