State chief secretary
-
'ఒక్క వలస కూలీ మృతి చెందకూడదు'
న్యూఢిల్లీ : లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు పడుతున్న ఇబ్బందులపై కేంద్ర హోం శాఖ మంగళవారం మరోసారి స్పందించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన తమ స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికుల బాధలను తగ్గించడానికి అన్ని రాష్ట్రాలు సహకరించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వలస కూలీలను తీసుకెళ్లడానికి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. (కరోనా.. కేంద్ర మంత్రి కార్యాలయం మూసివేత) వలస కూలీలు తమ ఇళ్లకు చేరుకోవడానికి ఏంచుకొన్న మార్గాల్లో విశ్రాంతి స్థలాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ స్థలాలను ఎన్జీవో సహాయంతో గుర్తించవచ్చని, వాటిని నిర్మించడంలో స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలని పేర్కొన్నారు. వలస కూలీలకు ఏర్పాటు చేయనున్న విశ్రాంతి గృహాల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని, వారికి నిత్యం ఆహారం అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలకు వెల్లడించారు. ఇక రైలు పట్టాలు, రోడ్ల వెంబడి వలస కూలీలు నడవకుండా చూసేలా ఆయా రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు చేపట్టేలా అక్కడి అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చినట్లు అజయ్ భల్లా పేర్కొన్నారు.ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖను ట్విటర్లో కూడా షేర్ చేశారు. (భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు) కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో సొంతూళ్ల బాట పట్టిన వలస కూలీలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. మంగళవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 12 మంది వలస కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో వలస కూలీల బాధలు కొంతమేరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. Proactive coord between States & @RailMinIndia reqd to run more trains; run more buses for smooth transport of #MigrantWorkers. Create rest places with food etc for people on foot, till they are guided to bus/rail stations. Dispel rumours, give clarity on train/bus departures:MHA pic.twitter.com/EUHZgU5egD — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) May 19, 2020 -
విభజన అంశాల్లో సీఎస్ తీరుపై గుర్రు
గవర్నర్ సహా ఐఎఎస్‌ల అసంతృప్తి ఆప్షన్ల పేరుతో గందరగోళం సృష్టిసున్నారని అసహనం వివాదాల పరిష్కార కమిటీని తిప్పి పంపిన గవర్నర్ పోలవరం ముంపు గ్రామాల ప్రతిపాదనలకూ నో హైదరాబాద్: విభజన అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అనుసరిస్తున్న తీరు పట్ల గవర్నర్ నరసింహన్‌తో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విభజన ప్రతిపాదనలపై ఆదివారం నిర్వహించిన సమావేశంలో సీఎస్ వ్యవహార శైలిపై గవర్నర్ బాహాటంగానే అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ ఆరు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించిన తరువాత గవర్నర్ నరసింహన్ కూడా ఆమోదం తెలిపారు. అయితే మళ్లీ బడ్జెట్ కేటాయింపులకు ఆమోదం అంటూ ఫైలు పంపడంపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి గవర్నర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలంటూ సీఎస్ ప్రతిపాదించారు. దీనిపై గవర్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, పైగా ఆ కమిటీలో రెండు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు ఉంటారని, కనీసం ఆలోచన చేయకుండా ప్రతిపాదనలు తీసుకురావడం ఏమిటని గవర్నర్ మండిపడినట్లు సమాచారం. సీఎస్ ప్రతిపాదనలు ఆమోదించకుండా గవర్నర్ తిరస్కరించారు. పోలవరం ముంపు గ్రామాల్లో మరిన్ని గ్రామాలను చేర్చాలంటూ మరో ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. రాష్ట్ర పరిధిలోని లేని అవసరానికి మించిన అంశాల్లో కలగ చేసుకోరాదని గవర్నర్ చురకలంటించారు. ఐఏఎస్‌లకు ఆప్షన్లా?: అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలపై మహంతి వ్యవహరిస్తున్న తీరు పట్ల పలువురు ఐఏఎస్‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది సీనియర్లయితే తమ అసంతృప్తిని మహంతి ముందే వ్యక్తం చేశారు. అఖిల భారత సర్వీసు అధికారులకు ప్రాంతం అనేది ఉండదని, అలాంటిది సీఎస్ ఆప్షన్ల పేరుతో మొత్తం మార్గదర్శకాలను గందరగోళంలోకి నెట్టేశారని ఓ ఐఎఎస్ వ్యాఖ్యానించారు. 290 మంది ఐఏఎస్‌ల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పనపైనే గందరగోళ పరిస్థితిని తీసుకువస్తే ఇక రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీ ఏ విధం గా ఉంటుందో ఆలోచించుకోవచ్చునని పలువురు ఐఏఎస్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. డెరైక్ట్ రిక్రూటీలు తెలంగాణకు తక్కువగా ఉన్నందున ఆ మేరకు తెలంగాణకు వెళ్తామన్న వారిని కేటాయిస్తే సరిపోతుందని అంటున్నారు. ఈ నెల 16వ తేదీ కల్లా మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉన్నప్పటికీ సీఎస్ చర్యల వల్ల ఇప్పటి వరకు మార్గదర్శకాలు ఖరారు కాలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారుల మార్గదర్శకాల ఖరారుపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. -
పదోన్నతులు, నియామకాలు, బదిలీలపై నిషేధం
ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల పదోన్నతులపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ పూర్తయ్యేవరకు అన్ని రకాల పదోన్నతులపై నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని రకాల నియామకాలతోపాటు బదిలీలు, సీనియారిటీలు, సవరణలు, ఉద్యోగుల నియామకాల నియమ నిబంధనల్లో మార్పులు చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వాల్సి వస్తే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తగిన కారణాలను పేర్కొనాలని తెలిపారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాల్సిందిగా స్పష్టంచేశారు. -
తెలంగాణ కేడర్‌కు మహంతి
నిర్ధారించిన కేంద్రం 8న అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలు ఖరారు ఎన్నికల ఫలితాల తర్వాతే ఏ ప్రాంతానికి ఎవరో స్పష్టం హదరాబాద్: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి తెలంగాణ కేడర్ కిందకు వస్తారని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. రాష్ట్ర విభజన అంశాల్లో మహంతి తొలి నుంచీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మరోపక్క ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలు ఈ నెల 8వ తేదీన ఖరారు కానున్నాయి. ఇందుకోసం ఏర్పాటైన ప్రత్యూష సిన్హా కమిటీ 8వ తేదీన ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎస్ మహంతి హాజరు కానున్నారు. డెరైక్ట్ రిక్రూటీలైన ఐఏఎస్‌లను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి కేటాయించనున్నారు. అలాగే కన్ఫర్డ్ ఐఏఎస్‌లు, ఇతర రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లను రోస్టర్ విధానంలో ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తొలుత ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే తమను రోస్టర్ విధానంలో కేటాయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కన్ఫర్డ్ ఐఏఎస్‌లు ప్రత్యూష సిన్హా కమిటీకి విజ్ఞాపన పత్రం సమర్పించారు. రాష్ట్ర విభజనే ప్రాంతాల ఆధారంగా జరిగినందున కన్ఫర్డ్ ఐఏఎస్‌లను రోస్టర్ విధానంలో కేటాయించడం సమజసం కాదని వారు విన్నవించారు. దీంతో కమిటీ పునరాలోచనలో పడినట్లు తెలిసింది. కన్ఫర్డ్ ఐఏఎస్‌లను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే కేటాయించడమే ఉత్తమమనే అభిప్రాయానికి కమిటీ వచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఇక మిగిలిన రాష్ట్ర కేడర్‌కు చెందిన ఇతర రాష్ట్రాల ఐఏఎస్‌లను మాత్రం సీనియారిటీ ఆధారంగా రోస్టర్ విధానంలో పంపిణీ చేయనున్నారు. భార్య-భర్తలకు మాత్రం అప్షన్ ఉంటుంది. ఇందులో ఎవరు సీనియర్ అయితే వారి ఆప్షన్‌కు ఆమోదం తెలుపుతారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 293 ఐఏఎస్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను తొలుత జిల్లాల నిష్పత్తి ప్రకారం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి 125 మంది, సీమాంధ్ర రాష్ట్రానికి 168 మంది ఐఏఎస్‌లు వస్తున్నారు. వీరిలో పదోన్నతుల ద్వారా (కన్ఫర్డ్) ఐఏఎస్‌లైన వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 51 మంది ఉండగా సీమాంధ్రకు చెందిన వారు 49 మంది ఉన్నారు. వీరిని ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే కేటాయించనున్నారు. ఏ రాష్ట్రానికి ఎవరు అనే వివరాలను ఎన్నికలు కౌంటింగ్ పూర్తి అయిన తరువాతనే వెల్లడించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ పూర్తి అయిన తరువాతనే ఏ రాష్ట్రానికి ఏ అధికారి అనే వివరాలను వెల్లడించనున్నారు. -
నేడు భాటియా పదవీ విరమణ
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయంత్‌కుమార్ భాటియా శనివారం పదవీ విరమణ చేయనున్నారు. భాటియా స్థానం కొత్త కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే వారిగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. విద్యా శాఖ కార్యదర్శి జె.ఎస్.సహారియాతోపాటు ఇతర శాఖలకు చెందిన అమితాభ్ రాజన్, స్వాధీన్ క్షత్రియ తదితరులు కూడా ఈ పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారు. వీరిలో సహారియా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. కాగా జయంత్‌కుమార్ బాటియా పదవీ కాలం పొడిగించే అవకాశం ఎంతమాత్రం లేదని కొందరు మంత్రాలయ వర్గాలు అనుకోవడం వినిపిస్తోంది. కాగా సహారియా 2014 ఆగస్టులో పదవీ విరమణ పొంద నున్నారు. దీంతో ఆయనకు తొమ్మిది నెలలు ఈ పదవిలో కొనసాగే అవకాశం లభించనుంది. కాని వచ్చే సంవత్సరం లోక్‌సభ, శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పదవీకాలాన్ని పెంచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆ పదవిలో అమితాబ్ రాజన్‌ను నియమించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆసక్తి కనబరుస్తున్నారు. స్వాధీన్ క్షత్రియ పేరును కూడా మరి కొందరు సిపార్సు చేస్తున్నారని తెలుస్తోంది.