సాక్షి, పెందుర్తి: తమ కూతురు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు విధి తీరని విషాదం నింపింది. భోజనం చేసేందకు రోడ్డు దాటేందుకు ప్రయత్నించడమే ఆమె పాలిట శాపమైంది. బైక్ ఢీకొనడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణానికి చెందిన ముల్లా షహీద(23) కుటుంబం ఉపాధి కోసం విశాఖ వలస వచ్చారు. ఆమె తల్లిదండ్రులు పెందుర్తి గాంధీనగర్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. కాగా, వీరికి ఒక్కగానొక్క కుమార్తె షహీద. అయితే, షహీద.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం పాఠశాలకు వెళ్లిన ఆమె.. స్కూల్‌లో ఒక విద్యార్థి భోజనం తీసుకురాకపోవడంతో తన భోజనాన్ని సదరు విద్యార్థికి ఇచ్చేశారు.
ఇక, సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఆకలి వేయడంతో ఆమె ఇంటికి సమీపంలోనే ఓ బండి వద్ద పునుగులు తిన్నారు. అనంతరం నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా దూసుకొచ్చిన బైక్.. ఆమెను ఢీకొట్టింది. దీంతో, షహీదా కుప్పకూలి కిందపడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఆమె కాలు విరిగిపోగా, చేతికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలిస్తుండగా తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గ మధ్యలోనే మృతి చెందారు.
దీంతో, ఒక్కగానొక్క కూతురు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడంతో పేరెంట్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక, ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెందుర్తి సీఐ మరడాన శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదానికి కారణమైన పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన యువకుడు రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగం ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: రూ. కోట్లకొద్దీ డబ్బు, బంగారం స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment