సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో రోస్టర్ మారింది. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి బాధ్యతలు చేపట్టిన తరువాత పూర్తిస్థాయిలో రోస్టర్ మార్చడం ఇదే తొలిసారి. ఈ నెల 26న మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రత్యేకంగా కేసులు విచారించనుంది. అయితే, ఏ కేసులు విచారించనుందో స్పష్టంగా పేర్కొనలేదు. మూడు రాజధానులకు సంబంధించిన కేసులనే త్రిసభ్య ధర్మాసనం విచారించనున్నట్టు తెలిసింది.
ఆ రోజున రాజధానుల కేసుల విచారణ విధి, విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. గతంలో ఈ కేసులను అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. జస్టిస్ మహేశ్వరి బదిలీ కావడంతో ఆ కేసుల విచారణ మళ్లీ మొదటకొచ్చింది. ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు కావడంతో రాజధాని కేసుల్లో కదలిక వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రోస్టర్ మార్పులు ఇలా..
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోస్వామి రోస్టర్‌లో కీలక మార్పులే చేశారు. తాజా రోస్టర్ ప్రకారం.. కీలక శాఖలైన గనులు, పరిశ్రమలు, రహదారులు, భవనాలకు సంబంధించిన కేసులను జస్టిస్ బట్టు దేవానంద్ విచారించనున్నారు. క్వాష్ పిటిషన్లు, హోం శాఖకు సంబంధించిన వ్యాజ్యాలను ఇకపై జస్టిస్ రావు రఘునందన్‌రావు విచారించనున్నారు. బెయిల్ పిటిషన్లు, క్రిమినల్ రివిజన్ పిటిషన్లు, క్రిమినల్ ట్రాన్స్‌ఫర్ పిటిషన్లను జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ విచారిస్తారు. అత్యంత కీలకమైన రెవెన్యూ కేసులను జస్టిస్ మఠం వెంకటరమణకు అప్పగించారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు, సీఆర్‌డీఏ కేసులను జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ విచారిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment