
వెంకటేశ్వర ఆలయంలో హుండీని పరిశీలిస్తున్న క్లూస్‌టీం
శ్రీకాకుళం, పాతపట్నం: రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పాతపట్నంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న వెంకటేశ్వర ఆలయం, మంజునాథ ఆలయాల్లో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. ఎస్‌ఐ ఎం.హరికృష్ణ, ఆలయ అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర ఆలయప్రధాన ద్వారం గుండా దొంగలు ప్రవేశించి, ఆలయం ముందు రెండు తాళాలను, ముఖద్వారం వద్ద ఒకటి, హుండి తాళం పగలకొట్టి నగదును చోరీ చేశారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రధాన అర్చకుడు చామర్తి జగన్నాథ ఆచార్యులు వచ్చేసరికి ఆలయ ముఖద్వారం తలుపు తెరిచి ఉండడంతో వెంటనే ఆలయ ఇన్‌చార్జి ఈవో వి.వి.సూర్యనారాయణకు చెప్పారు. ఈవో పోలీసులకు సమాచారం అందించారు.
శ్రీకాకుళం నుంచి క్యూస్‌టీం ఎస్‌ఐ మురళీ, ఎ.ఎస్‌ఐ సుజాత ఆధ్వర్యంలో హుండీని, ఆలయం తలుపులను పరిశీలించారు. మూడు తాళాలను ఇనుప రాడ్‌తో తొలగించినట్లు, ఒక తాళం మిషన్‌తో కట్ చేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. హుండీలోని చిల్లర ఉంచి, నోట్లు మాత్రమే దొంగలు పట్టుకెళ్లారు. 60రోజు క్రింతం హుండీ లెక్కించామని, ప్రస్తుతం మూడు వేలు వరకు ఉండవచ్చని ఈవో చెప్పారు. ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అలాగే ప్రహారాజాపాలెంలోని మంజునాథ ఆలయంలో దొంగలు తాళాలు పగల గొట్టి హుండీ చోరి చేశారని ఆలయ అర్చకుడు సతీష్ చెప్పారు. 70 రోజు ల కిందట హుండీ లెక్కించామని పేర్కొన్నారు.