ఉసూరుమనిపించారు.. రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ | Chandrababu Revanth Reddy nominal debate on issues of state division | Sakshi

ఉసూరుమనిపించారు.. రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ

Published Sun, Jul 7 2024 4:32 AM | Last Updated on Sun, Jul 7 2024 7:21 AM

Chandrababu Revanth Reddy nominal debate on issues of state division

ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ 1.40 గంటల పాటు భేటీ

రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ

డ్రగ్స్, సైబర్‌ క్రైమ్, మూసీ నది పరిరక్షణ, తదితర అంశాలపై అధిక సమయం కేటాయింపు 

అపరిష్కృత విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాలు రెండు కమిటీలు

రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ముగ్గురు చొప్పున అధికారులతో ఒక కమిటీ

రెండు వారాల్లోగా ఈ కమిటీ భేటీ.. వారి స్థాయిలోని అంశాలకు పరిష్కారం 

సమస్యలు కొలిక్కి రాకపోతే రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ

మంత్రుల నిర్ణయాలను అంగీకరించనున్న రెండు రాష్ట్రాల సీఎంలు

మంత్రుల స్థాయిలో కూడా పరిష్కారం కాని అంశాలపై మరోమారు సీఎంల భేటీ 

డ్రగ్స్, సైబర్‌ క్రైమ్‌పై పరస్పర సహకారం కోసం కో ఆర్డినేషన్‌ కమిటీ

సీఎంల భేటీ వివరాలు వెల్లడించిన ఇరు రాష్ట్రాల మంత్రులు భట్టి విక్రమార్క, సత్యప్రసాద్‌ 

సాక్షి, అమరావతి: విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పక్కదారి పట్టింది. కీలకమైన విభజన అంశాలపై కాకుండా ఇతర అంశాలపై అత్యధిక సమయం వెచ్చించడంపై ప్రజలు పెదవి విరుస్తు­న్నారు. రాష్ట్ర విభజన అంశాలపై పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌­రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. 

దాదాపు గంటా నలభై నిమిషాలు సాగిన భేటీలో ఏ విషయంపై కూడా ఓ అంగీకారానికి రాలేదు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇరు రాష్ట్రాల మంత్రులతో రెండు కమిటీలు వేయాలని నిర్ణయించి చేతులు దులుపుకున్నారు. మిగిలిన సమయం అంతా డ్రగ్స్, సైబర్‌ క్రైమ్, మూసీ నది పరిరక్షణ తదితర అంశాలపై కేటాయించడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. అధికారుల కమిటీ రెండు వారాల్లోగా సమావేశమై చర్చలు జరపనుంది. 

ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ చర్చిస్తుందని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. మంత్రుల కమిటీ నిర్ణయాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించనున్నారు. వీరి స్థాయిలో కూడా ఫలితం తేలకపోతే ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ భేటీ అయ్యి చర్చిస్తారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌లు సమావేశ వివరాలను విలేకరులకు వివరించారు.

సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు 

పలు ప్రశ్నలపై దాటవేత
పోలవరం ముంపు మండలాలు, విద్యుత్‌ బకాయిలు వంటి అంశాలపై చర్చించారా అని ఇరు రాష్ట్రాల మంత్రులను విలేకరులు ప్రశ్నించగా.. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. నేరుగా సమాధానం ఇవ్వకుండా అన్ని విషయాలు చర్చించామన్నారు. విలేకరులు మరో ప్రశ్న వేస్తుండగానే సమావేశం ముగించి వెళ్లిపోయారు. అంతకు ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బహూకరించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి వెంకటేశ్వరస్వామి ఫొటో బహూకరించి, రేవంత్, భట్టిలకు చంద్రబాబు శాలువా కప్పి సత్కరించారు. 



ఈ సమావేశంలో ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్‌రెడ్డి, సీఎస్, ఇతర అధికారులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర విభజన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపానని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగిందన్నారు.  

డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌గా చేయడానికి కలిసి పనిచేస్తాం
పదేళ్లుగా పరిష్కారం దొరకని సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరుకుతుందని అనుకోలేదు. వీటి పరిష్కార మార్గం కోసం కలిసి పని చేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడం కోసం సీఎస్‌ స్థాయి అధికారులతో కూడిన ఒక కమిటీ, మంత్రుల స్థాయిలో ఇంకో కమిటీ వేశాం. ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ రెండు వారాల్లోగా సమావేశం అవుతుంది. ముందుగా అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యే అంశాలను చర్చిస్తాం. 

అక్కడ ఫలితం రాకపోతే ఆ తర్వాత మంత్రుల స్థాయిలో చర్చలు ఉంటాయి. మంత్రుల స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే తిరిగి ముఖ్యమంత్రులు సమావేశమై చర్చిస్తారు. ఈ సమావేశంలో విభజన సమస్యల పరిష్కారంతో పాటు డ్రగ్స్‌ నిర్మూలన, సైబర్‌ క్రైమ్‌ను అరికట్టడం వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నాం. 

తెలంగాణను డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించుకొని అందుకోసం ఏడీజీ స్థాయి అధికా­రులతో ప్రత్యేక కమిటీ వేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ కూడా ఏడీజీ స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి డ్రగ్స్‌ నిర్మూలనకు సహకరించాలన్న కోరికను అంగీకరించింది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలను అరికట్టడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో కలిసి పని చేస్తున్నాం.
– తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

పిల్లల స్కూల్‌ బ్యాగుల్లో గంజాయి
విభజన చట్ట సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చర్చలతో సత్వరం పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తాం. ఇరు రాష్ట్రాలు కలసి అభివృద్ధి చెందేలా తరచూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు. 

తెలంగాణ కోరిన విధంగా రాష్ట్రంలో గంజాయి సరఫరా నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. ఆరుగురు మంత్రులతో సబ్‌ కమిటీ వేశాం. ఏపీలో 8వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతోంది. ఏపీలో అత్యధికంగా సాగవుతున్న గంజాయి తమ రాష్ట్రానికి వస్తోందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు హర్షించేలా విభజన సమస్యలను పరిష్కరిస్తాం.
– ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement