తెలంగాణలో ‘కన్ఫర్డ్‌’ కిరికిరి! ఎస్‌సీఎస్‌ కోటా విషయమే తెలియదంటూ లబోదిబో! | Telangana Conferred IAS Non SCS Quota Replacement Process Schedule! | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ‘కన్ఫర్డ్‌’ కిరికిరి! ఎస్‌సీఎస్‌ కోటా విషయమే తెలియదంటూ లబోదిబో!

Published Wed, Jan 18 2023 12:41 AM | Last Updated on Wed, Jan 18 2023 1:18 PM

Telangana Conferred IAS Non SCS Quota Replacement Process Schedule! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  నాన్‌ స్టేట్‌ సివిల్‌ సర్వీస్‌ కేటగిరీలో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ల భర్తీ కోసం కొనసాగించిన దరఖాస్తు ప్రక్రియ, ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక జాబితాలోని అధికారుల సీనియార్టీపై అధికారవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులు ఈ మేరకు తమకు సమాచారమే అందలేదని అంటుండడం చర్చనీయాంశమవుతోంది. అవకాశం కోల్పోయిన సీనియర్‌ అధికారుల్లో దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  

తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా.. 
ఐఏఎస్‌... అఖిల భారత సర్వీసులో అత్యున్నతమైన పోస్టు. ఈ కొలువుకు సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా ఎంపిక కావడం ఒక పద్ధతైతే.. రాష్ట్ర స్థాయిలో అర్హత కలిగిన కొందరు సీనియర్‌ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపిస్తే.. అక్కడ జరిగే ఇంటర్వ్యూలో ఉత్తీర్ణతతో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌గా ఎంపిక కావడం మరో విధానం. పలువురు సీనియర్‌ రెవెన్యూ అధికారులు ఎస్‌సీఎస్‌ (స్టేట్‌ సివిల్‌ సర్వీస్‌) కోటాలో పదోన్నతులతో ఐఏఎస్‌లుగా ఎంపికవుతుండగా.. ఇతర విభాగాలకు చెందినవారు నాన్‌ ఎస్‌సీఎస్‌ పద్ధతిలో సెలక్షన్‌ విధానంతో అతి తక్కువ సంఖ్యలో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌లు అవుతుంటారు.

ఈ క్రమంలోనే 2021 సంవత్సరానికి సంబంధించి నాన్‌ ఎస్‌సీఎస్‌ కేటగిరీలో ఐఏఎస్‌ (తెలంగాణ కేడర్‌) పోస్టుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతేడాది నవంబర్‌ 25వ తేదీన సచివాలయంలోని అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా నాన్‌ ఎస్‌సీఎస్‌ కేటగిరీలో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ ప్రక్రియ మొదలు పెట్టారు.

ఇందులో భాగంగా అర్హతలున్న అధికారులు 2022 డిసెంబర్‌ 3వ తేదీ నాటికి పూర్తిస్థాయి వివరాలతో కూడిన దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఆ మేరకు దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐదు పోస్టులకు 1:5 నిష్పత్తిలో 25 మందితో ప్రాథమిక జాబితాను రూపొందించి యూపీఎస్సీకి పంపింది. ఈనెల 24, 27వ తేదీల్లో యూపీఎస్సీ వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ, ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు అధికారవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 

అర్హులైనా గడువులోపు ఏసీఆర్‌లు అందక... 
నాన్‌ ఎస్‌సీఎస్‌ కేటగిరీలో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ కోసం శాఖల వారీగా అర్హులైన అభ్యర్థుల నుంచి పూర్తిస్థాయి బయోడేటాతో కూడిన దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం వారం రోజుల గడువును మాత్రమే ఇస్తున్నట్లు లేఖలో స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన లేఖ సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు చేరడం.. అక్కడ్నుంచి సంబంధిత శాఖ ఉన్నతాధికారి (కమిషనర్‌/డైరెక్టర్‌)కు వెళ్లడం, ఆ తర్వాత కిందిస్థాయిలో ఉద్యోగులకు చేరడం, ఈ మేరకు ఫైళ్లు రూపొందించడం.. ఈ యావత్‌ ప్రక్రియకు బాగా సమయం పడుతుంది.

అయితే ప్రభుత్వం వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వగా.. పలు శాఖల్లోని అధికారులకు ఈ మేరకు సమాచారమే అందలేదని తెలుస్తోంది. కొన్ని శాఖల అధికారులకు గడువు తేదీ ముగిసిన తర్వాత తెలియడంతో నిరాశకు గురికాగా.. మరికొందరికి చివరి నిమిషంలో తెలిసినప్పటికీ ఏసీఆర్‌ (యాన్యువల్‌ కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్స్‌)లు అందక దరఖాస్తు చేసే అవకాశం లేకపోవడంతో లబోదిబోమన్నారు.

ప్రభుత్వం ఇదివరకు కనిష్టంగా నెలరోజుల గడువు ఇచ్చేదని, ఆ తర్వాత కూడా అధికారుల వినతుల మేరకు మరో వారం నుంచి పక్షం రోజుల వరకు గడువు పొడిగించేదని పలువురు అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా కేవలం వారం రోజుల గడువే ఇవ్వడంతో అన్నిరకాల అర్హతలున్న వారు కూడా కనీసం దరఖాస్తు కూడా చేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

లీకులు... పైరవీలు
నాన్‌ ఎస్‌ఈసీ కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ల ప్రక్రియకు సంబంధించిన సమాచారం కొందరికి ముందస్తుగానే లీకైనట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రుల వద్ద ప్రత్యేక విధుల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు, ప్రభుత్వ స్థాయిలో పరపతి కలిగిన అధికారులు ముందు జాగ్రత్తగా దరఖాస్తుకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ విధంగా ముందస్తుగా సమాచారం తెలిసి సిద్ధమైన వారే దరఖాస్తులు సమర్పించగలిగారని అంటున్నారు. ఆలస్యంగా సమాచారం అందుకున్న సీనియర్లు సైతం అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఒకరిద్దరు సీనియర్లు అన్నిరకాల సమాచారాన్ని సమర్పించినప్పటికీ ప్రాథమిక జాబితాలో వారి పేర్ల స్థానంలో జూనియర్ల పేర్లు ఎంపికయ్యాయని కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు.

ఇదివరకు ఏసీబీ వలలో చిక్కి విధుల నుంచి సస్పెండ్‌ అయ్యి, జైలుకు సైతం వెళ్లిన ఓ అధికారి పేరు జాబితాలో ఉండటం అధికార వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో నలుగురు అధికారులు పరిపాలన విభాగంలో గత కొంత కాలంగా విధులు నిర్వహించనప్పటికీ వారు కూడా జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. మొత్తంగా పైస్థాయిలో పైరవీలతో జాబితా రూపొందించారనే ప్రచారం జరుగుతుండగా, ప్రభుత్వం దీనిపై స్పందించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు అధికారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

నాన్‌ ఎస్‌సీఎస్‌ కేటగిరీలో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌కు అర్హతలు

►అత్యుత్తమ ప్రతిభా సామర్థ్యాలు కలిగిన డిప్యూటీ కలెక్టర్‌ హోదా పే స్కేల్‌ కలిగిన అధికారి ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

►2022 జనవరి ఒకటో తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వంలో 8 సంవత్సరాల నిరంతర సర్వీసులో ఉండాలి.

►ఎంపిక ప్రక్రియ మొదలైన ఏడాది నాటికి 56 ఏళ్ల కంటే తక్కువ వయసుండాలి.

►ఇదివరకు సెలక్షన్‌ లిస్టులో పేరు ఉన్నట్లైతే వారికి అవకాశం ఉండదు. 

►దరఖాస్తు చేసుకునే అధికారి శాఖా పరంగా ఎలాంటి క్రమశిక్షణ చర్యలకు గురై ఉండకూడదు. విచారణలు పెండింగ్‌లో సైతం ఉండొద్దు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement