సాఫీగా సాగితే నెలాఖరుకల్లా రెండు రాష్ట్రాలు!
బిల్లుకు రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి గెజిట్ కీలకం
ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీ నుంచే రెండు రాష్ట్రాలు మనుగడలోకి
నేడో, రేపో రాజ్యసభలో బిల్లు ఆమోదిస్తే నెలాఖరులోగా గెజిట్ ప్రకటన
లేదంటే.. ఎన్నికలు పూర్తయ్యాక రెండు రాష్ట్రాలు ఏర్పడేలా నిర్ణయం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2014’ను లోక్‌సభ ఆమోదించటంతో.. ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఏర్పాటు దాదాపు ఖాయమైంది. దీంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సాంకేతికంగా ఎప్పటి నుంచి వేరుపడతాయన్న అంశంపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ యథాతథంగా ఆమోదిస్తే.. ఈ నెలాఖరులోగానే రెండు రాష్ట్రాలు వేరుపడే అవకాశాలున్నాయి. అయితే రాజ్యసభ ఆమోదం, దానిపై రాష్ట్రపతి జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగానే రాష్ట్రాలు ఏ రోజు నుంచి వేరుపడతాయన్నది తేలనుంది. త్వరలో లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు వెలువడనున్న పరిస్థితుల్లో.. ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయా? లేక ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడి.. తర్వాత వేరువేరుగా రెండు శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయా? అనే కోణాల్లో చర్చ సాగుతోంది. రాజ్యసభ ఆమోదించిన తర్వాత విభజన బిల్లు కేంద్ర హోంశాఖకు అక్కడి నుంచి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. రాష్ట్రపతి దానిని ఆమోదించాక.. రెండు రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
ఆ నోటిఫికేషన్ ముందుగానే జారీ అయినప్పటికీ.. అందులో పేర్కొన్న రోజు (అపాయింటెండ్ డే) నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయి. ప్రస్తుతం లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు బుధ లేక గురువారాల్లో రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభ ఎలాంటి సవరణలు చేయకుండా బిల్లును యథాతథంగా ఆమోదించిన పక్షంలో ఈ నెలాఖరులోగానే అది కూడా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందే రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయటానికి అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాజ్యసభలో బిల్లులోని ఏవైనా అంశాలపై సవరణ ప్రతిపాదించి ఆమోదించిన పక్షంలో.. దాన్ని మళ్లీ లోక్‌సభ ముందు ఆమోదానికి పెట్టాల్సి ఉంటుంది. గతంలో మధ్యప్రదేశ్‌ను విభజించి ఛత్తీస్‌గఢ్ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే బిల్లుపై 2000 జూలై 31న లోక్‌సభ ఆమోదించగా.. అదే ఏడాది ఆగస్టు 9న రాజ్యసభలో దానికి కొన్ని సవరణలు చేసి ఆమోదించారు. రాజ్యసభలో కొత్తగా ఆమోదించిన సవరణలకు లోక్‌సభ ఆమోదం కూడా అవసరమైంది. దాంతో మరుసటి రోజు అంటే 2000 ఆగస్టు 10న మళ్లీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి కొత్త సవరణలను ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభలో ఎలాంటి సవరణలకు ఆమోదం తెలిపే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు.
గెజిట్‌లోని తేదీయే కీలకం
ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు 21వ తేదీతో ముగుస్తుండగా.. ఈలోగా జరగాల్సినవి అన్నీ సాఫీ గా జరిగితే సమావేశాలు ముగియగానే విభజన బిల్లును హోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుంది. ఆ లెక్కన ఈ నెల 22 లేదా 24న రాష్ట్రపతి భవన్‌కు ఫైలు చేరుకోవచ్చని అధికారవర్గాలు చెప్తున్నాయి. కీలకమైన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు, శాసనసభ సాధారణ ఎన్నికలకు ఈ నెలాఖరు రోజున లేదా మార్చి 3న షెడ్యూలు వెలువడుతుందని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్‌లో ఏ తేదీని ఖరారు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అంతా సాఫీగా సాగితే ఈ నెల 28 లోగా రాష్ట్రపతి రెండు రాష్ట్రాల ఏర్పాటు చట్టాన్ని ఆమోదించటంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. అందులో 28వ తేదీ తోనే రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయని ఆ వర్గాలు అంచనావేస్తున్నాయి. లేదంటే ప్రస్తుత శాసనసభ కాలపరిమితి జూన్ 2తో ముగుస్తుండగా.. జూన్ 1 నుంచి.. అంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వా లు వేరువేరు రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే విధంగా గెజిట్ జారీ కావొచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.