ఆసుత్రిలో బాలుడి మృతదేహం
ఆ నవ్వులు ఆరేళ్లకే ఆగిపోయాయి. ఆ సంతోషాలు అప్పుడే అయిపోయాయి. ఒక్కగానొక్క కొడుకు. ఆరేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆశలరూపం. ఊరంతా పండగ చేసుకుంటున్న వేళ లారీ రూపంలో దూసుకువచ్చిన మృత్యువుకు బలైపోయాడు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతూ అందనంత దూరానికి వెళ్లిపోయాడు. ఇచ్ఛాపురం మండలంలోని లొద్దపుట్టిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల హేమంత్ కన్నుమూశాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్: తులసమ్మ సంబరంలో భాగంగా గ్రామస్తులంతా మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్తున్నారు. వీరితోపాటే ఆనందంగా గెంతులేస్తూ వెళ్తున్న ఓ బాలుడిని మృత్యురూపంలో వచ్చిన లారీ కబళించింది. దీంతో లొద్దపుట్టి గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఆదివారం స్థానికంగా పూజలందుకుంటున్న తులసమ్మ అమ్మవారి సంబరాన్ని చూసేందుకు అదే గ్రామానికి చెందిన పైలా యోగేష్, నిర్మల దంపతుల కుమారుడు హేమంత్(6) బయలు దేరాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై తోటి స్నేహితులతో కలిసి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు డివైడర్‌పై నుంచి రోడ్డు అంచుల్లోకి వచ్చాడు. ఇదేక్రమంలో చెన్నై నుంచి బీహార్‌కు వెళ్తున్న కార్లు లోడు లారీ ఢీకొంది. దీంతో ఎడమ చేయి నుజ్జునుజ్జయింది.
అయితే లారీ డ్రైవర్ ఆపకుండా సుమారు రెండు కిలోమీటర్లు దూరం వెళ్లిపోయాడు. స్థానిక యువకులు ద్విచక్రవాహనంపై వెంబడించి బెల్లుపడ వద్ద లారీని ఆపివేయించి రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొనఊపిరితో ఉన్న బాలుడిని ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరిలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తండ్రి యోగేష్ శ్రీకాకుళంలో వలస కూలీగా పనిచేస్తుండగా, తల్లి నిర్మల స్థానికంగా కూలీ పనులు చేసుకుంటోంది. ఆదర్శ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఏ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment