ప్రమాదస్థలంలో డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తదితరులు వెంకటరత్నం, అనూష(ఫైల్)
శ్రీకాకుళం, పూసపాటిరేగ(నెల్లిమర్ల)/పోలాకి: కిడ్నీ రోగంతో బాధపడుతున్న మహిళను చికిత్స కోసం కారులో తీసుకెళ్తున్న ఓ కటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిందరవందర చేసేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఇద్దరు పురుషులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూసపాటి రేగ ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. పూసపాటిరేగ జాతీయ రహదారిపై పేరాపురం జంక్షన్ వద్ద సోమవారం వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దీర్ఘాసి గ్రామానికి చెందిన బొంతల వెంకటరత్నం (62), తలిసి అనూష(23) అనే మహిళలు మృతి చెందగా, వెంకటరత్నం భర్త గణేశ్వరరావు, కుమారుడు గోవిందరావుకు గాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు పేరాపురం జంక్షన్ వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందగా, అనూష సుందరపేట ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ఈ నలుగురు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వెంకటరత్నానికి చికిత్స అందించేందుకు విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రికి తమ సొంత కారులోనే తరలిస్తున్నపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంకటరత్నంకు ఒక కుమారుడు, ముగ్గురు కూమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె రాజేశ్వరి కుమార్తె అనూష. అనూష తండ్రి కారునాయుడు చిన్నప్పుడే మృతిచెందటంతో స్వగ్రామం చెల్లాయివలస నుంచి ధీర్ఘాశి కాలనీకి రాజేశ్వరి కుటుంబం వచ్చేసింది. అనూషకు ఇద్దరు చెల్లెళ్లు యామిని, నవ్యలు, తమ్ముడు వంశీలు ఉన్నారు. అనూష బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రస్తుతం విశాఖలోని అపోలో ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుంది. ఇటీవల నాగుల చవితి సందర్భంగా ఇంటికి వచ్చిన అనూష అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేకపోవటంతో తనతో పాటు విశాఖపట్నంలోని వైద్యం చేసేందుకు తీసుకువెళ్లిందని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పోలీసులు మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేసేందుకు విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విస్తరణ పనుల వల్లే ప్రమాదం..
పేరాపురం జంక్షన్‌లో ఆరులైన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. నూతనంగా నిర్మిస్తున్న రోడ్డులో ఎత్తుపల్లాలు ఉండడం, పాత రహదారి కంటే కొత్త రోడ్డు ఎత్తుగా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇప్పటికే రహదారి అంచులో సిమెంట్‌తో చేసిన స్టాపర్ దిమ్మలు వేయడం వల్ల చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, విస్తరణ పనుల వద్ద హైవే అధికారుల అచూకీ కూడా కానరావడం లేదని, దీని వల్ల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు.
డీఎస్పీ సందర్శన..
ప్రమాద విషయం తెలుసుకున్న డీఎస్పీ ఎన్.శ్రావణ్‌కుమార్ హుటాహుటిన పేరాపురం జంక్షన్‌లోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీరుపై ఎస్‌ఐ కృష్ణమూర్తిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా హైవే అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment