లొంగిపోయిన నిందితుడితో పోలీసు అధికారులు,హత్యకు గురైన తృప్తిమయి పండా
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ఒడిశా విద్యార్థిని తృప్తిమయి పండా హత్య కేసు నిందితుడు మూడేళ్ల తర్వాత సోంపేట పోలీసులకు నేరుగా లొంగిపోయాడు. 2016లో బేసిరామచంద్రాపురం పరిసరాల్లో సంచలనం సృష్టించిన విద్యార్థిని హత్య కేసు మిస్టరీ వీడింది. మూడేళ్లుగా నిందితుడి కోసం దేశంలో ప్రధాన పట్టణాలైన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, పూణే తదితర ప్రాంతాల్లో సోంపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. ఎట్టకేలకు నిందితుడే నేరుగా సోంపేట పోలీసులకు లొంగిపోవడం గమనార్హం.
పెను సంచలమైన కేసు..
సోంపేట సీఐ కె.శ్రీనివాసరావు మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండలంలోని బేసిరామచంద్రాపురం జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని యువతి (23) మృతదేహం 2016 ఆగస్టు 27వ తేదీన లభ్యం అయ్యింది. అప్పట్లో ఈ కేసు పెను సంచలనమైంది. ఒడిశాలోని ఛత్రపురం గ్రామానికి చెందిన బివేకానంద పండా, స్వర్ణమయు పండాల కుమార్తె తృప్తిమయి పండాగా తర్వాత గుర్తించారు.
ఈ హత్య కేసు ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తృప్తిమయి పండా, తన డిగ్రీ క్లాస్‌మేట్ సిక్కల్ కుమార్ బెహరాలు సన్నితంగా మేలిగేవారు. ఒడిశాలోని ఛత్రపురంలో డిగ్రీ పూర్తి చేసుకున్న తృప్తిమయి పండా బరంపురం కల్లికట్ కళాశాలలో ఎం.సీ.ఏ ప్రథమ సంవత్సరంలో చేరింది. స్నేహితురాలు అనురాధతో కలిసి ప్రైవేట్ వసతిగృహంలో ఉండేది.
అనుమానంతోనే హత్య..
సిక్కల్ కుమార్ బెహరాది ఫ్యాక్షన్ కుటుంబం కావటంతో సోదరుడు సుకుడా బెహరాను వ్యతిరేకవర్గం హత్య చేసింది. సిక్కల్ కుమార్ బెహరా వర్గంలోని కొందరు సభ్యులు అవతలి వర్గం వారిని మట్టుపెట్టారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సక్కల్ కుమార్ బెహరా హైదరాబాద్ వెళ్లాడు. ఇంతలో తృప్తిమయి పండా బరంపురంలో ఓ కానిస్టేబుల్‌తో ప్రేమలో పడిందని సుకుమార్ అనుమానించాడు. తనను దూరం పెడుతుందని మానసిక క్షోభకు గురయ్యాడు.
తృప్తిమయి పండా స్నేహితురాలు అనురాధకు ఫోన్ చేసి తాను హైదరాబాద్ నుంచి బరంపురం వస్తున్నానని, తృప్తిమయి పండాను కలవాలనుకుంటున్నానని తెలిపాడు. అనురాధ వీరిద్దరినీ 2016 ఆగస్టు 25న బరంపురంలో కలిపింది. తృప్తిమయి పండాకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై బరంపురం నుంచి బారువ బీచ్‌కు తీసుకువచ్చాడు. ఆగస్టు 26వ తేదీ రాత్రి బారువ నుంచి బరంపురం తిరుగు ప్రయాణం సమయంలో బేసిరామచంద్రాపురం లేఅవుట్ వద్ద కాసేపు ఆగారు. ఇద్దరి మధ్యన తీవ్ర గొడవ జరిగింది.
నిందితుడు తీసుకువచ్చిన కత్తితో తృప్తిమయి పండా గొంతుకోసి, పొట్టపై మూడుసార్లు పొడిచి హత్య చేశాడు. ఆ కత్తిని అక్కడే దాచి పెట్టాడు. అక్కడి నుంచి బరంపురం వెళ్లాడు.తనకు హైదరాబాద్‌లో పని ఉందని ఇంటి వద్ద చెప్పి వెళ్లిపోయాడు. పోలీసులు కేసును అప్పుడే ఛేదించినా నిందితుడు ఆచూకీ లభ్యం కాలేదు. నిందితుడే స్వయంగా పోలీసులకు లొంగిపోయి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ మేరకు నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టుకు (రిమాండ్‌కు) తరలించినట్లు సీఐ తెలిపారు. బారువ ఎస్‌ఐ నారాయణస్వామి, పోలీసు సిబ్బంది సతీస్‌కుమార్, లోకనాథం, మథు, ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment