అర్ధరాత్రి ముగ్గురు మహిళలు.. | Sand mafia | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ముగ్గురు మహిళలు..

Published Tue, Aug 14 2018 12:36 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Sand mafia   - Sakshi

ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిశ్చల 

ఈ ముగ్గురు మహిళలు ఎవరు? పొన్నాం– బట్టేరు స్పెషలాఫీసరుగా వ్యవహరిస్తున్న ఈవోపీఆర్‌డీ కె.నిశ్చల (మధ్యలో), ఆమెకు ఇరువైపుల ఒకరు అంగన్‌వాడీ కార్యకర్త అరవల పద్మజ, మరొకరు ఆశా కార్యకర్త బమ్మిడి సుజాత! సమయం: ఆదివారం అర్ధరాత్రి!ఎక్కడ: శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని పొన్నాం–బట్టేరు ఇసుక ర్యాంపు వద్ద! ఏం పని: ఆర్‌డీవో, తహసీల్దారు ఆధ్వర్యంలో బృందం పట్టుకున్న ఇసుక అక్రమ రవాణా లారీలకు కాపలా!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శభాష్‌! అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిరోడ్డుపై నిర్భయంగా వెళ్లినపుడే నిజమైన స్వతంత్య్రం వచ్చినట్లన్న మహాత్ముడి మాటెలా ఉన్నా.. మన జిల్లాలో మాత్రం దాన్ని రుజువు చేశారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ పట్టుబడిన లారీలకు ముగ్గురు మహిళలను కాపలా పెట్టిన ఘనత మాత్రం మన అధికారులకే దక్కుతుంది!

పశ్చిమగోదావరి జిల్లాలో పట్టపగలే ఇసుక అక్ర మ తవ్వకాలను అడ్డుకోవడానికెళ్లిన తహసీల్దారు వనజాక్షికి టీడీపీ నేతల చేతుల్లో జరిగిన అవమానాన్ని మరచిపోయినట్లున్నారు! కోట్ల రూపాయలు రుచిమరిగిన మాఫియా ఇసుక దోపిడీ కోసం ఎంతకైనా తెగిస్తున్న ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న పాలనపై వెల్లువెత్తుతున్న విమర్శలనూ విస్మరించినట్లున్నారు!

ఫలితం... ఆ ముగ్గురిలో ఒకరైన పొన్నాం–బట్టేరు స్పెషలాఫీసరు ఈవోపీఆర్‌డీ కె.నిశ్చల అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు! కొంతమంది గ్రామస్థుల తోడుగా తెల్లవారుజాము వరకూ బిక్కుబిక్కుమంటూనే వారు ముగ్గురూ గడిపినా... ఈ ఘటన ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసే విషయంలో జిల్లా యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరికి అద్దం పట్టింది!

కనీసం పురుషోత్తపురం ఘటన తర్వాత కూడా తూతూమంత్రంగానే చర్యలు తప్ప కఠిన శిక్షలు లేకపోవడం వెనుక అధికార పార్టీ నాయకుల అదృశ్య హస్తం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు! 

అంతా ఇష్టారాజ్యం..

జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదుల్లో ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడట్లేదు. నిత్యం ఇసుక అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు... ఆరు లారీలుగా మాదిరిగా యథేచ్ఛగా సాగుతోంది. విశాఖ నగరంలో నిర్మాణాల అవసరాల ముసుగులో చేస్తున్న దోపిడీ అంతా ఇంతా కాదు! ప్రతి రోజూ చీకటి పడిన తర్వాత వందల లారీలు ఇసుకతో విశాఖ వైపు పరుగు తీస్తున్నాయి.

అయి తే అసలు వాటిలో అక్రమమేది? సక్రమమేది? అనేది అధికారులకూ తెలియదు. అలాగే అక్రమ రవాణాను, నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలను ఎవ్వరు నిరోధించాలనేదీ అంతుచిక్కని ప్రశ్నే అవుతోంది. వాస్తవానికి ఇందుకోసమే ప్రత్యేక బృందాలు ఉన్నాయి. వాటిలో మైన్స్‌ శాఖతో పాటు విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులు సభ్యులు!

బృందాల ఏర్పాటు బాగానే ఉన్నా వారి మధ్య సమన్వయలోపమే అసలు సమస్య. ఈ విషయం ఇటీవల సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ర్యాంపు దగ్గరే రుజువైంది. వంశధార వరదను సైతం లెక్కచేయకుండా 25 లారీలు, నాలుగు జేసీబీలతో ఇసుక తవ్వకాలకు దిగిన మాఫియా అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే.  

కాగితం ముక్కే సుదర్శన చక్రం..

ఇసుక అక్రమ రవాణాలో ఓ చిన్న కాగితం ముక్కే సుదర్శన చక్రంలా పనిచేస్తోంది. అన్ని ర్యాంపుల్లో మాదిరిగానే పొన్నాం–బట్టేరు ర్యాంపు నిర్వాహకులు కూడా లారీల యజమానులకు చిన్న కాగితం ముక్క ఇస్తున్నారు. దానిపై ఎన్‌ఎన్‌ఈ అనే ముద్రతో పాటు లారీ నంబరు తప్ప మరే వివరాలు ఉండవు.

జియోట్యాగింగ్‌ ఊసే లేదు. ఆ కాగితం ముక్కను చూపిస్తే ఇసుక లారీని చెక్‌పోస్టుల్లో కానీ, పోలీసు, రెవెన్యూ, మైన్స్‌ అధికారులెవ్వరూ ఆపరు! ఎందుకంటే ప్రభుత్వం అనుమతించిన నిర్మాణాలకు తీసుకెళ్తున్నట్లు ఆ ముక్కే సాక్ష్యం మరి! కనీసం ఆ లారీ ఎక్కడకు వెళ్తుందని కానీ, ఎంతకు ఇసుక విక్రయిస్తున్నారని కానీ విచారణే ఉండదు.

విశాఖనగరం, అనకాపల్లి, విజయనగరం తదితర ప్రాంతాల్లో లారీలోడు ఇసుక రూ.25 వేల చొప్పున అమ్ముకుంటూ మాఫియా సొమ్ము చేసుకుంటుందనేది బహిరంగ రహస్యమే! ఇంతకీ ఈ స్లిప్‌లు ఇస్తున్నవారెవ్వరంటే టీడీపీ నాయకులు, వారి అనుచరులని అందరూ చెబుతున్న విషయమే. పొన్నాం–బట్టేరులో కూడా అదే తరహా టీడీపీ నాయకుడు అంధవరపు కొండబాబు కుమారుడు అంధవరపు జగన్‌ అనే ఆరోపణలు ఉన్నాయి. 

అక్రమార్కులను వదిలేసి..

పురుషోత్తపురం ర్యాంపులో అక్రమ తవ్వకాలకు పాల్పడిన జేసీబీల యజమానులు, నిర్వాహకులను వదిలేసి లారీల డ్రైవర్లను, క్లీనర్లపై కేసు నమోదు చేసిన వ్యవహారం తెలిసిందే. అదే తరహాలో వంశధార నదీ ప్రాంతమైన పొన్నాం– బట్టేరు వద్ద కూడా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఎనిమిది లారీలను ఆదివారం రాత్రి అధికారుల బృందం పట్టుకుంది.

అలాగే ఇసుక కోసం వచ్చిన మరో ఏడు లారీలను కూడా సీజ్‌ చేశారు. ఎప్పటిలాగే నిర్వాహకులు తప్పించుకున్నారు. లారీల డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.

కాపలాదారులుగా మహిళాఅధికారి..

బట్టేరు ఇసుక ర్యాంపు వద్ద ఇసుక లారీలకు కాపలాగా ఆ క్లస్టర్‌కు ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న ఈవోపీఆర్డీ కె.నిశ్చలకు బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు తేడా వస్తే సస్పెండ్‌ చేస్తామంటూ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో ఆదివారం రాత్రంతా ఆమె ర్యాంపు వద్దే ఉండిపోయారు. దీంతో అనారోగ్యానికి గురై సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. 

కాపాలా బాధ్యత మాకేంటి?

గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో పంచాయతీరాజ్, రెవెన్యూ, వైద్యం తదితర శాఖల అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికి ఇసుక మాఫియా తలనొప్పిగా మారింది.  క్లస్టర్‌ పంచాయతీల పరిధిలో  ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే వారినే బాధ్యులుగా చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 559 మంది ప్రత్యేకాధికారుల్లో సుమారు వంది మంది పరిధిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారాలు నడుస్తున్నాయి.

అయితే ఇసుక అక్రమ నివారణపై విజిలెన్స్‌ బృందంలో సభ్యుడిగా పంచాయతీ కార్యదర్శికి కొంతవరకు మాత్రమే సంబంధం ఉంటుందని, దీనిపై ప్రత్యేక అధికారులకు ఏం సంబంధమంటూ వారు ప్రశ్నిస్తున్నారు. నిశ్చల వ్యవహారంతో ఈ స్పెషలాఫీసర్లు అందరూ ‘ఇసుక కాపలా’ విధులపై విముఖతను వ్యక్తం చేస్తున్నారు. పొన్నాం–బట్టేరు విషయంలో అధికారుల ధోరణిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement