సాక్షి, రాజాం : రాజాం పట్టణంలో సోమవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. దేవాలయాల్లోని హుండీలనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలోని సంతమార్కెట్‌లోని మల్లికార్జునస్వామి ఆలయంలో రెండు హుండీలు, కాకర్లవీధి శివాలయంలోని హుండీ, పుచ్చలవీధి శివారులో ఉన్న వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయ హుండీ, చీపురుపల్లి రోడ్డులోని అభయాంజనేయస్వామి దేవాలయంలోని హుండీని పగులుకొట్టి అందులోని నగదును దోచుకున్నారు.
ఈ ఆలయాలన్నీ దగ్గర, దగ్గరగా ఉండడంతో చోరీలు వెంటవెంటనే జరిగినట్లు పోలుసీలు భావిస్తున్నారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలకు ఏదో అడ్డంపెట్టి ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. అందులోని ఒక కెమెరాలో మాత్రమే ఓ వ్యక్తి చెందిన ఫుటేజీ దొరికింది. ఉదయం యథావిధిగా ఆలయాలకు వెళ్లిన పురోహితులు, ఆలయ సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
ఒకేరోజు నాలుగు ఆలయాల్లో దొంగతనాలు జరిగిన వార్త పట్టణంలో వ్యాపించడంతో సంచలనంగా మారింది. దొంగతనం జరిగిన కాకర్లవీధి శివాలయం, వాసవీకన్యకాపరమేశ్వరి దేవాలయాలు రాజాం పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండడం విశేషం. దొంగతనం జరిగినట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఫుటేజీలో ఉన్నది ఎవరు?
కన్యకాపరమేశ్వరి ఆలయంలో సీసీ కెమెరాకు చిక్కిన నిందితుని ఫొటో ఆధారంగా పోలీసులు కేసును ఛేదించే పనిలో ఉన్నారు. 12.45 గంటల సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు సీసీ ఫుటేజీలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సూర్యకుమారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment