
తనూజ మృతదేహం ,భర్త దుర్గుబాబుతో తనూజ(ఫైల్)
శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్: ప్రేమ పెళ్లి చేసుకున్న ఏడాదిన్నరకే భార్య ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన సోమవారం చిలకపాలెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని పొండూరు గ్రామానికి చెందిన చాగిశెట్టి దుర్గుబాబు అదే గ్రామానికి చెందిన తనూజ(26)ను ఏడాదిన్నర కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఉల్లిపాయల వ్యాపారం నిమిత్తం చిలకపాలెం వచ్చి అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కొంతకాలం కాపురం సజావుగా సాగిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తనూజను భర్త మానసికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని బాధితురాలు కన్నవారికి చెబుతూ కన్నీటిపర్యంతమయ్యేది.
ఈ క్రమంలోనే భర్త పెట్టే వేధింపులు తీవ్రం కావడంతో సోమవారం ఇంటి వరండాలోని హుక్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు వారు రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే మృతి చెందింది. వెంటనే స్థానికులు ఎచ్చెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు తూర్పుగోదావరి నుంచి సాయంత్రానికి చిలకపాలెం చేరుకున్నారు. మృతురాలి తల్లి నందిపాటి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు దుర్గుబాబుపై కేసు నమోదు చేశారు. ఎస్సై వై.కృష్ణ పర్యవేక్షణలో హెచ్‌సీ వాసుదేవరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. దుర్గుబాబును పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment