దొంగల వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌టీం
శ్రీకాకుళం ,కాశీబుగ్గ: ఓ వైపు పెళ్లి వేడుకలో ఎవరికీవారు హడావుడిగా ఉన్నారు. మరోవైపు బీట్ పొలీసులు జాడలేకపోయింది. ఇదే అదనుగా భావించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వస్త్ర దుకాణంలో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీరోడ్డు శ్రీనివాస కూడలి వద్ద శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. సీసీఫుటేజీలో రికార్డయిన వివరాలను, దుకాణంలో వేలిముద్రలను ఆదివారం శ్రీకాకుళం క్లూస్ టీం సేకరించింది. ఇక్కడ తనూ బట్టల దుకాణంతోపాటు, టైలరింగ్ దుకాణాన్ని అన్నదమ్ములు శివ, భాస్కర్ నడుపుతున్నారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి 9:50 గంటలకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయారు. పక్కనే చెప్పుల దుకాణాన్ని సైతం మరో పది సెకన్ల తేడాలో యజమాని మూసివేసి వెళ్లిపోయాడు.
అప్పటికే ఎదురుగా శివరామ కల్యాణ మండపం, లాడ్జీలో వివాహ వేడుక జరుగుతోంది. ఈ సందడిలో ఒక వ్యక్తి సెల్‌ఫోన్లో సంభాషిస్తూ దుకాణం వద్ద కాపలాగా ఉన్నాడు. ఇదేక్రమంలో మరో యువకుడి వచ్చి దుకాణం షట్టర్ తాళం తెరచి లోపలకు చొరబడ్డాడు. అయితే దుకాణం యజమాని భాస్కర్ ఎప్పటిలాగే డబ్బులు దాచుకునే డెస్ తాళాలు అక్కడే విడిచి పెట్టడంతో వీరి పని సులువైంది. డెస్క్‌లో రూ.1.12 లక్షలతోపాటు విలువైన వస్త్రాలు, వస్తువులు చోరీ చేశారు. గోనె సంచిలో వేసుకుని ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి శివరామ లాడ్జీ రోడ్డుకు దాటేశారు. ఇదంతా సీసీ ఫుటేజీలో నమోదైంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం జాగింగ్‌కు వచ్చిన యజమాని దుకాణం షట్టర్ తెరచి ఉండటంతో కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించాడు. కాశీబుగ్గ సీఐ చంద్రశేఖరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం నుంచి క్లూస్‌టీం రాక..
కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు ఆదేశాల మేరకు శ్రీకాకుళం క్లూస్ టీం చేరుకుని దుకాణంలో దొంగల వేలిముద్రలు సేకరించారు. వీరితోపాటు కాశీబుగ్గ డివిజన్ క్రైం స్పాట్ టీం పూర్తిస్థాయి కిట్‌తో అక్కడకు చేరుకుని ఫొటోలు, వీడియోలు తీసి పక్క దుకాణంలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు.
ఉలిక్కిపడ్డ వ్యాపారులు
ఈ చోరీ ఘటనతో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో 300లకుపైగా జీడిపరిశ్రమ యజమానులు, వ్యాపారులు, బంగారు దుకాణదారులు, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చుట్టూ సీసీఫుటేజీలు, బీట్ పోలీసుల సంరక్షణలో పట్టణం ఉన్నప్పటికీ ముఖ్య కూడలి వద్ద కలెక్టరేట్‌తో అనుసంధానమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ చోరీ జరగడంతో ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment