illegal transports
-
అక్రమాల నిగ్గుతేలేనా?
పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గంలో క్వారీలపై అధికారులు దాడులు చేసి విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్రమాలు ఏ మేరకు నిగ్గుతేలుతాయన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. పెనుకొండ ప్రాంతం క్వారీల ఏర్పాటుకు స్వర్గధామం. ఇక్కడ అధికారులు క్వారీ యజమానులకు సాగిలపడి పోటీపడి విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారు. పేదవాడికి ఒక ఎకరా పట్టా ఇవ్వడానికి మనసొప్పని అధికారులు క్వారీలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల ఎకరాలను క్వారీల యజమానులకు ధారాదత్తం చేశారు. అటు రెవెన్యూ అధికారులు భూ అనుమతులిస్తే ఇటు మైనింగ్ అధికారులు పోటీపడి అనుమతులు మంజూరు చేశారు. సోమందేపల్లిలో పెద్దకొండ ప్రాంతంలో కొందరికి భూపట్టాలున్నా రెవెన్యూ అధికారులు వాటిని అప్పటికప్పుడు రద్దు చేస్తూ క్వారీలకు లీజుకు ఇవ్వడం వెనుక దాగి ఉన్న అవినీతిని సూచిస్తోంది. బాధితులు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరిగిన పాపానపోలేదు. పెనుకొండ ప్రాంతం టీడీపీకి కంచుకోట కావడంతో రెండున్నర దశాబ్దాలుగా క్వారీల దందా సాగుతోంది. పరిటాల కుటుంబం, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వారి అనుచరుల కనుసన్నల్లో క్వారీలు ఏర్పాటయ్యాయి. అడిగితే బెదిరింపులు, అడ్డుకుంటే ఇబ్బందులు అన్నచందంగా క్వారీల దందా జరిగింది. నిబంధనలకు పాతర .. క్వారీల ఏర్పాటులో అధికారులు నిబంధనలకు పూర్తీగా పాతరేశారు. చెరువు, మరువ, పొలం అన్న తేడా లేకుండా అనుమతిచ్చారు. సోమందేపల్లి, పాపిరెడ్డిపల్లి చెరువుల పక్కనే క్వారీలు, ఏకంగా చెరువులో రోడ్లు, ఇలా ప్రజా జీవితాలను అతలాకుతలం చేశారు. పాపిరెడ్డిపల్లి వద్ద వేలుపుకొండలో జరుగుతున్న బ్లాస్టింగ్ దెబ్బకు విద్యార్థులు హడలిపోతున్నా పట్టించుకున్న వారు లేరు. వాటిపై విచారణ చేసినా క్వారీల నిర్వాహకులకే ప్రభుత్వం వత్తాసు పలికింది. టీడీపీ నాయకుల రాజకీయ పెత్తనం ముందు ప్రజలు, రైతులు నిస్సహాయులయ్యారు. పనీ మాదే..గనీ మాదే.. ప్రభుత్వం విడుదల చేసే రూ.కోట్ల డబ్బు మాదే అన్న చందంగా టీడీపీ నాయకులు దోపిడీ సాగించారు. రోడ్డు తొలగించాలన్న జేసీ బదిలీ.. సోమందేపల్లి చెరువులో రోడ్డు వేయడం అక్రమమని, రోడ్డు తొలగించాలని అప్పటి జాయింట్ కలెక్టర్ రమామణి ఆదేశిస్తే ఆమెను టీడీపీ నాయకులు రాజకీయ బలంతో రోజుల వ్యవధిలో జిల్లా నుంచి బదిలీ చేశారు. చెరువులో రోడ్డు వేయరాదని అడ్డుకుంటే మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండని పోలీసులను ఉసిగొలిపారు. ఎక్కడ చూసినా టీడీపీ నాయకులు లారీలు క్వారీల నుంచి నిబంధనలను ఉల్లంఘించి కంకర, కంకరపొడితో రయ్‌మని ప్రయాణిస్తుంటే జనం చూసి ఊరుకోవాల్సిందేకాని మాటమాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ప్రజాప్రతినిధే ప్రజలకు ఇబ్బందులు పెడుతుంటే జనం ఎంతో ఆవేదన చెందారు. అక్రమాలు బయట పడుతాయా?... టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన క్వారీల్లో రూ.కోట్ల అవినీతి దాగుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం మారాక అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున దృష్టి సారించడంతో క్వారీలలో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చడానికి అధికారులు సిద్ధమయ్యారు. అసలు క్వారీ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు పొందారు? ఎంత మేరకు తవ్వారు? ఎంత మేర రాయల్టీ చెల్లించాలి? క్వారీలు ఎలాంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ప్రజలు పడుతున్న భాధలేమిటి? నిబంధనలు ఎలా ఉన్నాయి? జరుగుతున్న భాగోతమేమిటి అన్న విషయాలపై మైనింగ్ అధికారులు పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు దర్యాప్తులో ఎలాంటి పొరబాట్లకు తావిచ్చినా చర్యలు తప్పవన్న భావన ప్రజల్లో వినిపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కియా నుంచి కొటక్ వరకు.. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు నుంచి షిమాంకో కొటక్ పరిశ్రమతో పాటు ఇతర హాట్‌మిక్సింగ్ యూనిట్లకు టీడీపీ నాయకుల క్వారీల నుంచే లక్షల టన్నుల కంకర, కంకర పొడి తరలించి వ్యాపార లావాదేవీలు సాగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు సంపాదించిన ఆదాయం ఏ మేరకు ఉంటుందో లెక్కించలేరన్న భావన అటు అధికారులు, ఇటు ప్రజల్లో నెలకొంది. దీంతో పాటు ప్రజల అవసరాలకు, భారీ ఎత్తున నిర్మించిన భవనాలకు సైతం ఈ కంకర మిషన్ల నుంచే సరఫరా కావడంతో అవినీతి అక్రమాలకు హద్దే లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
దర్జాగా స్మగ్లింగ్.!
ఖాజీపేట : ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో అటు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు పూర్తిగా విఫలమవుతూనే ఉన్నారు. నామమాత్రం గా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో స్మగ్లర్లు తమదైన సమాచారంతో ఎప్పటికప్పడు రవాణా మార్గాలు మార్చుకుంటూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఖాజీపేట మండలం, మైదుకూరులోని కొండకు ఆనుకుని ఉన్న చుట్టు పక్కల ప్రాంతాలు ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తి అడ్డగా మారాయి. ఈ విషయం ఇటు ఫారెస్ట్ అధికారులకు స్థానిక పోలీసులకు బాగా తెలుసు. ఎందుకంటే కొండ ప్రాంతం నుంచి జాతీయ రహదారుల పైకి దుంగలను తీసుకు పోయేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అతి తక్కువ సమయంలో అంటే కేవలం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే సురక్షితంగా తీసుకెళ్లవచ్చు. అందుకే స్మగ్లర్లు ఇదే రాచ మార్గంగా ఎంచుకుని అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. పోలీసులు ఫారెస్ట్ అధికారులు ఎన్ని సార్లు దుంగలు పట్టుకున్నా రహదారులు మార్చుతున్నారు తప్ప అక్రమ రవాణా మాత్రం ఆగక పోవడం విశేషం. రూటు మార్చిన తమిళ కూలీలు స్థానిక, బడా స్మగ్లర్లు తమిళ కూలీలను అడ్డుపెట్టుకుని అక్రమ రవాణా చేస్తున్నారన్నది అధికారులందరికి తెలిసిన విషయమే. గతంలో కన్నెల వాగు చెరువు నుంచి వచ్చిన ఎర్రచందనం దుంగలను పంట పొలాల గుండా తీసుకు వచ్చి పొలాల్లో లేక హైవే కల్వర్టుల వద్ద ఉంచి క్షణాల్లో వాహనాల్లోకి ఎక్కించి రవాణా చేసేవారు. అలాగే తమిళ కూలీలు కొత్తనెల్లూరు, చెన్నూరు బ్రిడ్జి వద్ద నుంచి చక్కెర ఫ్యాక్టరీ మీదుగా, కొత్తపేట వద్ద హైవే పై నుంచి అడవుల్లోకి వెళ్లేవారు. తాజాగా వారు రహదారులు పూర్తిగా మార్చేశారు. నాగసానిపల్లె నుంచి అలాగే భూమాయపల్లె సమీపంలోని రహదారులు, కేసీ కాలువ, తెలుగుగంగ రహదారుల గుండా అడవుల్లోకి వెళుతున్నారు.. అలాగే అడవులనుంచి తీసుకు వచ్చిన దుంగలను నాగసానిపల్లె చిలకకనం వద్ద నుంచి చెన్నముక్క పల్లె వరకు ఉన్న తెలుగు గంగ కాలువలో, దాని పై భాగాన ఉన్న అడవి మార్గంలో దాచుతున్నారు. అలా దాచిన దుంగలను వాహనం వచ్చిన వెంటనే వాహనంలోకి లోడ్ చేసి ప్రధాన రహదారి గుండా రాజమార్గంలో రవాణా చేస్తున్నారు. పోలీసులకు దొరికి భారీ డంప్ తెలుగు గంగ కాలువలో గత బుధవారం ఖాజీపేట పోలీసులు జరిపిన కూంబింగ్ లో భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 71 దుంగలు తెలుగు గంగ కాలువలో లభ్యమయ్యాయి. అందులో నలుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అందులో ఇద్దరు స్థానిక స్మగ్లర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే దొరికిన తమిళ కూలీల్లో ఒకరిని ఎలాంటి విచారణ జరపకుండా 26వ తేదీనే కేసు నమోదు చేసి జైలుకు పంపడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇంత పెద్ద మొత్తంలో పోలీసులకు దుంగలు దొరకడం ఇదే ప్రథమం. అలాంటిది తెరవెనుక పాత్రధారుల పై విచారణ ఎందుకు జరపలేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. పండుగలే టార్గెట్ స్మగ్లర్లు పండుగలను టార్గెట్ చేసుకుని రవాణా భారీగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వినాయక చవితి అలాగే తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో పోలీసుల నిఘా పూర్తిగా తగ్గింది. అలాగే కూంబింగ్ కూడా సక్రమంగా లేదు. ఈ సమయాల్లో నే అత్యధికంగా రవాణాకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. స్మగ్లర్ల పాత్రపై దర్యాప్తు ఏదీ.. ఇటీవల నమోదైన కేసులను పరిశీలిస్తే కేవలం తమిళ కూలీలను మాత్రమే అరెస్టు చూపుతున్నారు. దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెబు తున్నారు తప్ప తెర వెనుక ఉన్న స్మగ్లర్లను బయటకు తీయడంలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు విఫలమవుతున్నారు. ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన తమిళకూలీలు ఇక్కడ నుంచి ఇంత దర్జాగా రవాణా చేస్తున్నారంటే తెరవెనుక స్థానికులతోపాటు బడా స్మగ్లర్ల హస్తం ఉందనేది జగమెరిగిన సత్యం. అయితే తమిళ కూలీలకు చేయూతనందిస్తున్న స్థానికులు ఎవరు.. వారికి బడా స్మగ్లర్లతో ఉన్న లింకు ఏమిటి.. ఈ అక్రమ రవాణాలో ఎవ్వరి పాత్ర ఎంత అన్న దాని పై నిఘా పూర్తిగా తగ్గింది. దీంతో దొరికితే జైలుకు వెళ్లేది తమిళ కూలీలే కదా అంటూ స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిఘా పెంచి స్మగ్లర్ల ఆటకట్టించి ఎంతో విలువైన ఎర్రచందనాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఫారెస్ట్ అధికారుల నిఘా ఏమైంది.. అడవుల్లోని ఎర్రచందనం అక్రమరవాణా అరికట్టాల్సిన బాధ్యత పూర్తిగా అటవీ శాఖ అధికారులపై ఉంది. అయితే గత ఏడాది గా నిఘా పూర్తిగా విఫలమైందని స్థానికులు అంటున్నారు. 2017 మార్చి నుంచి మే వరకు జరిగిన దాడుల్లో ఫారెస్ట్ అధికారులు సుమారు 300 మంది తమిళకూలీలను అరెస్టు చేయడంతో పాటు 400 దుంగలను స్వాధీనం చేసుకుని రికార్డు సృష్టించారు. అలాగే పోలీసులు కూడా సుమారు 100 మందికి పైగానే అరెస్ట్ చేశారు. అయితే గత ఏడాది గా పరిశీలిస్తే ఎలాంటి దాడులు లేవు. నామమాత్రంగా దాడులు చేసి తరువాత చేతులు ఎత్తేస్తున్నట్లు సమాచారం. దీంతో తమిళ కూలీలు వందల సంఖ్యలో బ్యాచ్‌లుగా విడిపోయి వివిధ మార్గాల ద్వారా అడవుల్లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. -
అర్ధరాత్రి ముగ్గురు మహిళలు..
ఈ ముగ్గురు మహిళలు ఎవరు? పొన్నాం– బట్టేరు స్పెషలాఫీసరుగా వ్యవహరిస్తున్న ఈవోపీఆర్డీ కె.నిశ్చల (మధ్యలో), ఆమెకు ఇరువైపుల ఒకరు అంగన్వాడీ కార్యకర్త అరవల పద్మజ, మరొకరు ఆశా కార్యకర్త బమ్మిడి సుజాత! సమయం: ఆదివారం అర్ధరాత్రి!ఎక్కడ: శ్రీకాకుళం రూరల్ మండలంలోని పొన్నాం–బట్టేరు ఇసుక ర్యాంపు వద్ద! ఏం పని: ఆర్డీవో, తహసీల్దారు ఆధ్వర్యంలో బృందం పట్టుకున్న ఇసుక అక్రమ రవాణా లారీలకు కాపలా! సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శభాష్! అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిరోడ్డుపై నిర్భయంగా వెళ్లినపుడే నిజమైన స్వతంత్య్రం వచ్చినట్లన్న మహాత్ముడి మాటెలా ఉన్నా.. మన జిల్లాలో మాత్రం దాన్ని రుజువు చేశారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ పట్టుబడిన లారీలకు ముగ్గురు మహిళలను కాపలా పెట్టిన ఘనత మాత్రం మన అధికారులకే దక్కుతుంది! పశ్చిమగోదావరి జిల్లాలో పట్టపగలే ఇసుక అక్ర మ తవ్వకాలను అడ్డుకోవడానికెళ్లిన తహసీల్దారు వనజాక్షికి టీడీపీ నేతల చేతుల్లో జరిగిన అవమానాన్ని మరచిపోయినట్లున్నారు! కోట్ల రూపాయలు రుచిమరిగిన మాఫియా ఇసుక దోపిడీ కోసం ఎంతకైనా తెగిస్తున్న ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న పాలనపై వెల్లువెత్తుతున్న విమర్శలనూ విస్మరించినట్లున్నారు! ఫలితం... ఆ ముగ్గురిలో ఒకరైన పొన్నాం–బట్టేరు స్పెషలాఫీసరు ఈవోపీఆర్డీ కె.నిశ్చల అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు! కొంతమంది గ్రామస్థుల తోడుగా తెల్లవారుజాము వరకూ బిక్కుబిక్కుమంటూనే వారు ముగ్గురూ గడిపినా... ఈ ఘటన ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసే విషయంలో జిల్లా యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరికి అద్దం పట్టింది! కనీసం పురుషోత్తపురం ఘటన తర్వాత కూడా తూతూమంత్రంగానే చర్యలు తప్ప కఠిన శిక్షలు లేకపోవడం వెనుక అధికార పార్టీ నాయకుల అదృశ్య హస్తం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు! అంతా ఇష్టారాజ్యం.. జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదుల్లో ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడట్లేదు. నిత్యం ఇసుక అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు... ఆరు లారీలుగా మాదిరిగా యథేచ్ఛగా సాగుతోంది. విశాఖ నగరంలో నిర్మాణాల అవసరాల ముసుగులో చేస్తున్న దోపిడీ అంతా ఇంతా కాదు! ప్రతి రోజూ చీకటి పడిన తర్వాత వందల లారీలు ఇసుకతో విశాఖ వైపు పరుగు తీస్తున్నాయి. అయి తే అసలు వాటిలో అక్రమమేది? సక్రమమేది? అనేది అధికారులకూ తెలియదు. అలాగే అక్రమ రవాణాను, నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలను ఎవ్వరు నిరోధించాలనేదీ అంతుచిక్కని ప్రశ్నే అవుతోంది. వాస్తవానికి ఇందుకోసమే ప్రత్యేక బృందాలు ఉన్నాయి. వాటిలో మైన్స్ శాఖతో పాటు విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులు సభ్యులు! బృందాల ఏర్పాటు బాగానే ఉన్నా వారి మధ్య సమన్వయలోపమే అసలు సమస్య. ఈ విషయం ఇటీవల సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ర్యాంపు దగ్గరే రుజువైంది. వంశధార వరదను సైతం లెక్కచేయకుండా 25 లారీలు, నాలుగు జేసీబీలతో ఇసుక తవ్వకాలకు దిగిన మాఫియా అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. కాగితం ముక్కే సుదర్శన చక్రం.. ఇసుక అక్రమ రవాణాలో ఓ చిన్న కాగితం ముక్కే సుదర్శన చక్రంలా పనిచేస్తోంది. అన్ని ర్యాంపుల్లో మాదిరిగానే పొన్నాం–బట్టేరు ర్యాంపు నిర్వాహకులు కూడా లారీల యజమానులకు చిన్న కాగితం ముక్క ఇస్తున్నారు. దానిపై ఎన్ఎన్ఈ అనే ముద్రతో పాటు లారీ నంబరు తప్ప మరే వివరాలు ఉండవు. జియోట్యాగింగ్ ఊసే లేదు. ఆ కాగితం ముక్కను చూపిస్తే ఇసుక లారీని చెక్‌పోస్టుల్లో కానీ, పోలీసు, రెవెన్యూ, మైన్స్ అధికారులెవ్వరూ ఆపరు! ఎందుకంటే ప్రభుత్వం అనుమతించిన నిర్మాణాలకు తీసుకెళ్తున్నట్లు ఆ ముక్కే సాక్ష్యం మరి! కనీసం ఆ లారీ ఎక్కడకు వెళ్తుందని కానీ, ఎంతకు ఇసుక విక్రయిస్తున్నారని కానీ విచారణే ఉండదు. విశాఖనగరం, అనకాపల్లి, విజయనగరం తదితర ప్రాంతాల్లో లారీలోడు ఇసుక రూ.25 వేల చొప్పున అమ్ముకుంటూ మాఫియా సొమ్ము చేసుకుంటుందనేది బహిరంగ రహస్యమే! ఇంతకీ ఈ స్లిప్‌లు ఇస్తున్నవారెవ్వరంటే టీడీపీ నాయకులు, వారి అనుచరులని అందరూ చెబుతున్న విషయమే. పొన్నాం–బట్టేరులో కూడా అదే తరహా టీడీపీ నాయకుడు అంధవరపు కొండబాబు కుమారుడు అంధవరపు జగన్ అనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులను వదిలేసి.. పురుషోత్తపురం ర్యాంపులో అక్రమ తవ్వకాలకు పాల్పడిన జేసీబీల యజమానులు, నిర్వాహకులను వదిలేసి లారీల డ్రైవర్లను, క్లీనర్లపై కేసు నమోదు చేసిన వ్యవహారం తెలిసిందే. అదే తరహాలో వంశధార నదీ ప్రాంతమైన పొన్నాం– బట్టేరు వద్ద కూడా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఎనిమిది లారీలను ఆదివారం రాత్రి అధికారుల బృందం పట్టుకుంది. అలాగే ఇసుక కోసం వచ్చిన మరో ఏడు లారీలను కూడా సీజ్ చేశారు. ఎప్పటిలాగే నిర్వాహకులు తప్పించుకున్నారు. లారీల డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. కాపలాదారులుగా మహిళాఅధికారి.. బట్టేరు ఇసుక ర్యాంపు వద్ద ఇసుక లారీలకు కాపలాగా ఆ క్లస్టర్‌కు ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న ఈవోపీఆర్డీ కె.నిశ్చలకు బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు తేడా వస్తే సస్పెండ్ చేస్తామంటూ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో ఆదివారం రాత్రంతా ఆమె ర్యాంపు వద్దే ఉండిపోయారు. దీంతో అనారోగ్యానికి గురై సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కాపాలా బాధ్యత మాకేంటి? గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో పంచాయతీరాజ్, రెవెన్యూ, వైద్యం తదితర శాఖల అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికి ఇసుక మాఫియా తలనొప్పిగా మారింది. క్లస్టర్ పంచాయతీల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే వారినే బాధ్యులుగా చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 559 మంది ప్రత్యేకాధికారుల్లో సుమారు వంది మంది పరిధిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే ఇసుక అక్రమ నివారణపై విజిలెన్స్ బృందంలో సభ్యుడిగా పంచాయతీ కార్యదర్శికి కొంతవరకు మాత్రమే సంబంధం ఉంటుందని, దీనిపై ప్రత్యేక అధికారులకు ఏం సంబంధమంటూ వారు ప్రశ్నిస్తున్నారు. నిశ్చల వ్యవహారంతో ఈ స్పెషలాఫీసర్లు అందరూ ‘ఇసుక కాపలా’ విధులపై విముఖతను వ్యక్తం చేస్తున్నారు. పొన్నాం–బట్టేరు విషయంలో అధికారుల ధోరణిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలిసింది. -
యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
దామరగిద్ద (నారాయణపేట): బియ్యం అక్రమ రవాణ చేపట్టే వారిపై అధికారులు తరచూ కేసులు నమోదు చేస్తున్నా.. అక్ర మ రవాణ ఆగడం లేదు. దొరికితే సరే.. లేదంటే తక్కువ రేటుకు కొన్న బియ్యం వందశాతం లాభంతో పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని గురిమిట్కల్లో ఓ రైస్‌మిల్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సోమవారం మద్దూరు మండలానికి చెందిన దినేష్ అనే ఓ వ్యాపారి మద్దూరులో కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని టాటా ఏస్ వాహనం లో కర్ణాటకకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. అధికారుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సినీఫక్కీలో ఓవర్ స్పీడ్‌లో వెళ్తూ యానాగంది స్టేజీ దగ్గర బోల్తా పడింది. సంఘటనకు సంబంధించి అధికారుల కథనం ప్రకారం.. సినీఫక్కీలో తప్పించే యత్నం.. సోమవారం ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఓ విలేకరి ద్వారా బియ్యం అక్రమంగా తరలిస్తున్న సమాచారం అందుకున్న తహసీల్దార్ బాలాజీ గ్రామంలోని వీఆర్ఏలను పురమాయించారు. దీంతో వారు వెళ్లి వాహనాన్ని అడ్డుకోవడంతో అక్కడే నిలిపారు. డ్రైవర్ బియ్యం ఓనర్ దినేష్‌కు సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకునే లోపు డ్రైవర్‌ను తప్పించి వారు వాహనం నడిపారు. అడ్డుకున్న గ్రామసేవకులపెకి వాహనాన్ని తీసుకెళ్లారు. దీంతో కాశప్ప మరో ఇద్దరు కావలికార్లు కిందపడగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి వచ్చిన ఆర్ఐ కుమారస్వామి, వీఆర్ఓ హన్మంతు, వీఆర్ఏ దుర్గయ్య బియ్యం వాహనాన్ని వెంబడించారు. రెండు కిలోమీటర్లు అతివేగంగా వెళ్లి యానాగుంది స్టేజీ సమీపంలో బోల్తాపడింది. వాహనానికి నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం గమనార్హం. తహసీల్దార్ దామరగిద్ద పోలీసులకు సమాచారం ఇవ్వగా కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని.. కర్ణాటక శివారు కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటకకు చెందిన మోదెల్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ తహసీల్దార్ రిపోర్టు ఆధారంగా దాదాపు 50 సంచుల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి సీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం గ్రామంలో ఉన్న శ్రీనివాస బిన్ని మాడల్ రైస్‌మిల్‌పై రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు చేశారు. ఈసందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ విశ్వనాథం విలేకరులతో మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు బిన్ని మాడల్ రైస్‌మిల్‌ను దాడులు చేపట్టామన్నారు. ఇందులో 4,030 క్వింటాళ్ల బియ్యాన్ని రైస్‌మిల్లులోకి సరఫరా చేశారన్నారు. 4 వేల క్వింటాళ్లు మళ్లీ ప్రభుత్వానికి మిషన్ ఆడించి పంపించినట్లు గుర్తించామన్నారు. 12 వేల క్వింటాళ్ల వడ్లను మిషన్‌లో ఆడించారని, 11 వేల క్వింటాళ్ల లెవీ బియ్యాన్ని తయారు చేశారన్నారు. 43 వేల క్వింటాళ్ల బియ్యం రైస్‌మిల్లులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి చెందిన బియ్యాన్నే తీసుకొచ్చి రైస్ మిల్లులో సన్నగా చేసి మళ్లీ ప్రభుత్వానికే విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మొత్తం మిల్లు తనిఖీ చేయగా 30.50 క్వింటాళ్ల బియ్యం దొరికాయని, వాటిని సీజ్ చేశామన్నారు. ఈ మేరకు రైస్‌మిల్ యజమాని శ్రీనివాస్‌పై 6–ఏ రిపోర్ట్ పెట్టి జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సీఈ యాక్ట్ కింద కేసు నమోదు చేయడానికి అధికారులకు రెఫర్ చేస్తామని, పోలీస్ కేసు సైతం పెడతామన్నారు. దాడుల్లో సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, తహసీల్దార్ కమాల్పాష, సీఐ రాములు, జిల్లా అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి ఎండీ ఫైసల్, ఎస్ఐ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై క్రిమినల్ కేసులు
రావులపాలెం(కొత్తపేట): రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి రవాణా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ టి.రామ్మోహనరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని ఆదివారం రాత్రి రావులపాలెం మండలం రావులపాడు వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల వరకు దీనిపై అధికారులు విచారణ నిర్వహించారు. ఈ లారీలో మొక్కజొన్న తరలిస్తున్నట్టు బిల్లులు పెట్టుకుని రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో డ్రైవర్ రమావత్తు శివనాయక్‌ను అరెస్టు చేసి లారీని సీజ్ చేశారు. ఎంఎస్ఓ టి.సుభాష్, వీఆర్వో రవిశంకర్ సమక్షంలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రామ్మోహనరెడ్డి మాట్లాడుతూ సీజ్ చేసిన 17 టన్నుల బియ్యం విలువ రూ.12.50 లక్షలు ఉంటుందన్నారు. దీనిపై రావులపాలెం పోలీసులకు ఎంఎస్ఓ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. డ్రైవర్‌తోపాటు బియ్యం రవాణా చేయిస్తున్న వ్యక్తిగా డ్రైవర్ చెప్పిన యర్రంశెట్టి సాంబశివరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో విజిలెన్స్ తహసీల్దార్ జి.గోపాలరావు, ఎస్.రామకృష్ణ, రావులపాలెం ఎస్సై సీహెచ్ విద్యాసాగర్, ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తనిఖీ ఉండదు!
మాముళ్లు ఇస్తే అక్రమ రవాణాకు రాజమార్గం చెక్‌పోస్టులు ఉన్నా ప్రయోజనం శూన్యం వ్యవసాయ ఉత్పత్తులు, విలువైన గ్రానైట్ ముడిసరుకును ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ, పన్నులు చెల్లించకుండానే జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను అక్రమార్కులు దాటించేస్తున్నారు. మాముళ్లు ఇస్తే సరుకు ఎలాంటిదైనా... ఎంత పరిమాణంలో ఉన్నా... సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రూ. కోట్లు విలువ చేసే గ్రానైట్ ముడిసరుకుతో పాటు వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న తదితర ధాన్యపు పంటలతో పాటు, ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న చౌక బియ్యం రాష్ట్ర సరిహద్దులను దాటిపోతోంది. కర్ణాటక సరిహద్దున జిల్లా సరిహద్దులో.. రాయదుర్గం వద్ద ఉభయ రాష్ట్రాల మధ్య గతంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ చెక్‌పోస్ట్‌ను రాజకీయ ఒత్తిళ్లతో ఎత్తివేశారు. ప్రస్తుతం ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు అక్రమంగా తరలిపోకుండా ఉండేందుకు అగ్రి చెక్‌పోస్ట్ మాత్రమే ఉంది. ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఈ చెక్‌పోస్ట్‌ను దాటిపోయేందుకు వాహనదారులకు అనుమతులిస్తున్నారు. ఇందుకు గాను అధికారులకు బాహటంగానే మాముళ్లు ముట్టచెబుతుండడం గమనార్హం. సరుకు అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఖజనాకు భారీగా గండిపడుతోంది. బయటపడిన భండారం చెక్‌పోస్ట్‌లో ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదనేందుకు గత ఆగస్ట్ 20న 225 బస్తాల చౌక బియ్యం లోడుతో రాష్ట్ర సరిహద్దు దాటిన లారీయే నిదర్శనం. వాహనం చెక్‌పోస్ట్ వదకు చేరుకోగానే అందులో ఉన్న సరుకు మొక్కజొన్న అని చెప్పగానే రూ. 1,500 తీసుకుని ఎలాంటి తనిఖీ చేపట్టకుండానే అధికారులు చెక్‌పోస్ట్‌ను దాటించారు. అదే లారీని ఓ వ్యక్తి కర్ణాటక సరిహద్దు పైతోట వద్ద అడ్డుకుని భండారాన్ని బట్టబయలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న చెక్‌పోస్ట్ సిబ్బంది హడావుడిగా రసీదు రాసి, తమ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. గత ఆదివారం కర్ణాటకలోని బళ్లారి నుంచి డి.హీరేహాళ్ మీదుగా 330 బస్తాల చౌకబియ్యంతో వెళుతున్న లారీ డ్రైవర్‌తో చెక్‌పోస్ట్ సిబ్బంది మాముళ్ల విషయమై ఘర్షణ పడుతుండగా అటుగా వెళుతున్న ఓ కానిస్టేబుల్ గమనించి, వాహనాన్ని తనిఖీ చేశాడు. అందులో చౌకబియ్యాన్ని గుర్తించిన అతను వెంటనే తన ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బియ్యం ఆంధ్రకు చెందినదే కర్ణాటక నుంచి తరలిస్తున్నట్టుగా చెప్పబడిన ఆ బియ్యం వాస్తవానికి రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్, కణేకల్లు, రాయదుర్గం ప్రాంతాల నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం బియ్యాన్ని బళ్లారి వద్ద ఉన్న ఆంధ్రాళ్లోని గోదాంలో నిల్వచేసి, అక్కడి నుంచి రెండు లారీల్లో ఆదివారం తెల్లవారుజామున తరలించే యత్నం చేశారు. డి.హీరేహాళ్ చెక్‌పోస్టు వద్దకు రాగానే వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది ముందు వచ్చిన వాహనం డ్రైవర్‌తో భారీ మొత్తంలో మామూళ్లు తీసుకుని వదిలేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కొంత ఆలస్యంగా వచ్చిన మరొక లారీని ఆపగా, మామూళ్ల విషయం కుదరకపోవడం, పోలీసులు , ప్రజలు గమనించడంతోనే భండారం బహిర్గతమైనట్లు తెలుస్తోంది. దొరికితే దొంగ, లేదంటే దొర అన్న చందంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.38 కోట్ల లక్ష్యానికిగాను సెప్టెంబర్ మాసాంతానికి కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసి, జిల్లాలోనే అధమ స్థానంలో ఈ చెక్‌పోస్ట్ నిలిచింది. రెవెన్యూ అధికారుల ఉదాసీనత అక్రమంగా తరలిపోతున్న పేదల బియ్యం గురించి రెవెన్యూ అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. గత ఆగస్టు 20న మొలకాల్మూరు చెక్‌పోస్టు వద్ద 225 బస్తాల చౌకబియ్యంతో పట్టుబడిన లారీ ఎవరిది, నిందితులు ఎవరు అనే సమాచారాన్ని బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచారు. 225 బస్తాలు కణేకల్లు స్టాక్ పాయింట్ నుంచి లోడ్ చేసుకుని వచ్చామని పట్టుబడ్డ లారీ యజమాని చెప్పినా చర్యలు మాత్రం శూన్యం. రాజకీయ నేతల ఒత్తిళ్ళ మేరకు ఆ లారీ యజమానిని ఓ రెవెన్యూ ముఖ్య అధికారే జిల్లా అధికారుల వద్దకు తీసుకెళ్లి, కేసును నీరుగార్చినట్లు ఆరోపణలున్నాయి. రెండు నెలల్లో 20 లారీలు సీజ్ గ్రానైట్, స్లాబ్ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు అక్రమంగా తరలిపోకుండా ఉండేందుకు తాడిపత్రి ప్రాంతంలో రెండు నెలల క్రితం నాలుగు చెక్‌పోస్టులను విజిలెన్స్ అధికారులు ఏర్పాటు చేశారు. సిబ్బంది కొరతతో ఇక్కడి చెక్‌పోస్టులలో పోలీస్, గనుల శాఖకు చెందిన సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటున్నారంటూ విజిలెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ చెక్‌పోస్టుల ద్వారా ప్రభుత్వ ఖజనాకు ఎంత మేరకు చేరుతుందో గానీ... అవినీతి అధికారుల బొక్కసాలు మాత్రం నిండిపోతున్నాయి. పెన్నానది పాత వంతెన, కొత్త వంతెన, చుక్కలూరు క్రాస్, భోగసముద్రం వద్ద ఉన్న ఈ చెక్‌పోస్టులలో గనులు, పోలీస్, రవాణ, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు 24 గంటలూ పనిచేస్తూ... సరుకు అక్రమంగా తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ నాలుగు శాఖల అధికారుల ఆమోదం పొందిన తర్వాతనే వాహనాలు చెక్‌పోస్టులు దాటి వెళుతుంటాయి. అక్రమంగా సరుకుతో వెళుతున్న వాహనదారుల నుంచి అపరాధరుసుం వసూలు చేయాల్సిన అధికారులు కాస్తా మాముళ్ల మత్తులో చెక్‌పోస్టు గేట్లను ఎత్తి వేస్తున్నారు. చెక్‌పోస్టులు దాటి వెళ్లిన వాహనాలు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. ఈ రెండు నెలల్లో 20కి పైగా వాహనాలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారంటే జీరో వ్యాపారం ఎంత స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జీరో వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోందన్న విమర్శలు ఉన్నాయి.