భర్తే.. మానవ మృగం..! | Dowry Harassments And Attack On A Women | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 25 2018 12:02 PM | Last Updated on Sun, Sep 2 2018 4:56 PM

Dowry Harassments And Attack On A Women  - Sakshi

సుజాతకు కాపలాగా ఉంచిన కానిస్టేబుల్‌ 

శ్రీకాకుళం రూరల్‌ : కడవరకు అండగా ఉంటానన్నాడు... కష్టసుఖాల్లో  పాలు పంచుకుంటానన్నాడు. ఏడు అడుగులు వేసి వేదమంత్రాల సాక్షిగా తాళికట్టిన భర్తే మానవ మృగంలా మారాడు. అదనపుకట్నం కోసం అత్త, ఆడపడుచు, భర్త ఒక్కటై హింసించి హత్య చేసేందుకు పూనుకున్నారు. తప్పించుకునే క్రమంలో ఆమె కాలు విరగ్గొడ్డి ఆస్పత్రి పాలుచేసిన ఘటన శ్రీకాకుళం రూరల్‌ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు లేని ఆ అభాగ్యురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో దీనస్థితిల్లో సహాయం కోసం ఎదురుచూస్తోంది.

ఉన్న తమ్ముడు కూడా కొంతవరకే సేవ చేసినప్పటికీ కాలకృత్యాలు విషయంలో ఆమె నరకం చవిచూస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై కనీసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక ఆస్పత్రిలోనే బిక్కుబిక్కుమంటుంది. ఈ హృదయవిధారక సంఘటనను చూసిన ప్రతీ ఒక్కరికీ కళ్ల నుంచి నీళ్లు తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళితే...

శ్రీకాకుళం రూరల్‌ మండలం కనుగులవానిపేటలో నివాసముంటున్న జాడ నాగరాజు(నగేష్‌) అనే వ్యక్తికి మొదటి భార్య చనిపోవడంతో ఎనిమిది సంవత్సరాల క్రితం ఆమదాలవలస మండలం సోట్టవానిపేట గ్రామానికి చెందిన సుజాతను రెండో వివాహం చేసుకున్నాడు. తల్లిలేని పిల్ల కావడంతో పేద పరిస్థితిలో అతి చిన్న వయస్సులోనే సుజాతకు నగేష్‌తో వివాహం జరిగింది. మద్యంకు అలవాటు పడ్డ నగేష్‌ సుజాతపై తన పైశాచికత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించేవాడు. వీరికి 5 సంవత్సరాల కుమారుడితో పాటు చనిపోయిన మొదటి భార్య కూతురు కూడా ఉన్నప్పటికీ ఇంట్లో పిల్లలు ముందే అత్యంత దారుణంగా కామావాంఛ తీర్చమనేవాడు. 

అదనపు కట్నం కోసం వేధింపులు

తల్లిదండ్రులు లేని సుజాతపై అత్త, ఆడపడుచులు లేనిపోని చాడీలు చెప్పి భర్తచే ప్రతీసారి రెండు తగిలించేవారు. ఇదే క్రమంలో సుజాత తండ్రికి సంబందించిన ఇన్యూరెన్స్‌ డబ్బులు రావడంతో గడచిన కొద్దిరోజులుగా వీరింతా మరింతగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో తినడానికి తిండి పెట్టకుండా అక్రమ సంబంధం అంటగడుతూ ప్రతీ నిత్యం ప్రత్యక్ష నరకం చూపించేవారు. వారం రోజులు క్రితం పూటుగా మద్యం సేవించిన నగేష్‌ తన చెల్లి టైలరింగ్‌ షాపు పెట్టుకోవడానికి డబ్బులు కావాలని, మీ నాన్నకు సంబంధించిన ప్రమాద బీమా సొమ్మును తేవాలని తీవ్రస్థాయిలో కుటుంబ సభ్యులు వత్తిడి చేశారు.

ఆ డబ్బులతో తనకు సంబంధం లేదని ఎట్టిపరిస్థితిల్లోనైనా వాటిని తెచ్చి ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఆమె మొండికేసింది. దీంతో తగాదా జరిగిన మరుసటిరోజు తన అక్క నివాసం ఉంటున్న రాగోలు గ్రామానికి కొడుకును తీసుకొని సుజాత వెళ్లిపోయింది. అక్క వద్ద ఉన్న సుజాత వద్దకు ఈ నెల 12వ తేదీన చేరుకున్న భర్త నగేష్‌ అక్కడ మరోసారి వాగ్వాదం చేశాడు. డబ్బులు తెస్తేనే ఇంటికి రావాలని, లేదంటే నీ దారి నువ్వు చూసుకోవాలంటూ మరింతగా బెదిరించాడు. ఏంచేసిన ఆ డబ్బులతో తనకు సంబంధం లేదంటూ తెగేసి చెప్పేసింది సుజాత. మద్యం మత్తులో ఉన్న భర్త ఓ బండరాయితో ఆమెను హత్య చేయబోయాడు. దీంతో తప్పించుకునే క్రమంలో ఆమె ఎడమకాలిపై పడడంతో ఒక్కసారిగా కాలు రెండు ముక్కలయింది. నడవలేని స్థితిలో ఉన్న సుజాతను తన తమ్ముడు దగ్గరిలో ఉన్న జెమ్స్‌ ఆస్పత్రిల్లో చేర్పించాడు.

ఆస్పత్రిలోనే కోర్కె తీర్చాలని పైశాచికంగా ప్రవర్తించిన భర్త

ఇదిలావుండగా ఆస్పత్రిలో ఆపసోపాలు పడుతూ వైద్యం పొందుతున్న సుజాతను చూసిన వారంతా అయ్యో... రామా అనే వారే ఎక్కువ. ఇవేవి పట్టించుకోని తన భర్త అక్కడే మృగంలా మారాడు. ఆస్పత్రిలో జాయినైనా మూడు రోజులు తర్వాత అర్ధరాత్రి 12 గంటల సమయంలో నగేష్‌ తన భార్య వద్దకు వెళ్లి అందరూ పడుకున్నారని తన కామ కోర్కె తీర్చాలని పట్టుబట్టాడు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న సుజాతను నేలపైకి రావాలంటూ అక్కడే బలవంతం చేయబోయాడు. దీంతో పక్కనే ఉన్న రోగుల బంధువులు కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పారిపోయాడు. 

ఆస్పత్రిలోనే ఫిర్యాదు తీసుకున్న ఐసీడీఎస్‌ సిబ్బంది

సుజాతకు జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారిని నిర్మల వెంటనే గురువారం జెమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి నేరుగా ఆమెనుంచే ఫిర్యాదు తీసుకుంది. తన భర్త, అత్త, ఆడపడుచు చేసిన ఘోరాలను ఆ అధికారిని వద్ద సుజాత భోరున విలపించింది. ఆస్పత్రిలో భర్త చేసిన పైశాచకత్వపు పనులకు గాను ఓ కానిస్టేబుల్‌ను సుజాతకు కాపాలాగా పెట్టించారు.

నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు

తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ భర్తే సర్వసం అనుకున్నాను. అదనపు కట్నం కోసం అత్త సరోజిని, ఆడపడుచు మాలతి కలిసి తన భర్తచే ప్రతీసారి వాతలు పెట్టించేవారు. మాట వినకపోతే వేధించడం... తిండి పెట్టకపోవడం... అనుమానించడం అన్ని నా భర్త నాకు ప్రత్యక్ష నరకాన్ని చూపించాడు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు.  

– సుజాత, బాధితురాలుబాధితురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement