ఏ రాష్ట్రానికి ప్రాధాన్యతో చెప్పండి
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లకు నమూనా పత్రం జారీ
మెమో జారీ చేసిన సీఎస్ మహంతి
{పాధాన్యత ప్రకారమే కేటాయింపు హక్కు కాదంటూ అండర్ టేకింగ్
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏ రాష్ట్ర కేడర్‌కు ఇష్టపడతారో ఈ నెల 16వ తేదీలోగా చెప్పాల్సిందిగా అఖిల భార త సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కోరారు. ఈ మేరకు నమూనా పత్రంతో పాటు మెమోను శుక్రవారం జారీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తొలి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్‌కు ఇస్తారో లేదా తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఇస్తారో నమూనా పత్రంలో తెలియజేయాలని సూచించారు. రెండు రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తే ఆ విషయం కూడా తెలియజేయవచ్చునని స్పష్టం చేశారు. తమ ప్రాధాన్యతల ప్రకారమే ఆయా రాష్ట్రాల కేడర్లకు కేటాయింపులు జరగాలనే హక్కు ఎవరికీ ఉండదని పేర్కొంటూ ఆ మేరకు అండర్ టేకింగ్‌ను అధికారుల నుంచి నమూనా పత్రంలో తీసుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే.. కేవలం ప్రాధాన్యతలు అడిగామని చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక పక్క ప్రాధాన్యతలను అడుగుతూ దాని కిందే ప్రాధాన్యతల ప్రకారం కేటాయింపులు చేయలేదని అడిగే హక్కు ఎవరికీ ఉండదని కూడా అండర్ టేకింగ్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని అధికారులంటున్నారు. ఇలావుండగా సదరు నమూనా పత్రాలను పూరించి సీల్డ్ కవర్‌లో ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5 గంటలకల్లా ఐఏఎస్‌లు అయితే సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ కార్యదర్శి శివశంకర్‌కు, ఐపీఎస్‌లైతే శాంతిభద్రతల అదనపు డీజీ వి.ఎస్.కె.కౌముదికి, ఐఎఫ్‌ఎస్‌లైతే అదనపు పీసీసీఎఫ్ ఆర్.జి. కలఘట్గికి సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డెరైక్ట్ రిక్రూటీలు, కన్ఫర్డ్ అధికారులు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే
అఖిల భారత సర్వీస్ అధికారుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను ఈ నెల 16వ తేదీన ప్రత్యూష సిన్హా కమిటీ ఖరారు చేయనుంది. అనంతరం ఈ నెల 17 లేదా 18వ తేదీన వాటిని బహిర్గత పరచనుంది. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ అధికారులను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే కేటాయించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణరుుంచింది. అలాగే కన్ఫర్డ్ అధికారులను కూడా ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే కేటాయించనున్నారు. రాష్ర్ట కేడర్‌కు చెందిన ఇతర రాష్ట్రాల అధికారులను మాత్రం రోస్టర్ విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు.