భర్త కోసం భార్య మౌన పోరాటం | Wife Protest In Front Of Husband House In Konaseema District | Sakshi
Sakshi News home page

భర్త కోసం భార్య మౌన పోరాటం

Published Mon, Oct 17 2022 10:53 AM | Last Updated on Mon, Oct 17 2022 10:53 AM

Wife Protest In Front Of Husband House In Konaseema District - Sakshi

ద్వారపూడిలో అత్తింటి వారి వద్ద దీక్ష చేస్తున్న శైలజ

మండపేట(కోనసీమ జిల్లా): తన భర్తతో కాపురానికి పంపాలని కోరుతూ వివాహిత పదిరోజులుగా అత్తవారి ఇంటి వద్ద మౌన పోరాటం చేస్తోంది. అత్తమామలు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోవడంతో ఆరుబయట గుమ్మం వద్ద దీక్ష నిర్వహిస్తోంది. మండలంలోని ద్వారపూడికి చెందిన ఉలిసి లక్ష్మీశైలజకు అదే గ్రామానికి చెందిన నామాల రంగారావు తనయుడు మోహన్‌ శ్యాం శరణ్‌తో 2020 డిసెంబర్‌లో వివాహమైంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న శరణ్‌కు వివాహ సమయంలో ఐదు కుంచాల పొలం, ఆడపడుచు కట్నంగా రూ.ఐదు లక్షలు, వివాహ ఖర్చుల నిమిత్తం రూ. ఐదు లక్షలు, 20 కాసుల బంగారం అందజేసినట్టు శైలజ తండ్రి రామకృష్ణ తెలిపారు.
చదవండి: నరబలి కేసు: ఆ 26 మంది మహిళల ‘మిస్సింగ్‌’ వెనుక షఫీ హస్తం?

వివాహం అనంతరం శరణ్‌ జీతం రెట్టింపు కావడంతో తమ కుమార్తెపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. పెళ్లి జరిగి రెండేళ్లు కావస్తుండగా నెల రోజులు కూడా తమ కుమార్తెను అత్తింటి వారి వద్ద ఉంచుకోలేదని, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త వద్దకు పంపకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ పెద్దల ద్వారా వివరించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తన భర్తతో మాట్లాడకుండా తన వద్ద నుంచి ఫోన్‌ తీసేసుకున్నారని శైలజ విలపించింది. తన మానసిక స్థితి సరిగా లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తన భర్తతో కాపురానికి పంపాలని కోరుతూ అత్తవారి ఇంటి వద్ద దీక్ష చేపట్టినట్టు బాధితురాలు వివరించింది. తాను రావడంతో అత్తమామలు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారని లక్ష్మీశైలజ తెలిపింది.

ఈ విషయమై శైలజ మామ నామాల రంగారావును ఫోన్‌లో వివరణ కోరగా శైలజ తల్లిదండ్రులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. శైలజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడతానని పలుమార్లు బెదిరించిందని, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎవరు బాద్యత వహిస్తారన్నారు. రూరల్‌ ఎస్‌ఐ బి. శివకృష్ణను సంప్రదించగా అత్తింటి వారిపై ఫిర్యాదు చేసేందుకు శైలజ నిరాకరించిందన్నారు. ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement