Telangana cadre
-
తెలంగాణలో ‘కన్ఫర్డ్’ కిరికిరి! ఎస్సీఎస్ కోటా విషయమే తెలియదంటూ లబోదిబో!
సాక్షి, హైదరాబాద్: నాన్ స్టేట్ సివిల్ సర్వీస్ కేటగిరీలో కన్ఫర్డ్ ఐఏఎస్‌ల భర్తీ కోసం కొనసాగించిన దరఖాస్తు ప్రక్రియ, ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక జాబితాలోని అధికారుల సీనియార్టీపై అధికారవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులు ఈ మేరకు తమకు సమాచారమే అందలేదని అంటుండడం చర్చనీయాంశమవుతోంది. అవకాశం కోల్పోయిన సీనియర్ అధికారుల్లో దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా.. ఐఏఎస్... అఖిల భారత సర్వీసులో అత్యున్నతమైన పోస్టు. ఈ కొలువుకు సివిల్ సర్వీసెస్ ద్వారా ఎంపిక కావడం ఒక పద్ధతైతే.. రాష్ట్ర స్థాయిలో అర్హత కలిగిన కొందరు సీనియర్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపిస్తే.. అక్కడ జరిగే ఇంటర్వ్యూలో ఉత్తీర్ణతతో కన్ఫర్డ్ ఐఏఎస్‌గా ఎంపిక కావడం మరో విధానం. పలువురు సీనియర్ రెవెన్యూ అధికారులు ఎస్సీఎస్ (స్టేట్ సివిల్ సర్వీస్) కోటాలో పదోన్నతులతో ఐఏఎస్‌లుగా ఎంపికవుతుండగా.. ఇతర విభాగాలకు చెందినవారు నాన్ ఎస్సీఎస్ పద్ధతిలో సెలక్షన్ విధానంతో అతి తక్కువ సంఖ్యలో కన్ఫర్డ్ ఐఏఎస్‌లు అవుతుంటారు. ఈ క్రమంలోనే 2021 సంవత్సరానికి సంబంధించి నాన్ ఎస్సీఎస్ కేటగిరీలో ఐఏఎస్ (తెలంగాణ కేడర్) పోస్టుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతేడాది నవంబర్ 25వ తేదీన సచివాలయంలోని అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా నాన్ ఎస్సీఎస్ కేటగిరీలో కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా అర్హతలున్న అధికారులు 2022 డిసెంబర్ 3వ తేదీ నాటికి పూర్తిస్థాయి వివరాలతో కూడిన దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఆ మేరకు దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐదు పోస్టులకు 1:5 నిష్పత్తిలో 25 మందితో ప్రాథమిక జాబితాను రూపొందించి యూపీఎస్సీకి పంపింది. ఈనెల 24, 27వ తేదీల్లో యూపీఎస్సీ వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ, ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు అధికారవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అర్హులైనా గడువులోపు ఏసీఆర్లు అందక... నాన్ ఎస్సీఎస్ కేటగిరీలో కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం శాఖల వారీగా అర్హులైన అభ్యర్థుల నుంచి పూర్తిస్థాయి బయోడేటాతో కూడిన దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం వారం రోజుల గడువును మాత్రమే ఇస్తున్నట్లు లేఖలో స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన లేఖ సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు చేరడం.. అక్కడ్నుంచి సంబంధిత శాఖ ఉన్నతాధికారి (కమిషనర్/డైరెక్టర్)కు వెళ్లడం, ఆ తర్వాత కిందిస్థాయిలో ఉద్యోగులకు చేరడం, ఈ మేరకు ఫైళ్లు రూపొందించడం.. ఈ యావత్ ప్రక్రియకు బాగా సమయం పడుతుంది. అయితే ప్రభుత్వం వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వగా.. పలు శాఖల్లోని అధికారులకు ఈ మేరకు సమాచారమే అందలేదని తెలుస్తోంది. కొన్ని శాఖల అధికారులకు గడువు తేదీ ముగిసిన తర్వాత తెలియడంతో నిరాశకు గురికాగా.. మరికొందరికి చివరి నిమిషంలో తెలిసినప్పటికీ ఏసీఆర్ (యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్)లు అందక దరఖాస్తు చేసే అవకాశం లేకపోవడంతో లబోదిబోమన్నారు. ప్రభుత్వం ఇదివరకు కనిష్టంగా నెలరోజుల గడువు ఇచ్చేదని, ఆ తర్వాత కూడా అధికారుల వినతుల మేరకు మరో వారం నుంచి పక్షం రోజుల వరకు గడువు పొడిగించేదని పలువురు అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా కేవలం వారం రోజుల గడువే ఇవ్వడంతో అన్నిరకాల అర్హతలున్న వారు కూడా కనీసం దరఖాస్తు కూడా చేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకులు... పైరవీలు నాన్ ఎస్ఈసీ కన్ఫర్డ్ ఐఏఎస్‌ల ప్రక్రియకు సంబంధించిన సమాచారం కొందరికి ముందస్తుగానే లీకైనట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రుల వద్ద ప్రత్యేక విధుల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు, ప్రభుత్వ స్థాయిలో పరపతి కలిగిన అధికారులు ముందు జాగ్రత్తగా దరఖాస్తుకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా ముందస్తుగా సమాచారం తెలిసి సిద్ధమైన వారే దరఖాస్తులు సమర్పించగలిగారని అంటున్నారు. ఆలస్యంగా సమాచారం అందుకున్న సీనియర్లు సైతం అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఒకరిద్దరు సీనియర్లు అన్నిరకాల సమాచారాన్ని సమర్పించినప్పటికీ ప్రాథమిక జాబితాలో వారి పేర్ల స్థానంలో జూనియర్ల పేర్లు ఎంపికయ్యాయని కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదివరకు ఏసీబీ వలలో చిక్కి విధుల నుంచి సస్పెండ్ అయ్యి, జైలుకు సైతం వెళ్లిన ఓ అధికారి పేరు జాబితాలో ఉండటం అధికార వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో నలుగురు అధికారులు పరిపాలన విభాగంలో గత కొంత కాలంగా విధులు నిర్వహించనప్పటికీ వారు కూడా జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. మొత్తంగా పైస్థాయిలో పైరవీలతో జాబితా రూపొందించారనే ప్రచారం జరుగుతుండగా, ప్రభుత్వం దీనిపై స్పందించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. నాన్ ఎస్సీఎస్ కేటగిరీలో కన్ఫర్డ్ ఐఏఎస్‌కు అర్హతలు ►అత్యుత్తమ ప్రతిభా సామర్థ్యాలు కలిగిన డిప్యూటీ కలెక్టర్ హోదా పే స్కేల్ కలిగిన అధికారి ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ►2022 జనవరి ఒకటో తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వంలో 8 సంవత్సరాల నిరంతర సర్వీసులో ఉండాలి. ►ఎంపిక ప్రక్రియ మొదలైన ఏడాది నాటికి 56 ఏళ్ల కంటే తక్కువ వయసుండాలి. ►ఇదివరకు సెలక్షన్ లిస్టులో పేరు ఉన్నట్లైతే వారికి అవకాశం ఉండదు. ►దరఖాస్తు చేసుకునే అధికారి శాఖా పరంగా ఎలాంటి క్రమశిక్షణ చర్యలకు గురై ఉండకూడదు. విచారణలు పెండింగ్‌లో సైతం ఉండొద్దు. -
తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆరుగురు ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఆరుగురు 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. శ్రద్ధ శుక్ల (ఛత్తీస్‌గఢ్), కిరణ్మయి కోపిశెట్టి (తెలంగాణ), నారాయణ్ అమిత్ మాలెపాటి (తెలంగాణ), వికాస్ మహతో (ఝార్ఖండ్), ఉమాశంకర్ ప్రసాద్ (బిహార్), మాయంక్ సింగ్ (మధ్యప్రదేశ్) త్వరలో రాష్ట్ర కేడర్‌లో చేరనున్నారు. కేంద్ర సర్వీసులకు రజత్‌షైనీ రాష్ట్ర రెవెన్యూ శాఖ లో సీసీఎల్ఏ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ షైనీ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండస్ట్రీ ప్రమోషన్, ఇంటర్నల్ ట్రేడ్ విభాగానికి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: రైతే జెండా.. ఎజెండా! బీఆర్ఎస్ కార్యచరణపై కేసీఆర్ కసరత్తు -
ఐపీఎస్ అభిలాష బిస్త్ కేటాయింపుపై యథాతథస్థితి కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్ కేడర్ కేటాయింపుపై యథాతథస్థితి (స్టేటస్కో)ని కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది తీర్పు వెలువరించే వరకూ ఆమెను తెలంగాణ కేడర్లోనే కొనసాగించాలని క్యాట్ సభ్యులు వెంకటేశ్వర్రావు, రంజనా చౌదరి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అభిలాషను మొదట తెలంగాణ కేడర్‌కు కేటాయించారని, తర్వాత సీనియారిటీకి విరుద్ధంగా ఆమెను ఏపీ కేడర్‌కు కేటాయించారని ఆమె తరఫు న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం అభిలాష ఐక్యరాజ్యసమితికి డిప్యుటేషన్‌పై వెళ్లి సూడాన్‌లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏపీ కేడర్‌కు చెందిన కుమార్ విశ్వజిత్‌ను వివాహం చేసుకోవడంతో అభిలాష ఏపీ కేడర్‌కు వచ్చారన్నారు. మహిళా ఐపీఎస్‌లు సౌమ్యామిశ్రా, షికాగోయల్లకన్నా అభిలాష సీనియర్ అయినా సీనియారిటీ జాబితాలో ద్వితీయ స్థానంలో ఉంచి ఆమెను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సీనియారిటీ జాబితా రూపొందించారని నివేదించారు. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను క్యాట్ ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
అప్పీలుకు వెళ్లనున్న ఐపీఎస్‌లు?
కేటాయింపులపై రుసరుసలు తెలంగాణలోనే ఆరుగురు డీజీపీ స్థాయి ఆఫీసర్లు హైదరాబాద్: తాము కోరిన రాష్ట్రానికి తవును కేటారుుంచలేదని అసంతృప్తికి గురైన కొందరు పోలీసు అధికారులు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 29 వరకు అప్పీలుకు వెళ్లేందుకు గడువు ఇవ్వడంతో అధికారులు ఈ విషయుంలో సన్నాహాలు ప్రారంభించారని తెలుస్తోంది. కాగా అదనపు డీజీ సురేంద్రబాబు, అనురాధలు స్పౌజ్ కాజ్‌తో ఇరువురు కూడా ఇటు తెలంగాణ లేదా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్లలో ఏదో ఒక రాష్ట్రానికి కేటాయించాలని కోరే అవకాశవుుంది. భార్యాభర్తలైన ఇద్దరు అదనపు డీజీ స్థాయి అధికారులు ఎన్.వి.సురేంద్ర బాబు, ఏఆర్ అనురాధలు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఆప్షన్ ఇచ్చారు. అయితే కేటాయింపుల్లో మాత్రం సురేంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు, అనురాధ తెలంగాణ కేడర్‌కు ఎంపిక చేశారు. అలాగే ఇద్దరు ఐపీఎస్ సోదరులు, రాష్ట్ర మాజీ డీజీపీ ఎ.కె. మహంతి కుమారులిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆప్షన్ ఇవ్వగా అవినాష్ తెలంగాణకు, అభిషేక్ ఏపీకి ఎంపికయ్యారు. అంతేగాకుండా తాత్కాలిక కేటాయింపుల్లో భాగంగా తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులు ఈ రాష్ట్రానికే తమ ఆప్షన్ ఇవ్వగా వారిలో సగానికి పైగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. రెండు రాష్ట్రాలకు జరిపిన కేటాయింపుల్లో ఆరుగురు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) స్థాయి అధికారులను తెలంగాణకు కేటాయించారు. రాష్ట్రానికి అవసరమైన మేరకు ఇద్దరు డీజీపీలు కేడర్ ర్యాంకులో, మరో ఇద్దరు నాన్ కేడర్ ర్యాంకులో డీజీపీలు ఉండాలని భావిస్తుండగా, ఈ సంఖ్య కంటే ఇద్దరు డీజీపీలు ఎక్కువగా ఉన్నారని ఐపీఎస్ వర్గాలు పేర్కొన్నాయి. రోస్టర్ బ్యాండ్‌పై ఐపీఎస్‌ల అసహనం రాష్ట్ర విభజనతో అనివార్యమైన అఖిల భారత సర్వీసు అధికారుల పంపకానికి కేంద్రం చేపట్టిన రోస్టర్ బ్యాండ్ విధానంపై పలువురు ఐపీఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ మారడంతో తమ స్థానాలు మారిపోయాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పౌస్ గ్రౌండ్‌కు ప్రామాణికతను సైతం ఎక్కడా పేర్కొనకపోవడంపైనా విమర్శలు చేస్తున్నారు. ఈ అంశాలపై కమిటీకి అభ్యంతరం తెలపాలని అధికారులు నిర్ణయించారు. రోస్టర్ పాయింట్స్ మారడంతో తాము వెళ్లాల్సిన రాష్ట్రానికి కాకుండా వేరే దానికి వెళ్లామని అధికారులు వాపోతున్నారు. రెండు రాష్ట్రాలకూ అధికారుల్ని కేటాయించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ వీటిపై అభ్యంతరాలు తెలపడానికి ఈ నెల 29 సాయంత్రం వరకు గడువు ఇచ్చింది. దీంతో పలువురు అధికారులు తమ అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. -
అధిపతులంతా తెలంగాణకే..
సాక్షి, ఖమ్మం: ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇరు రాష్ట్రాలకు చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌ల అధికారుల విభజనలో జిల్లాలోని అధికారులందరూ తెలంగాణ కేడర్‌లోకే వచ్చారు. జిల్లాలోని ముగ్గురు ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌లకు తెలంగాణ కేడర్ దక్కింది. రోస్టర్ పద్ధతిన విభజించిన ఈప్రక్రియలో జిల్లాకు చెందిన అధికారులు తెలంగాణ కేడర్‌తో ఇక జిల్లాలోనే విధులు నిర్వహించనున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ అధికారుల విభజనకు కసరత్తు ప్రారంభించినప్పటి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము ఏ కేడర్‌లోకి వెళ్తామోనని అందరూ ఆందోళనకు గురయ్యారు. నిబంధనలు ఎలా ఉంటాయి..? తాము ఎటు వైపు వెళ్లే అవకాశం ఉంది..? అని గత పదిహేను రోజులుగా ఈ అంశంపైనే అధికారుల్లో చర్చ సాగింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ తొలుత కొంత మంది అధికారులను లాటరీ పద్ధతిన, మరి కొందరిని రోస్టర్ పద్ధతిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజించింది. శుక్రవారం ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపకాలను ఈ కమిటీ పూర్తి చేసింది. అయితే జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా తెలంగాణ కేడర్లోనే ఉన్నారు. అటు వెళ్లి.. ఇటు వచ్చి.. ఈనెల 1న డాక్టర్ కె.ఇలంబరితి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో పాలనను చక్కదిద్దే పనిలో ఉండగానే ఐఏఎస్‌ల విభజనతో ఆయన ఎటు వైపు వెళ్తారోనని చర్చ జరిగింది. ఒక వేళ ఆయనకు తెలంగాణ కేడర్ దక్కకపోతే కొత్త కలెక్టర్ ఎవరు వస్తారోనని జిల్లాలో చర్చ జరిగింది. అయితే అధికారుల పంపకాల్లో చివరకు ఆయన తెలంగాణ కేడర్ కిందకే వచ్చారని, కలెక్టర్‌గానే జిఆల్లలోనే కొనసాగనున్నారని తేలింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇలంబరితి ..2005 ఐఏఎస్ బ్యాచ్. తొలి నుంచి ఆయన తెలంగాణ కేడర్‌నే కోరుకున్నారు. అలాగే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐటీడీఓ పీఓ డి.దివ్య కూడా.. ఆమె కోరుకున్నట్లే తెలంగాణ రాష్ట్ర కేడర్‌లోకే వచ్చారు. నల్లగొండకు చెందిన జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ రోస్టర్‌లో తెలంగాణ కేడర్లోనే ఉన్నారు. ఇద్దరు ఐపీఎస్‌లూ ఇక్కడే.. ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌ను ప్రత్యూష్ సిన్హా కమిటీ తెలంగాణ కేడర్ అధికారిగానే పరిగణనలోకి తీసుకుంది. ఆయన కూడా రోస్టర్‌లో తెలంగాణలోకే వచ్చారు. కరీంనగర్ జిల్లా వాసి, భద్రాచలం ఏఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి కూడా రోస్టర్‌లో తెలంగాణ కేడర్‌లోకే వచ్చారు. దీంతో జిల్లాలోని ముగ్గురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు తెలంగాణ కేడర్‌లోకి రావడంతో జిల్లాలోనే విధుల్లో కొనసాగనున్నారు. -
రాజధానిలో పనిచేసే ఐపీఎస్‌లది తెలంగాణ కేడరే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో విధులు నిర్వహించే ప్రతి ఐపీఎస్ అధికారి తెలంగాణ రాష్ట్ర కేడర్‌కే కేటాయించిన వారై ఉంటారు. నగర పోలీసుకమిషనర్ సహా వివిధ జోన్ల డీసీపీల వరకు ప్రస్తుతం 16 మంది ఉండగా, సైబరాబాద్ కమిషనరేట్‌లో కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలుపుకుని ఏడుగురు ఐపీఎస్‌లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ రాష్ట్ర ఐపీఎస్‌లను రెండు రాష్ట్రాలకు విభజించే ప్రక్రియను ముగించేంతవరకు ఒక హైదరాబాద్ కమిషనర్ మార్పు తప్పించి మిగతా అధికారులందరు కూడా యథా తథంగా వారిపోస్టులలో కొనసాగుతారని ఒకసీనియర్ అధికారి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రెండుప్రభుత్వాలు ఏర్పడి ఒకగాడిలో పడ్డాక ఉమ్మడి రాజధానిలో ఐపీఎస్అధికారుల మార్పు ఉంటుందన్నారు. అయితే ఇక్కడ నియమించే ప్రతి ఐపీఎస్అధికారి తెలంగాణ కేడర్‌కు చెందినవారే అయిఉంటారని చెప్పారు. అలాగే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలో పనిచేసే పోలీసు సిబ్బంది, అధికారుల జీతభత్యాలను తెలంగాణ సర్కారే చెల్లిస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు సంబంధించి క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడే గవర్నర్ జోక్యం చేసుకుని పరిష్కరిస్తారని, ఇక సాధారణ పోలీసు పాలన తెలంగాణ సర్కారే చూసుకుంటుందని ఆ అధికారి తెలిపారు. -
తెలంగాణ కేడర్‌కు మహంతి
నిర్ధారించిన కేంద్రం 8న అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలు ఖరారు ఎన్నికల ఫలితాల తర్వాతే ఏ ప్రాంతానికి ఎవరో స్పష్టం హదరాబాద్: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి తెలంగాణ కేడర్ కిందకు వస్తారని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. రాష్ట్ర విభజన అంశాల్లో మహంతి తొలి నుంచీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మరోపక్క ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలు ఈ నెల 8వ తేదీన ఖరారు కానున్నాయి. ఇందుకోసం ఏర్పాటైన ప్రత్యూష సిన్హా కమిటీ 8వ తేదీన ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎస్ మహంతి హాజరు కానున్నారు. డెరైక్ట్ రిక్రూటీలైన ఐఏఎస్‌లను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి కేటాయించనున్నారు. అలాగే కన్ఫర్డ్ ఐఏఎస్‌లు, ఇతర రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లను రోస్టర్ విధానంలో ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తొలుత ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే తమను రోస్టర్ విధానంలో కేటాయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కన్ఫర్డ్ ఐఏఎస్‌లు ప్రత్యూష సిన్హా కమిటీకి విజ్ఞాపన పత్రం సమర్పించారు. రాష్ట్ర విభజనే ప్రాంతాల ఆధారంగా జరిగినందున కన్ఫర్డ్ ఐఏఎస్‌లను రోస్టర్ విధానంలో కేటాయించడం సమజసం కాదని వారు విన్నవించారు. దీంతో కమిటీ పునరాలోచనలో పడినట్లు తెలిసింది. కన్ఫర్డ్ ఐఏఎస్‌లను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే కేటాయించడమే ఉత్తమమనే అభిప్రాయానికి కమిటీ వచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఇక మిగిలిన రాష్ట్ర కేడర్‌కు చెందిన ఇతర రాష్ట్రాల ఐఏఎస్‌లను మాత్రం సీనియారిటీ ఆధారంగా రోస్టర్ విధానంలో పంపిణీ చేయనున్నారు. భార్య-భర్తలకు మాత్రం అప్షన్ ఉంటుంది. ఇందులో ఎవరు సీనియర్ అయితే వారి ఆప్షన్‌కు ఆమోదం తెలుపుతారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 293 ఐఏఎస్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను తొలుత జిల్లాల నిష్పత్తి ప్రకారం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి 125 మంది, సీమాంధ్ర రాష్ట్రానికి 168 మంది ఐఏఎస్‌లు వస్తున్నారు. వీరిలో పదోన్నతుల ద్వారా (కన్ఫర్డ్) ఐఏఎస్‌లైన వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 51 మంది ఉండగా సీమాంధ్రకు చెందిన వారు 49 మంది ఉన్నారు. వీరిని ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే కేటాయించనున్నారు. ఏ రాష్ట్రానికి ఎవరు అనే వివరాలను ఎన్నికలు కౌంటింగ్ పూర్తి అయిన తరువాతనే వెల్లడించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ పూర్తి అయిన తరువాతనే ఏ రాష్ట్రానికి ఏ అధికారి అనే వివరాలను వెల్లడించనున్నారు.