సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులు విచారించే సబ్జెక్టుల్లో (రోస్టర్‌లో) సమూల మార్పులు జరిగాయి. హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు వచ్చిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ మార్పులు చేశారు. కొత్త న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లకు సీనియర్ న్యాయమూర్తుల పక్కన ధర్మాసనాల్లో స్థానం కల్పించారు. జస్టిస్ నూనెపల్లి హరినాథ్‌కు సింగిల్ జడ్జిగా బాధ్యతలు అప్పగించారు. కీలకమైన బెయిల్ పిటిషన్లను ఎవరూ ఊహించని విధంగా న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు అప్పగించారు.
వీటితోపాటు 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్లు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వ్యాజ్యాలను కూడా జస్టిస్ మల్లికార్జునరావు విచారించాల్సి ఉంటుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ మాజీ సీఎం నారా చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యాలు సోమవారం జస్టిస్ మల్లికార్జునరావు ముందు లిస్ట్ అయ్యాయి. అలాగే కీలకమైన క్వాష్ పిటిషన్ల విచారణ బాధ్యతలను జస్టిస్ బీఎస్ భానుమతికి అప్పగించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 482 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్లతో పాటు అధికరణ 226 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్లను సైతం ఆమే విచారిస్తారు. ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలంటూ 2022 తరువాత దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ భానుమతే విచారిస్తారు. మరో కీలకమైన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు సంబంధించిన కేసులను జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లుకు కేటాయించారు.
అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణాలతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1411, మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 344ను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ నిమ్మగడ్డ విచారణ జరుపుతారు. రోస్టర్ అమల్లోకి వచ్చే సోమవారం నాడే టీడీపీ నేతల వ్యాజ్యాలు జస్టిస్ నిమ్మగడ్డ ముందుకు విచారణకు రానున్నాయి.
పురపాలక శాఖ, ఏపీసీఆర్‌డీఏ, ఏఎంఆర్‌డీఏ కేసులను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి విచారిస్తారు. రెవెన్యూ, భూ సేకరణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల కేసులను జస్టిస్ చీమలపాటి రవికి అప్పగించారు. మొన్నటివరకు బెయిల్ పిటిషన్లను విచారించిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డికి ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిషీట్‌లను కొట్టేయాలని కోరుతూ 2017 వరకు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ల విచారణ బాధ్యతలు అప్పగించారు.
2018 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లను కూడా జస్టిస్ సురేష్‌రెడ్డి విచారిస్తారు. మొన్నటి వరకు క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డికి 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, కంపెనీ కేసులు, ఒరిజినల్ సివిల్ సూట్‌ల కేసులను అప్పగించారు. జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయికి చార్జిషీట్లు, ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలంటూ 2020, 2021 సంవత్సరాల్లో దాఖలైన వ్యాజ్యాలను కేటాయించారు.
ఒకట్రెండు రోజుల్లో రోస్టర్‌లో స్వల్ప మార్పులు
హైకోర్టు జడ్జిలు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ బదిలీపై వేరే హైకోర్టులకు వెళుతున్నందున ఈ రోస్టర్‌లో కూడా ఒకటి రెండు రోజుల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. వారు వెళ్లిన తరువాత తాజా రోస్టర్‌లో కేటాయించిన సబ్జెక్టులను ఇతర న్యాయమూర్తులకు కేటాయిస్తారు. అలాగే కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్ జి.నరేంద్ర ఇక్కడ ప్రమాణం చేసిన తరువాత ఆయనకు కొన్ని సబ్జెక్టులను కేటాయించాల్సి ఉంటుంది. దీంతో తాజా రోస్టర్‌లో కొద్దిపాటి మార్పులు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment