ఈ నెల 25–29 మధ్య ఐపీవో
ముంబై: షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి రూ. 440–463 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 4,180 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ గోస్వామి ఇన్‌ఫ్రాటెక్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.
రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 32 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 600 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 320 కోట్లు దీర్ఘకాలిక మూలధన అవసరాలకు, మరో రూ. 80 కోట్లు కన్‌స్ట్రక్షన్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది.
కంపెనీ ప్రధానంగా ఐదు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఇవి.. మెరైన్ అండ్ ఇండస్ట్రియల్, సర్ఫేస్ ట్రాన్స్‌పోర్ట్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైడ్రో, అండర్‌గ్రౌండ్, ఆయిల్ అండ్ గ్యాస్. 2024 జూన్ 30కల్లా కంపెనీ ఆర్డర్‌బుక్ విలువ రూ. 31,747 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 3,154 కోట్ల ఆదాయం, దాదాపు రూ. 92 కోట్ల నికర లాభం ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment