సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో విధులు నిర్వహించే ప్రతి ఐపీఎస్ అధికారి తెలంగాణ రాష్ట్ర కేడర్‌కే కేటాయించిన వారై ఉంటారు. నగర పోలీసుకమిషనర్ సహా వివిధ జోన్ల డీసీపీల వరకు ప్రస్తుతం 16 మంది ఉండగా, సైబరాబాద్ కమిషనరేట్‌లో కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలుపుకుని ఏడుగురు ఐపీఎస్‌లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ రాష్ట్ర ఐపీఎస్‌లను రెండు రాష్ట్రాలకు విభజించే ప్రక్రియను ముగించేంతవరకు ఒక హైదరాబాద్ కమిషనర్ మార్పు తప్పించి మిగతా అధికారులందరు కూడా యథా తథంగా వారిపోస్టులలో కొనసాగుతారని ఒకసీనియర్ అధికారి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రెండుప్రభుత్వాలు ఏర్పడి ఒకగాడిలో పడ్డాక ఉమ్మడి రాజధానిలో ఐపీఎస్‌అధికారుల మార్పు ఉంటుందన్నారు. అయితే ఇక్కడ నియమించే ప్రతి ఐపీఎస్‌అధికారి తెలంగాణ కేడర్‌కు చెందినవారే అయిఉంటారని చెప్పారు. అలాగే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లలో పనిచేసే పోలీసు సిబ్బంది, అధికారుల జీతభత్యాలను తెలంగాణ సర్కారే చెల్లిస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు సంబంధించి క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడే గవర్నర్ జోక్యం చేసుకుని పరిష్కరిస్తారని, ఇక సాధారణ పోలీసు పాలన తెలంగాణ సర్కారే చూసుకుంటుందని ఆ అధికారి తెలిపారు.
రాజధానిలో పనిచేసే ఐపీఎస్‌లది తెలంగాణ కేడరే
Published Sat, May 31 2014 2:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement