బావను సాగనంపేందుకు వెళుతూ... | Man Died in Bike Accident Srikakulam | Sakshi
Sakshi News home page

బావను సాగనంపేందుకు వెళుతూ...

Jan 22 2019 7:08 AM | Updated on Jan 22 2019 7:08 AM

Man Died in Bike Accident Srikakulam - Sakshi

రంజిత్‌కుమార్‌ మహరణ(ఫైల్‌)

తన చిన్న తనంలోనే తండ్రి తనువు చాలించాడు. తనతో పాటు సోదరి, సోదరుడి భారమంతా తల్లిపై పడింది. కడు పేదరికం, అందులో కట్టుకున్నవాడు అర్ధంతరంగా కన్నుమూసినా మొక్కవోని ధైర్యంతో ఆ తల్లి ఉన్నంతలో కుటుంబాన్ని మోసుకొస్తుంది. తల్లి కష్టాలను చూడలేక మగ పిల్లలిద్దరూ పేపర్‌బాయ్‌లుగా పని చేస్తూ, చదువుకోవడం ఆరంభించారు. ఈ సమయంలో సోదరి భర్తను సాగనంపేందుకు వెళుతున్న చిన్న కుమారుడిని లారీ రూపంలో మృత్యువు కబలించింది. తల్లితో పాటు సోదరి, సోదరుడిని కన్నీటి సంద్రంలో ముంచేసింది.  

శ్రీకాకుళం, మందస: నర్సింగ మహరణ, శోభావతి మహరణ దంపతులు వలస వచ్చి మందస పట్టణంలోని ఆర్టిజన్‌కాలనీలో జీవనం సాగిస్తున్నారు. వీరికి సోమేశ్వరరావు మహరణ, రంజిత్‌కుమార్‌ మహరణ, మాధురి మహరణ అనే పిల్లలు కలిగారు. వీరంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నర్సింగ మహరణ హటాత్తుగా మరణించాడు. దీంతో పిల్లల భారం తల్లిపై పడింది. అప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్న శోభావతి ఎంతో భారంగా పిల్లలను పెంచిపోషిస్తోంది. అయితే, తల్లి కష్టాలను చూడలేక మగ పిల్లలిద్దరూ పేపర్‌బాయ్‌లుగా పని చేస్తూ, చదువుకోవడం ఆరంభించారు. చిన్నవాడైన రంజిత్‌కుమార్‌ ‘సాక్షి’ పేపర్‌బాయ్‌గా పనిచేస్తూ, మందస బస్టాండ్‌లోని పలు షాపుల్లో పనిచేస్తూ, కాశీబుగ్గలోని ఎస్‌బీఎస్‌వైఎం కళాశాలల్లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం హెచ్‌ఈపీ చదువుతున్నాడు. సోదరి పెళ్లీడుకు రావడంతో సోదరులిద్దరూ ఎంతో కష్టపడి పెళ్లి చేసి, తండ్రిలేని లోటును తీర్చారు. ఈ తరుణంలో ఒడిశాకు చెందిన సోదరి భర్త నరేంద్ర మహరణను సాగనంపడానికి సోమవారం ద్విచక్రవాహనంపై ఒడిశా వెళ్తుండగా ఇచ్ఛాపురం మండలం, బలరాంపురం గ్రామం సమీపంలో ఘోరమైన ప్రమాదం జరిగింది.

ముందు వెళ్తున్న ట్రిప్పర్‌ హటాత్తుగా పక్కకు తిప్పడంతో నరేంద్ర, రంజిత్‌లిద్దరూ ట్రిప్పర్‌ వెనుక భాగాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రంజిత్‌కుమార్‌ అక్కడికక్కడే మరణించగా, నరేంద్ర తీవ్ర గాయాలకు గురికాగా, నడుము విరిగిపోయింది. ప్రస్తుత కాలంలో కాలేజిలో చదువుకునే విద్యార్థులు తమ సొంత పనులు చేసుకోవడానికే సిగ్గు పడుతున్న తరుణంలో కుటుంబం కష్టాలు... తాను చదువుకోవడానికి రాత్రనక, పగలన కష్టపడుతున్న రంజిత్‌కుమార్‌ హఠాన్మరణం అందర్నీ కలచివేసింది. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసే రంజిత్‌ మరణించాడా... అంటూ ప్రతీ ఒక్కరూ కన్నీటి పర్యాంతమవుతున్నారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేంద్రకు స్పృహ రావడంతో రంజిత్‌ ఎక్కడున్నాడని ప్రశ్నిస్తుండగా, ఆయనికి ఏమి చెప్పాలో తెలియని పరిస్థితిలో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చిన్న వయస్సులోనే కుటుంబానికి ఆధారంగా మారిన రంజిత్‌ మరణంతో తల్లి శోభావతి, సోదరుడు సోమేశ్వరరావు, సోదరి మాధురిలు రోదిస్తున్నారు. వారిని ఆపడం ఎవరి తరమూకాలేదు. సోమవారం సాయంత్రం రంజిత్‌ మృతదేహాన్ని మందస తీసుకువచ్చి బంధువులు, స్నేహితులు, స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, రంజిత్‌ ఇటీవల జాబ్‌మేళాలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో రైల్వేశాఖలో పని చేయడానికి ఎంపికయ్యాడు. రూ.15 వేలు జీతంపై విశాఖలో ఉద్యోగం చేసేందుకు బుధవారం వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో విధి వక్రీకరించి అందని లోకాలకు వెళ్లిపోయాడు.

సంఘటన జరిగిన తీరు ఇది
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్‌:  రాంగ్‌ రూట్‌లో వస్తున్న ట్రిప్పర్‌ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో విద్యార్థి మృతి చెందగా, డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ఒడిశా రాష్ట్రం బరంపురంనకు చెందిన నరేంద్ర మహరణ సంక్రాంతి పండగ సందర్భంగా ఇటీవల భార్య మాధురితో కలిసి మందసలోని అత్తవారింటికి వెళ్లాడు. సంక్రాంతికి అక్కడే గడిపి సోమవారం బావమర్థి రంజిత్‌ కుమార్‌ మహరణ(18)తో కలిసి ద్విచక్రవాహనంపై స్వగ్రామం బరంపురంనకు బయల్దేరాడు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఇచ్ఛాపురం మండలం దరి) బలరాంపురం వద్ద ఉన్న పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ కొట్టించేందుకు డ్రైవింగ్‌ చేస్తున్న నరేంద్ర మహారణ కుడివైపునకు తన ద్విచక్రవాహనం తిప్పాడు.

అయితే అప్పటికే రాంగ్‌ రూట్‌లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు కనస్ట్రక్షన్‌కు చెందిన ట్రిప్పర్‌ అదే సమయంలో అదే పెట్రోల్‌ బంకువైపు తిరగడంతో ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి నరేంద్ర హల్మెంట్‌ ధరించడంతో గాయాలుపాలవ్వగా, వెనుక కూర్చున్న బావమర్థి రంజిత్‌ ఎగిరి కింద పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రంజిత్‌ కుమార్‌ మృతి చెందాడు. గాయాలపాలైన నరేంద్రను మెరుగైన చికిత్స కోసం బరంపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పలాసలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్టు అతడి సోదరుడు సోమేష్‌ తెలిపాడు. భర్త మృతి చెందడంతో ఇద్దరు కుమారులే దిక్కుగా బతుకుతుండగా చిన్న కుమారుడు తనకు గర్భశోకాన్ని మిగిల్చాడని తల్లి శోభావతి ఆసుపత్రి వద్ద విలపించింది. ఇదిలావుండగా ట్రిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం డ్రైవర్‌ జరడా పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. జరడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement