శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి హథీరాంజీ మఠం ద్వారా ఇచ్చిన ఆభరణాలు మాయయ్యాయి. కానుకల రూపంలో ఇచ్చిన వందలాది ఎకరాల భూములకు సంబంధించిన పక్కా సమాచారం లేదు. భూములు,
బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులు మహంతు అర్జున్‌దాస్‌ఉంటున్న గదిలో దాచిపెట్టారని భావిస్తున్నారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అర్జున్‌దాస్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఒకరోజు ముందే విషయం తెలుసుకున్న అర్జున్‌దాస్ కనిపించకుండా పోయారు. ఆయన ఉంటున్న గది తాళాలు కూడా కనిపించలేదు. వారం రోజులు వేచి ఉన్న అధికారులు సోమవారం రెవెన్యూ అధికారులు, మఠం ప్రత్యేక అధికారి శ్రీకాళహస్తి ఈఓ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో తాళాలు పగులగొట్టి పత్రాలను స్వాధీనంచేసుకున్నారు.
సాక్షి, తిరుపతి: హథీరాంజీ మఠం మహంతు గది తాళాలు పగులగొట్టి రెవెన్యూ, ప్రత్యేక అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అవినీతి గుట్టు రట్టవుతుందని భక్తులు భావిస్తున్నారు.
కలియుగ వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వరునికి ఎంతో మంది రాజులు, చక్రవర్తులు హథీరాంజీ మఠం ద్వారా భూములతోపాటు వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలు కానుకలుగా సమర్పించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడు పర్యాయాలు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో కిరీటాలు, కంఠాభరణాలు, దేవుని ప్రతిమలతో పాటు అత్యంత విలువైన వజ్రాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు పూజా పాత్రలు, బంగారు ప్లేట్లు ఉన్నాయి. వీటిలో అత్యంత విలువైన పచ్చతోపాటు ప్రత్యేకమైన బంగారు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రలో స్వామివారికి నైవేద్యంగా పాలు ఇచ్చేవారట.
ఎన్నో ఆరోపణలు
స్వామివారికి మఠం ద్వారా అందిన బంగారు కానుకల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కొంత మంది మహంతులు వాటిని కరిగించినట్లు చెబుతున్నారు. 1968 ప్రాంతంలో మఠం నిర్వాహకులపై ఆరోపణలు వచ్చాయి. మఠానికి చెందిన బంగారు నగలను స్వాహా చేసినట్లు అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. కొంతమందిపై కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. అప్పట్లో జోక్యం చేసుకున్న దేవదాయ ధర్మాదాయ శాఖ హథీరాంజీ మఠానికి చెందిన బంగారు నగలను బ్యాంకుల్లో భద్రపర్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 1968–1969 ప్రాంతంలో మఠం నగలను చంద్రగిరితో పాటు తిరుపతిలోని బ్యాంకుల్లో భద్రపరిచారని, దాదాపు ఆరు చెక్కపెట్టెల్లో ఆ నగలను ఉంచినట్లు సమాచారం. ఎప్పుడైనా ఆ నగలను మఠం నిర్వాహకులు చూడాలంటే చిత్తూరులోని ప్రధాన కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ లాకర్లలో ఉంటున్న బంగారు నగల వివరాలను ఒక రిజిస్టర్‌లో నమోదుచేశారు. స్థిర చరాస్తులకు సంబంధించిన ఆ రిజిస్టర్‌లో మఠానికి చెందిన ఏయే నగలు ఉన్నాయి, వాటి బరువెంత.. తదితర వివరాలను పొందుపరిచారని తెలిసింది.
మహంతులు వచ్చాకే..
1975లో హథీరాంజీ మఠానికి దేవేంద్రదాస్ మహంతుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మహంతుకు పట్టాభిషేకం నిర్వహించారు. దీంతో బ్యాంక్ లాకర్లలోఉన్న బంగారు నగలను కోర్టు అనుమతితో దేవేంద్రదాస్ పట్టాభిషేకానికి వినియోగించారని తెలి సింది. ఆరునెలలకొకసారి లాకర్లలోని నగలను పరిశీలించాల్సి ఉంది. చెక్క పెట్టెలు తుప్పుబట్టాయా? బంగారు నగలు రంగు మారాయా? వంటి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. కానీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆ నగల పరిస్థితి ఏంటో తెలియదు. కొంతమంది మహంతులు కోర్టు అనుమతితో బ్యాంకు లాకర్లు తెరిచినట్లు సమాచారం. ఆ సందర్భంలోనే బంగారు నగల వ్యవహారంలో గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. అసలు నగల స్థానంలో గిల్టువి పెట్టినట్టు ప్రచారం ఉంది.
రికార్డులను తనిఖీ చేస్తున్న అధికారులు
2006 తర్వాత గోల్‌మాల్ జరిగిందా?
ప్రస్తుతం హథీరాంజీ మఠం మహంతుగా ఉంటున్న అర్జున్ దాస్ 2006లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్య కాలంలోనే నగలు గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2018 మార్చిలో లోకాయుక్త కోర్టు హథీరాంజీ మఠం నగల వివరాలను ఆరా తీసింది. 16 ప్రశ్నలను సంధించింది. మఠానికి సంబంధించి ఎలాంటి నగలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడైనా వాటిని పరిశీలించారా? అంటూ మఠంతో పాటు దేవదాయ ధర్మాదాయ శాఖను ప్రశ్నించింది. దేవదాయ శాఖ, ఇటు మఠం నిర్వాహకుల నుంచి సరైన సమాధానం రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
పుణేలో భూముల కొనుగోలు?
శ్రీవారికి కానుకల రూపంలో హథీరాంజీ మఠం ద్వారా మొత్తం 250 రకాల బంగారు ఆభరణాలు, నాణేలు, కిరీటాలు సమర్పించినట్లు సమాచారం. వీటన్నింటినీ చంద్రగిరిలోని ఓ బ్యాంక్ లాకర్‌లో ఉంచారు. మహంతులు వచ్చాక ఆ ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సస్పెన్షన్‌కు గురైన అర్జున్‌దాస్ వద్దే బ్యాంక్ లాకర్ తాళాలు ఉంచుకున్నారు. ఆయన కొద్ది రోజులుగా కనిపించకుండాపోయారు. కానుకల రూపంలో కోట్లు విలువచేసే ఆభరణాలు ఎక్కడ ఉంచారనే లెక్కలు అర్జున్ దాస్‌కు తప్ప మఠం నిర్వాహకుల వద్ద లేవు. లాకర్లో దాచి ఉంచిన వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు అమ్మి పుణేలో అర్జున్‌దాస్ బంధువుల పేరున 200 ఎకరాలను కొనుగోలు చేసినట్లు మఠంలో పనిచేసే వారు చెబుతున్నారు.
బ్యాంకు ఖాతాలపై ఇన్‌చార్జి దృష్టి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాళహస్తి ఆలయ ఈఓ చంద్రశేఖరరెడ్డి నాలుగు రోజులుగా మఠంలో అధికారులతో సమావేశమవుతున్నారు. మఠం బ్యాంకు ఖాతా లపై ఆయన దృష్టి సారించారు. ఖాతాల్లోని మఠం సొమ్ము బయటకు వెళ్లకుండా చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకూ ఉన్న మహంత్ అర్జున్‌దాస్‌ను తప్పించినట్లు మఠానికి సంబంధించి ఖాతాలు ఉన్న ఏడు బ్యాంకులకు లేఖ రాశారు. ఇక నుంచి అన్ని కార్యకలాపాలు తామే చూసుకుంటామని స్పష్టం చేశారు.
మహంతు గది తాళాలు పగులగొడుతున్న అధికారులు
ఆ గది తాళాలు పగులగొట్టిన అధికారులు
మహంత్ అర్జున్‌దాస్ ఉంటున్న గదిని తెరిస్తే తప్ప నిజానిజాలు వెలుగుచూసే అవకాశం లేదని మఠం సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ఆ గది తాళాలను రెవెన్యూ అధికారుల సమక్షంలో సోమవారం పగులగొట్టారు. గదిలో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఎన్ని పత్రాలు ఉన్నాయనే వివరాలను లెక్కించే పనిలో పడ్డారు. రికార్డులను పరిశీలించడానికి మరి కొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేశాక పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment