తెలంగాణ కేడర్‌కు మహంతి
నిర్ధారించిన కేంద్రం
8న అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలు ఖరారు
ఎన్నికల ఫలితాల తర్వాతే ఏ ప్రాంతానికి ఎవరో స్పష్టం
హదరాబాద్: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి తెలంగాణ కేడర్ కిందకు వస్తారని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. రాష్ట్ర విభజన అంశాల్లో మహంతి తొలి నుంచీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మరోపక్క ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలు ఈ నెల 8వ తేదీన ఖరారు కానున్నాయి. ఇందుకోసం ఏర్పాటైన ప్రత్యూష సిన్హా కమిటీ 8వ తేదీన ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎస్ మహంతి హాజరు కానున్నారు. డెరైక్ట్ రిక్రూటీలైన ఐఏఎస్‌లను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి కేటాయించనున్నారు. అలాగే కన్ఫర్డ్ ఐఏఎస్‌లు, ఇతర రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లను రోస్టర్ విధానంలో ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తొలుత ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే తమను రోస్టర్ విధానంలో కేటాయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కన్ఫర్డ్ ఐఏఎస్‌లు ప్రత్యూష సిన్హా కమిటీకి విజ్ఞాపన పత్రం సమర్పించారు. రాష్ట్ర విభజనే ప్రాంతాల ఆధారంగా జరిగినందున కన్ఫర్డ్ ఐఏఎస్‌లను రోస్టర్ విధానంలో కేటాయించడం సమజసం కాదని వారు విన్నవించారు. దీంతో కమిటీ పునరాలోచనలో పడినట్లు తెలిసింది.
కన్ఫర్డ్ ఐఏఎస్‌లను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే కేటాయించడమే ఉత్తమమనే అభిప్రాయానికి కమిటీ వచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఇక మిగిలిన రాష్ట్ర కేడర్‌కు చెందిన ఇతర రాష్ట్రాల ఐఏఎస్‌లను మాత్రం సీనియారిటీ ఆధారంగా రోస్టర్ విధానంలో పంపిణీ చేయనున్నారు. భార్య-భర్తలకు మాత్రం అప్షన్ ఉంటుంది. ఇందులో ఎవరు సీనియర్ అయితే వారి ఆప్షన్‌కు ఆమోదం తెలుపుతారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 293 ఐఏఎస్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను తొలుత జిల్లాల నిష్పత్తి ప్రకారం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి 125 మంది, సీమాంధ్ర రాష్ట్రానికి 168 మంది ఐఏఎస్‌లు వస్తున్నారు. వీరిలో పదోన్నతుల ద్వారా (కన్ఫర్డ్) ఐఏఎస్‌లైన వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 51 మంది ఉండగా సీమాంధ్రకు చెందిన వారు 49 మంది ఉన్నారు. వీరిని ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే కేటాయించనున్నారు. ఏ రాష్ట్రానికి ఎవరు అనే వివరాలను ఎన్నికలు కౌంటింగ్ పూర్తి అయిన తరువాతనే వెల్లడించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ పూర్తి అయిన తరువాతనే ఏ రాష్ట్రానికి ఏ అధికారి అనే వివరాలను వెల్లడించనున్నారు.