ఐపీఎస్ అభిలాష బిస్త్ కేటాయింపుపై యథాతథస్థితి కొనసాగింపు | IPS officer moves CAT over cadre allotment | Sakshi
Sakshi News home page

ఐపీఎస్ అభిలాష బిస్త్ కేటాయింపుపై యథాతథస్థితి కొనసాగింపు

Published Wed, Dec 24 2014 7:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

IPS officer moves CAT over cadre allotment

సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్ కేడర్ కేటాయింపుపై యథాతథస్థితి (స్టేటస్‌కో)ని కొనసాగించాలని  కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది తీర్పు వెలువరించే వరకూ ఆమెను తెలంగాణ కేడర్‌లోనే కొనసాగించాలని క్యాట్ సభ్యులు వెంకటేశ్వర్‌రావు, రంజనా చౌదరి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
 
 అభిలాషను మొదట తెలంగాణ కేడర్‌కు కేటాయించారని, తర్వాత సీనియారిటీకి విరుద్ధంగా ఆమెను ఏపీ కేడర్‌కు కేటాయించారని ఆమె తరఫు న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం అభిలాష ఐక్యరాజ్యసమితికి డిప్యుటేషన్‌పై వెళ్లి సూడాన్‌లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏపీ కేడర్‌కు చెందిన కుమార్ విశ్వజిత్‌ను వివాహం చేసుకోవడంతో అభిలాష ఏపీ కేడర్‌కు వచ్చారన్నారు. మహిళా ఐపీఎస్‌లు సౌమ్యామిశ్రా, షికాగోయల్‌లకన్నా అభిలాష సీనియర్ అయినా సీనియారిటీ జాబితాలో ద్వితీయ స్థానంలో ఉంచి ఆమెను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సీనియారిటీ జాబితా రూపొందించారని నివేదించారు. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను క్యాట్ ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement