సీమాంధ్ర సీఎం అధికార నివాసం గ్రీన్‌ల్యాండ్ కాదు.. లేక్‌వ్యూ
రెండు రాష్ట్రాల అతిధి గృహాలుగా పర్యాటక భవన్
విభజన సంబంధిత ఆదేశాలన్నీ ఎన్నికలయ్యాకే: సీఎస్
హైదరాబాద్: సీమాంధ్ర ముఖ్యమంత్రి అధికార నివాసంగా లేక్‌వ్యూ అతిధి గృహాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత గ్రీన్‌ల్యాండ్ అతిధి గృహాన్ని సీమాంధ్ర సీఎం అధికార నివాసంగా కేటాయించాలని భావించారు. అయితే గ్రీన్‌ల్యాండ్ పూర్తిగా రోడ్డు మీదకు ఉండటం, ట్రాఫిక్ సమస్యలు వస్తాయనే భావనతో లేక్‌వ్యూను కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే బేగంపేటలోని పర్యాటక భవన్ ను ఇరు రాష్ట్రాల అతిధి గృహాలకు వీలుగా మార్పులు చేయాలని నిర్ణయించారు. విభజన సంబంధిత ఆదేశాలను ఎన్నికలు పూర్తయ్యేవరకు జారీ చేయకూడదని నిర్ణరుుంచారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విభజనకు సిద్ధంగా ఉండాలని, సంబంధిత ఆదేశాలను మాత్రం ఎన్నికలు పూర్తయ్యూక జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సూచించారు. విభజనకు సంబంధించిన 21 కమిటీల ఉన్నతాధికారులతో సీఎస్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మే 15వ తేదీకల్లా కమిటీలన్నీ తుది సిఫారసులతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు మే 16వ తేదీన వెలువడి కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నందున వారితో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సీఎస్ తెలిపారు. ప్రస్తుతం శాఖలకు ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులుగా ఉన్న అధికారులే జూన్ 2వ తేదీన రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు ఫైళ్లతో పాటు ఆయా శాఖలకు చెందిన అంశాలను అప్పగించే బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. ప్రస్తుతానికి ఎక్కడున్న ఫర్నిచర్‌ను అక్కడే కొనసాగించాలని, ఎలాంటి మార్పులు చేయరాదని పేర్కొన్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు జూన్ 2వ తేదీన జరుగుతుందని అదే రోజు ఇరు రాష్ట్రాల అధికారులకు ఇప్పుడున్న శాఖాధికారులు అప్పగింతలు చేయాలని సూచించారు.