
పెళ్లిఫొటో(ఫైల్)
ప్రేమిస్తున్నా అన్నాడు. జీవితాంతం తోడుంటా అని నమ్మించాడు. అతడే సర్వస్వం అనుకున్న యువతి అయినవారందరినీ విడిచి ఏడడుగులు నడిచింది. ఏడాదిలోగా పరిస్థితి తారుమారైంది. జీవితాంతం తోడుంటానని చెప్పిన భర్త.. గర్భిణి అన్న కనికరం లేకుండా ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. అండగా నిలవాల్సిన అత్తమామలు వేధింపులకు గురిచేస్తూ పట్టెడన్నం పెట్టేందుకు కూడా నిరాకరిస్తున్నారు.
ఆమెకు ఆశ్రయం కల్పించి సాయం చేస్తున్న వారిని కూడా దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని విర్రవీగిపోతున్న వీరి ఆగడాలను ఇన్నాళ్లూ మౌనంగా భరిస్తూ వస్తున్న ఆమె.. న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టింది. వేడుకుంటోంది. అండగా నిలిచిన మహిళల సాయంతో కార్యాలయాలను ముట్టడించింది.
బూర్జ : తనకు న్యాయం చేయాలని మండలంలోని అల్లెన గ్రామానికి చెందిన గంటా ధనలక్ష్మి బూర్జ జంక్షన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని బూర్జ వరకు బుధవారం ర్యాలీ నిర్వహించింది. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన తెలిపింది. వెలుగు కార్యాలయం వద్ద విప్ కూన రవికుమార్ పింఛన్లు పంపిణీ చేస్తున్నారని తెలిసి.. అక్కడకు వెళ్లి ఆయన వాహనాన్ని అడ్డుకుంది.
మహిళలు, ప్రజా సంఘాలు కూడా ఆమెకు మద్దతుగా నిలవడంతో వివాదం చోటుచేసుకుంది. అక్కడి నుంచి నేరుగా వెలుగు కార్యాలయంలోకి విప్ వెళ్లిపోయారు. విప్ బయటకు రావాలని అంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన బయటకు రాకపోవడంతో.. భర్త ఆగడాలను వివరించింది. ‘మీ మద్దతే ఉందని నా భర్త హెచ్చరిస్తున్నాడు’ అంటూ నిలదీసింది.
తనకేమీ సంబంధం లేదని, భర్త ఇంట్లో ఉండేలా చేస్తానని విప్ హామీ ఇచ్చారు. తర్వాత సమస్య సీఎం ఆదాంకు తెలపాలని సూచించారు. గతంలో పోలీసులను ఆశ్రయించినా.. ఫలితం లేకపోయిందని విలపించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం..
వివక్ష.. వేధింపులు
గంటా ధనలక్ష్మిది బూర్జ మండలంలోని జీబీపురం. తండ్రి చిన్నారావు రోజువారీ కూలీ. అమ్మ లీలావతితో కలసి ఆమె పలు ఇళ్లలో పనిచేస్తుండేది. జీబీపురం పక్కనే ఉన్న అల్లెన గ్రామానికి చెందిన బొత్స రాంబాబుతో ఆమెకు 2015లో పరిచయమైంది. రాంబాబు తండ్రి సింహాద్రి గ్రామంలో వీఆర్‌ఏగా ఉండేవారు, తల్లి చిన్నమ్మడు టీడీపీ మాజీ ఎంపీటీసీ. పరిచయం స్నేహంగా మారి ప్రేమ చిగురించింది.
2017 ఏప్రిల్ 21న ధనలక్ష్మికి నిశ్చితార్థం చేసేందుకు నిర్ణయించగా.. 20వ తేదీ రాంబాబుతో కలసి ఇంటినుంచి వెళ్లిపోయింది. ఏప్రిల్ 22న ఆమదాలవలస వెంకటేశ్వర ఆలయంలో కొంతమంది పెద్దల సాయంతో వీరు పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించి రసీదును పెద్దలకు అందజేశారు. అనంతరం భర్తతో కలసి గుంటూరు వెళ్లిపోయింది. తర్వాత సంతకవిటి మండలం ఎస్.రంగారాయపురంలోని అక్క ఇంటికి ధనలక్ష్మి, అల్లెనలోని ఇంటికి రాంబాబు వెళ్లిపోయారు.
కొద్ది కాలం తర్వాత ఆమెను కూడా అల్లెనకు తీసుకెళ్లాడు. ఇప్పుడు నాలుగు నెలల నుంచి తనను ఇంట్లోకి రానివ్వకుండా బయట శాలలో పెట్టి, వేరే పళ్లెంలో భోజనం పెడుతూ.. వివక్ష చూపుతున్నారని ధనలక్ష్మి వాపోయింది. ఈ నెల 4వ తేదీన ఆమదాలవలస సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో సీఐ ఆదాం రాంబాబుపై కేసు నమోదుచేశారని వివరించింది.
అప్పటికీ న్యాయం జరగలేదని, కేసు పెట్టిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని కన్నీరుమున్నీరయింది. అత్తమామలతో పాటు వారి బంధువులు వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంది. ఇరుగు పొరుగువారు భోజనాలు పెడుతుంటే వారిని దుర్భాషలాడుతున్నారని, చివరికి రామమందిరం వద్ద తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విలపించింది.
తనకు విప్ కూన రవికుమార్ మద్దతు ఉందని రాంబాబు బెదిరిస్తున్నాడని వాపోయింది. దీంతో న్యాయం పోరాటం చేస్తున్నానని తెలిపింది ఆరు నెలల గర్భిణి అయిన ధనలక్ష్మి న్యాయం కోసం పోరాడుతున్న విషయం తెలుసుకున్న అల్లెన, గంగా భగీరథపురం, ఇతర గ్రామాల మహిళలు అధిక సంఖ్యలో బూర్జ చేరుకుని మద్దతుగా నిలిచారు.
ధనలక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇందులో సిటు మహిళా నాయకులు ఈశ్వరమ్మతోపాటు ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. దీంతో రాంబాబుపై గతంలో నమోదైన కేసులో రాంబాబును బుధవారం అరెస్టు చేస్తున్నట్లు ఎస్సై జనార్దనరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment