సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయంత్‌కుమార్ భాటియా శనివారం పదవీ విరమణ చేయనున్నారు. భాటియా స్థానం కొత్త కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే వారిగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. విద్యా శాఖ కార్యదర్శి జె.ఎస్.సహారియాతోపాటు ఇతర శాఖలకు చెందిన అమితాభ్ రాజన్, స్వాధీన్ క్షత్రియ తదితరులు కూడా ఈ పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారు. వీరిలో సహారియా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. కాగా జయంత్‌కుమార్ బాటియా పదవీ కాలం పొడిగించే అవకాశం ఎంతమాత్రం లేదని కొందరు మంత్రాలయ వర్గాలు అనుకోవడం వినిపిస్తోంది.
కాగా సహారియా 2014 ఆగస్టులో పదవీ విరమణ పొంద నున్నారు. దీంతో ఆయనకు తొమ్మిది నెలలు ఈ పదవిలో కొనసాగే అవకాశం లభించనుంది. కాని వచ్చే సంవత్సరం లోక్‌సభ, శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పదవీకాలాన్ని పెంచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆ పదవిలో అమితాబ్ రాజన్‌ను నియమించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆసక్తి కనబరుస్తున్నారు. స్వాధీన్ క్షత్రియ పేరును కూడా మరి కొందరు సిపార్సు చేస్తున్నారని తెలుస్తోంది.