పలాసలో కుటుంబ సభ్యులను చెదరగొడుతున్న పోలీసులు
వీరఘట్టం/కాశీబుగ్గ/పాలకొండ రూరల్/టెక్కలి రూరల్: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకెండియర్ చదువుతున్న వుగిరి హర్షవర్ధన్ మృతిపై తల్లిదండ్రులు రామ్‌ప్రసాద్, నాగమణిలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
గురువారం పలాస ప్రభుత్వాస్పత్రిలో ఉన్న తమ కుమారుడి మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కూడా మృతదేహాన్ని అప్పగించకపోవడం, నేరుగా పోలీసులే స్వగ్రామం వీరఘట్టం తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పలాస నుంచి నేరుగా టెక్కలిలోని కళాశాల వద్దకు వెళ్లి బైఠాయించారు. వీరిని లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
పలాస ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
పలాస ప్రభుత్వాసుపత్రిలో ఉన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తీరుపై బంధువులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం సూచనల మేరకే అంతా నడుచుకుంటున్నారని, మృతిపై పోలీసులకు తప్పుడు రిపోర్టులు ఇచ్చారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బాధిత కుటుంబానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోస్టుమార్టం జరిగిన తర్వాత కూడా మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు.
హాస్టల్లో లేకపోతే ఎందుకు చెప్పలేదు?
పలాసలో గురువారం జరిగిన పరిణామాలు, కొందరు ప్రత్యక్ష సాక్షులు, రైల్వే ట్రాక్ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం హర్షవర్ధన్‌ది హత్యే అని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడిపై గిట్టనివారు హత్య చేసి మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై ఉంచి, ఈ ఉదంతాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసు సిబ్బందిని నిలదీశారు.
రెండు రోజులుగా హాస్టల్లో కుమారుడు లేకపోయినా తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని సిబ్బందిని నిలదీశారు. కుమారుడి మొబైల్ ఫోన్ నుంచి ఎవరో కావాలనే వాడి మిత్రులకు తప్పుడు సమాచారాన్ని వాట్సాప్‌ల ద్వారా పంపించారని ఆరోపించారు. తన కుమారుడి జేబులో నిత్యం పర్స్, ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ ఉంటాయని, చనిపోయిన ప్రాంతంలో ఎటువంటి వస్తువులు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.ఇది ముమ్మాటీకీ పరువు హత్యేనని ఆరోపించారు.
వీరఘట్టంలో ఉద్రిక్తత...
హర్షవర్ధన్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడం, పలాసలో పోలీసులు మృతుడి కుటుంబీకులపై వ్యవహరించిన తీరుపై వీరఘట్టంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తీసుకువచ్చిన హర్షవర్దన్ మృతదేహాన్ని ఊరి పొలిమేరల్లోనే పాలకొండ-పార్వతీపురం రహదారిపై అడ్డగించి రాస్తారోకో నిర్వహించారు.
వీరఘట్టం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన తెలియజేస్తూ రహదారిని నిర్బంధించారు. మహిళలు, యువకులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొని కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్షవర్ధన్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
స్తంభించిన ట్రాఫిక్..
గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో పాలకొండ-పార్వతీపురం రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం తెలుసుకున్న పాలకొండ డీఎస్పీ జి.స్వరూపారాణి, సీఐ సి.హెచ్.సూరినాయుడులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలను ఎస్పీ త్రివిక్రమవర్మకు తెలియజేశారు. అనంతరం ప్రయాణికుల ఇబ్బందులు గుర్తించి స్థానికులు ఆందోళన విరమించారు.
శోకసంద్రమైన వీరఘట్టం..
హర్షవర్దన్ మృతదేహం స్వగ్రామం రావడం.. వచ్చిన వెంటనే సంఘీబావంగా గ్రామస్తులు ఆందోళన చేయడం..పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం.. ఇలా అనేక పరిణామాల మధ్య గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఆందోళనలతో వీరఘట్టం శోకసంద్రమైంది. చివరకు విషణ్ణ వదనాలతో హర్షవర్దన్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment