Husband house front
-
కాపురానికి తీసుకెళ్లడం లేదని.. భర్త ఇంటి ఎదుట భార్య నిరసన
మిర్యాలగూడ టౌన్ (నల్గొండ జిల్లా): భర్త ఇంటి ఎదుట భార్య నిరసన వ్యక్తం చేసిన సంఘటన మంగళవారం పట్టణంలోని నందిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని లక్ష్మిపురం గ్రామానికి చెందిన మారోజు రామాచారి, కలమ్మ దంపతుల కుమార్తె మాధవిని మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు గ్రామానికి చెందిన బసవోజు రామ్మూర్తి, తిరుపతమ్మల కుమారుడు సురేష్‌కి ఇచ్చి 2015లో వివాహం చేశారు. వీరి కాపురం కొంతకాలం సాఫీగానే సాగింది. కాగా మాధవి మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు డెంగీ జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా ప్లేట్లేట్స్ తగ్గడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకుని తన తల్లిగారింటికి వెళ్లిన మాధవిని అప్పటి నుంచి భర్త తీసుకెళ్లలేదు. ఈ విషయంపై అనేక సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినప్పటికీ తనకు ఎలాంటి న్యాయం జరగలేదని, చివరికి మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాకపోవడంతో తన ఏడేళ్ల కుమార్తె డింపుల్రాణితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. కాగా సురేష్ తల్లి తిరుపతమ్మ దీనిపై స్పందిస్తూ.. మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మాధవి తన తల్లిగారింటికి వెళ్లి తిరిగి రాలేదని, అనేక సార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీ జరిగిందని అననారు. విడాకుల కోసం ఐదేళ్ల క్రితమే కోర్టులో కేసు వేశామని, ఈ విషయం కోర్టుపరిధిలో ఉన్నందున కోర్టులోనే తెల్చుకుంటామని పేర్కొంది. చదవండి: ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..! -
భర్త కోసం భార్య మౌన పోరాటం
మండపేట(కోనసీమ జిల్లా): తన భర్తతో కాపురానికి పంపాలని కోరుతూ వివాహిత పదిరోజులుగా అత్తవారి ఇంటి వద్ద మౌన పోరాటం చేస్తోంది. అత్తమామలు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోవడంతో ఆరుబయట గుమ్మం వద్ద దీక్ష నిర్వహిస్తోంది. మండలంలోని ద్వారపూడికి చెందిన ఉలిసి లక్ష్మీశైలజకు అదే గ్రామానికి చెందిన నామాల రంగారావు తనయుడు మోహన్ శ్యాం శరణ్‌తో 2020 డిసెంబర్లో వివాహమైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శరణ్‌కు వివాహ సమయంలో ఐదు కుంచాల పొలం, ఆడపడుచు కట్నంగా రూ.ఐదు లక్షలు, వివాహ ఖర్చుల నిమిత్తం రూ. ఐదు లక్షలు, 20 కాసుల బంగారం అందజేసినట్టు శైలజ తండ్రి రామకృష్ణ తెలిపారు. చదవండి: నరబలి కేసు: ఆ 26 మంది మహిళల ‘మిస్సింగ్’ వెనుక షఫీ హస్తం? వివాహం అనంతరం శరణ్ జీతం రెట్టింపు కావడంతో తమ కుమార్తెపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. పెళ్లి జరిగి రెండేళ్లు కావస్తుండగా నెల రోజులు కూడా తమ కుమార్తెను అత్తింటి వారి వద్ద ఉంచుకోలేదని, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త వద్దకు పంపకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ పెద్దల ద్వారా వివరించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తతో మాట్లాడకుండా తన వద్ద నుంచి ఫోన్ తీసేసుకున్నారని శైలజ విలపించింది. తన మానసిక స్థితి సరిగా లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తన భర్తతో కాపురానికి పంపాలని కోరుతూ అత్తవారి ఇంటి వద్ద దీక్ష చేపట్టినట్టు బాధితురాలు వివరించింది. తాను రావడంతో అత్తమామలు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారని లక్ష్మీశైలజ తెలిపింది. ఈ విషయమై శైలజ మామ నామాల రంగారావును ఫోన్లో వివరణ కోరగా శైలజ తల్లిదండ్రులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. శైలజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడతానని పలుమార్లు బెదిరించిందని, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎవరు బాద్యత వహిస్తారన్నారు. రూరల్ ఎస్ఐ బి. శివకృష్ణను సంప్రదించగా అత్తింటి వారిపై ఫిర్యాదు చేసేందుకు శైలజ నిరాకరించిందన్నారు. ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. -
రెండేళ్లు కాపురం చేసి... భార్య గర్భవతి అయ్యాక వదిలేసిన భర్త..
ఒడిశా: ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకొని రెండేళ్లు కాపురం చేసిన అనంతరం తనను వంచించారని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు బాధితురాలు కె.దీపికా కొడుకుతో సహా తనను విడిచి పెట్టిన భర్త దినేష్ ఇంటి ఎదుట గత 5 రోజులుగా న్యాయం పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భరంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ 2020లో బరంపురం లోని దేశీబెహరా వీధికి చెందిన దినేష్ తను ప్రేమించి, వివాహం చేసుకున్నాడని తెలిపారు. రెండేళ్లు కాపురం చేసి, గర్భం దాల్చన అనంతరం విడిచి పెట్టినట్లు వాపోయారు. అప్పటి నుంచి లంజిపల్లిలోని తల్లితండ్రుల వద్ద తల దాచుకుంటూ కొడుకుకి జన్మనిచ్చాన్నారు. ప్రస్తుతం తన కుమారుడికి ఏడాది కావస్తోందని, భర్త మాత్రం మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దినేష్ ఇంటి వద్దకు చేరుకొని, తనకు న్యాయం చేయల్సిందిగా కొడుకుతో సహా పగలు, రాత్రి నిరీక్షిస్తున్నట్లు వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తల్లీ, బిడ్డకు రక్షణకు సిబ్బందిని నియమించారు. -
Hyderabad: పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్యకు చెబితే..
సాక్షి, హైదరాబాద్: వనస్థలీపురంలోని సాహెబ్‌నగర్‌లో ఓ భార్య భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఫరూక్ అలీ అనే వ్యక్తి తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఏడాదిన్నర క్రితం తనను మతాంతర వివాహం చేసుకున్నాడని బాధితురాలు దుర్గ ఆరోపిస్తోంది. మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి ప్రేమ పేరుతో మోసం చేసి బంగారం తీసుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ విషయమై మొదటి భార్యకు చెబితే ఫరూక్‌ను ఇంట్లో బంధించి.. తనను తీవ్రంగా కొట్టినట్లు చెబుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మహిళా సంఘాలతో భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగానని బాధితురాలు తెలిపింది. అయితే తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని తన భర్త ఫరూక్ అలీతో ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. -
పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి..
శ్రీకాకుళం: పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి.. ఎక్కడో హైదరాబాద్‌లో కొత్త కాపురం.. ఏడాది తిరిగే సరికి వివాదం.. చివరకు ఆ మహిళ భర్తను వెతుక్కుంటూ అత్తవారింటి ముందు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ రెల్లివీధిలో ఓ యువతి ఆదివారం అత్తవారి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. వివరాల్లోకి వెళితే.. కాశీబుగ్గ పాతజాతీయ రహదారిలో రెల్లివీధికి చెందిన భాను నాయక్‌కు రోటరీనగర్‌కు చెందిన సనపల మురళీకృష్ణతో ఏడాది కిందట వి వాహమైంది. దంపతులు హైదరాబాద్‌లో కా పురం ఉంటున్నారు. అయితే హఠాత్తుగా మురళీకృష్ణ ఆమెను విడిచిపెట్టి వచ్చేయడంతో భా ను న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించారు. పన్నెండేళ్ల కిందటి నుంచి తా ను మురళీకృష్ణ ప్రేమించుకున్నామని, 2021 లో పెళ్లి చేసుకోవాలని కోరితే ఆయన ఒప్పు కోకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని, డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, సీఐ శంకరరావు సమక్షంలో గత ఏడాది జనవరి 5న దండలు మార్చుకుని వివాహం చేసుకున్నామని తెలిపారు. పోలీసులు కౌన్సిలింగ్ మేరకు హైదరాబాద్‌లో ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నా మని చెప్పారు. అయితే ఆ ఇంటికి తాళం వేసి చెప్పా పెట్టకుండా మురళీకృష్ణ కాశీబుగ్గ వచ్చేశాడని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరా రు. ఇన్నాళ్లుగా తనకు మాయ మాటలు చెప్పి మభ్య పెడుతూనే ఉన్నారని, న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆమె తెలిపారు. భర్త ఇంటి ముందు బైఠాయించడంతో కాశీబుగ్గ పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు రక్షణ కల్పించారు. -
సాఫ్ట్వేర్ యువతితో ప్రేమ, పెళ్లి.. మరో మహిళ పరిచయం కావడంతో..
మంగళగిరి (గుంటూరు జిల్లా): ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించానంటూ మూడు ఏళ్లు వెంట పడి కులాలు వేరైనా తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం తనను వదిలించుకోవాలని తల్లి, పిన్ని మాటలు వింటూ తనకు అన్యాయం చేస్తున్నాడంటూ ఓ వివాహిత నగరంలోని యర్రబాలెంలో భర్త నివాసం ముందు కూర్చుని ఆందోళన చేసింది. బాధితురాలు అనూష తెలిపిన వివరాల మేరకు అనూషది విశాఖపట్నం కాగా హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో చేస్తున్న యర్రబాలెంకు చెందిన శ్రీమాన్ అనూషతో పరిచయం పెంచుకుని ప్రేమించానంటూ వెంటబడ్డాడు. చదవండి👉: ఇష్టం లేనిపెళ్లి.. నిశ్చితార్థం విషయం తెలిసి యువతి ఏం చేసిందంటే? సుమారు మూడు సంవత్సరాల పాటు ప్రేమిస్తున్నానని వెంటపడ్డ శ్రీమాన్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వివాహం చేసుకుంటానని చెప్పి అనూషను వివాహం చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. అనంతరం అనూష ఉద్యోగం గ్యారంటీగా చూపి సుమారు రూ.50 లక్షల రుణం తీసుకున్నాడు. శ్రీమాన్‌కు మరో మహిళ పరిచయం కావడం, శ్రీమాన్ తల్లి, బంధువులు సైతం అనూషను వదిలేయాలని చెప్పడంతో అనూషతో ప్రతి రోజు గొడవలు పెట్టుకుని పిల్లలు తనకు పుట్టలేదని అనుమానంతో అనూషను వేధించసాగాడు. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు దీంతో అనూష హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసి తన భర్తకు కౌన్సెలింగ్ నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న శ్రీమాన్ యర్రబాలెం తిరిగి వచ్చి తల్లివద్ద ఉంటున్నాడు. హైదరాబాద్ పోలీసులు శనివారం స్థానిక పోలీసుల సహాయంతో నోటీసులు ఇచ్చేందుకు శ్రీమాన్ ఇంటికి వెళ్లగా శ్రీమాన్‌తో పాటు అతని కుటుంబసభ్యులు నోటీసులు తీసుకునేందుకు ముందుకు రాలేదు. నోటీసులు తీసుకోకపోవడంతో కోర్టు సమన్లతో శ్రీమాన్‌ను అదుపులోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తనకు న్యాయం చేసి తన భర్తను తనకు అప్పగించేవరకు తాను ఆందోళన కొనసాగిస్తానని అనూష తెలిపారు. -
పెళ్లైన మూడు రోజులకే..
చిత్తూరు (మదనపల్లె టౌన్) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని భార్య మహ్మద్‌సనా(23) బుధవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఆమె గురువారం మదనపల్లె రూరల్ మండలం, దిగువ వాండ్లపల్లెలోని భర్త రమేష్‌కుమార్ ఇంటి ఎదుట నిరసనకు దిగింది. ఆమె మాట్లాడుతూ తనది నల్గొండ జిల్లా, చింతలపల్లె మండలం, కుడిమేకు గ్రామమని.. 2019లో అక్కడ ఈసెట్‌లో శిక్షణ తీసుకుంటుండగా రమేష్‌కుమార్‌తో పరిచమైందని వెల్లడించింది. జనవరి 4న మదనపల్లెలోని ఓ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది. రమేష్‌కుమార్, మహ్మద్‌సనా పెళ్లినాటి ఫొటో(ఫైల్) మరుసటి రోజు నుంచి అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయని వాపోయింది. ఇటీవల మదనపల్లెలోని ఎస్టేట్‌లో అద్దె ఇంటికి వెళ్లామని వెల్లడించింది. మూడు రోజుల క్రితం రమేష్ బయటకు వెళ్లి వస్తానని తిరిగి ఇంటికి రాలేదని తెలిపింది. అత్తింటి వారే తన భర్తను దాచిపెట్టారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తింటివారు, ఒక పార్టీ నాయకుడు కలిసి తన భర్తను వదిలి వెళ్లిపోవాలని బెదిరించారని వెల్లడించింది. కాగా రమేష్ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనా కుటుంబీకులే రమేష్‌ను అదృశ్యం చేశారని ఆరోపించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తారింటి వద్ద నిరసన తెలుపుతున్న మహ్మద్ సనా -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ముఖం చాటేశాడు..
మానకొండూర్(కరీంనగర జిల్లా): న్యాయం చేయాలని ఓ భార్య భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన కవిత, మానకొండూర్‌కు చెందిన శ్రీనివాస్ కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి పాప సంతానం. కరీంనగర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. చదవండి: నిజామాబాద్‌లో గుట్టుగా వ్యభిచారం.. 11 మంది అరెస్ట్ కొద్ది రోజుల నుంచి శ్రీనివాస్ ఇంటికి వెళ్లడం లేదు. దీంతో కవిత మానకొండూర్‌లోని శ్రీనివాస్ ఇంటి ఎదుట శనివారం బైఠాయించింది. తనకు, కూతురుకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టింది. విషయం తెలుసుకున్న సీఐ కృష్ణారెడ్డి సదరు భార్యాభర్తలను పోలీస్‌స్టేషన్‌కు పిలుపించుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. కలిసి ఉండాలని చెప్పి స్టేషన్ నుంచి పంపించారు. -
ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన అత్త.. భర్త కోసం భార్య పోరాటం
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): కట్నం ఇవ్వడం ఆలస్యమైందని తన భర్తతో కాపురం చేయనివ్వకుండా అత్తింటి వారు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఒక వివాహిత అత్తింటి ముందు ధర్నాకు దిగింది. తన భర్త విడాకుల నోటీసు పంపాడని, తనకు భర్త కావాలని డిమాండ్ చేస్తోంది. ఆమె కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన దాసరి ప్రేమస్వరూపకు పట్టణ ఐతానగర్ జయప్రకాష్‌నగర్‌కు చెందిన తోటకూర పవన్‌తో 2014లో వివాహమైంది. వివాహం సందర్భంగా రూ.5 లక్షలు కట్నం ఇస్తామని ప్రేమస్వరూప పుట్టింటి వారు అంగీకరించారు. చదవండి: ఉమెన్స్ బ్యూటీ పార్లర్.. ఆమె డాబూ దర్పం చూసి.. చివరికి లబోదిబో.. పెళ్లి అయినా కట్నం డబ్బులు ఇవ్వకపోవడంతో కేవలం ఆరు నెలలకే పుట్టింటికి పంపారని, అప్పటి నుంచి తన భర్తతో కాపురం చేయనీయకుండ అత్త, మామ, ఆడపడుచు అడ్డుకుంటున్నారని ప్రేమస్వరూప ఆరోపించింది. తన భర్త నుంచి విడాకుల నోటీసు రావడంతో, తాము కట్నం డబ్బులు ఇవ్వడానికి శనివారం సాయంత్రం రాగా, తన అత్త ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని, భర్తతో కలసి ఉండేలా చూడాలని ప్రాధేయపడుతోంది. సమాచారమందుకున్న టూ టౌన్ పోలీసులు పవన్ ఇంటికి వచ్చి బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు తన కుటుంబసభ్యులు, బంధువులతో కలసి పవన్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. అయితే ప్రేమస్వరూప గతంలో ఆమె అత్తింటి వారిపై 498ఏ కేసు పెట్టిందని, ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్నాయని, బాధితురాలు, ఆమె తరఫు వారితో మాట్లాడుతున్నామని సీఐ బి.కోటేశ్వరరావు తెలిపారు. -
నా భర్త నాకు కావాలి.. భార్య నిరసన...
గోపాలపట్నం: తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరశన చేపట్టిన ఘటన గురువారం కోటనరవలో సంచలనం రేపింది. బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం మల్కాపురానికి చెందిన లావణ్యకు కోటనరవకు చెందిన దొడ్డి త్రినాథ్‌తో 2017లో వివాహం జరిగింది. వీరి కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది. ఆ తర్వాత ఆడపడుచులు, అత్త, ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువ కావడంతో స్థానిక పెద్దల సమక్షంలో గొడవలు సద్దుమనిగేలా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం లావణ్యకు త్రినాథ్ విడాకుల నోటీసు పంపించాడు. మరో పెళ్లి చేసుకునేందుకే విడాకుల నోటీసులు పంపించారని, తనకు భర్త కావాలని ఆమె వేడుకుంటోంది. తనకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదని, తన భర్త తనకు కావాలని వేడుకొంటోంది. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఆందోళన చేపట్టిన మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
వివాహితను పెళ్లి చేసుకుని.. మరో పెళ్లికి సిద్ధం..!!
పరకాల: భర్త నుంచి విడాకులు తీసుకున్న తనకు తోడుంటానని వెంటాడి ప్రేమించి పెళ్లి చేసుకొని..కూతురు పుట్టాక మరోపెళ్లికి సిద్ధపడుతున్నాడంటూ ఓ మహిళ తనను మోసం చేసిన వ్యక్తి ఇంటి ఎదుట బైఠాయించిన సంఘటన పరకాల పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని బాధితురాలిని పరకాల పోలీసుస్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితురాలి కథనం ప్రకారం... పరకాల పట్టణంలోని మల్లారెడ్డిపల్లె కాలనీకి చెందిన రాయబారపు నితీష్ సికింద్రాబాద్‌లో ప్రైవేటు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబ గొడవలతో భర్త నుంచి విడాకులు తీసుకున్న చర్లపల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన హసీనాతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి తనకు తన వెంటపడుతుండగా మొదట నిరాకరించిన హసీనా నాలుగేళ్ల క్రితం ఒప్పుకుంది. పిల్లలు వద్దంటూ పుట్టిన కూతురును విక్రయించే ప్రయత్నం నితీష్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 2018 నవంబర్ 23న హసీనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరింత కోపం పెంచుకున్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడితో మరోపెళ్లికి సిద్ధపడుతూ తనకు అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నాడంటూ శనివారం మధ్యాహ్నం నితీష్ ఇంటి ఎదుట బైఠాయించింది. బాధితురాలి ఆందోళనపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని చట్టపరంగా వెళితే న్యాయం జరుగుతుంది తప్పా ఆందోళనతో సమస్య పరిష్కారం కాదంటూ నచ్చజెప్పి పంపారు. తనకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని బాధితురాలు హసీనా తెలిపింది. యువకుడి తల్లిదండ్రులు రూ.2లక్షల ఇస్తాం తమ కొడుకు నుంచి దూరంగానే ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కోంది. పెళ్లి చేసుకున్న ఆధారాలను మాయం చేసి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నాడని..నితీష్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపించింది. -
భర్త ఇంటి ముందు భార్య ధర్నా
జలదంకి: భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు భార్య తన పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది. ఈ ఘటన మండలంలోని గట్టుపల్లిలో శనివారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. గట్టుపల్లికి చెందిన సయ్యద్ అల్లాభక్షుకు కావలి తుఫాన్‌నగర్‌కు చెందిన సభానాతో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో సభానా కావలిలోని పుట్టింటికి పిల్లలతో సహా వెళ్లిపోయింది. అనంతరం భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే రెండేళ్ల క్రితం అల్లాభక్షు ఆత్మకూరుకు చెందిన తస్మితను పెళ్లి చేసుకుని గట్టుపల్లిలో ఉంటున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సభానా తన ఇద్దరి పిల్లలతో కలిసి శనివారం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. దీంతో రెండో భార్య తస్మితను అల్లాభక్షు తండ్రి ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. అల్లాభక్షు మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోలేదని, తనకు అనారోగ్య సమస్య ఉందని, దీంతో తనకు తోడుగా ఉంటుందని తస్మితతో సహజీవనం చేస్తున్నట్లు చెబుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
అనుమంచిపల్లి(జగ్గయ్యపేట): తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన చేసిన ఘటన గ్రామంలో ఆదివారం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన బి.పుష్పంకుమార్ తెలంగాణలో పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. 15 ఏళ్ల కిందట ఖమ్మంకు చెందిన విజయలక్ష్మీతో వివాహమైంది. వీరికి సంతానం కలగకపోవడంతో ఓ ఆడపిల్లను దత్తత తీసుకొని పెంచుకొంటున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో వేర్వేరుగా జీవనం సాగించటంతో పాటు విడాకులు తీసుకొనేందుకు కోర్టుకు వెళ్లారు. కేసు కోర్టులో ఉండగా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడని, న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్యాభర్తల బంధువుల మధ్య వాగ్వాదం జరగటంతో విజయలక్ష్మీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
భర్త ఇంటి ముందు...భార్య మౌన పోరాటం
♦ గిరిజన మహిళకు మద్దతుగా మహిళ సంఘాలు ♦ తలుపులు వేసి పరారైన అత్తింటి వారు... ♦ చర్చించిన ఎస్ఐ ♦ కాపురానికి తీసుకెళ్లే వరకు ఆందోళన కొనసాగిస్తా... శృంగవరపుకోట రూరల్: తనను కులాంతర వివాహం చేసుకున్న భర్త కాపురానికి తీసుకువెళ్లాలని గిరిజన మహిళ కాకి సుదీప(20) భర్త ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. తనకు మద్దతుగా వచ్చిన కరకవానిజోరు, రాయవానిపాలెం, అడ్డతీగ, డెప్పూరు తదితర గిరిజన గ్రామాలకు చెందిన మహిళా మండలి సభ్యులు, తల్లి దేముడమ్మతో కలిసి జరిగిన అన్యాయాన్ని విలేకరులకు వెల్లడించింది. రాయవానిపాలెం గ్రామానికి చెందిన తనను ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు గౌరీపురం గ్రామానికి చెందిన చల్లా శంకరరావు ప్రేమించాడని తెలిపింది. ఏడాది పాటు ప్రేమించుకున్న తాము పెద్దల అంగీకారంతోనే గత ఏడాది మార్చి 5వ తేదీన రాయవానిపాలెం చర్చిలో, 6న ఎస్.కోట దారగంగమ్మ ఆలయంలో తమ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని పేర్కొంది. అదే నెల 7న స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోగా ఇక్కడకు తమ అత్తమామలు హాజరు కాలేదని సుదీప చెప్పింది. అనంతరం హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న తన భర్త శంకరరావు అక్కడకు తీసుకువెళ్లి ఒక హాస్టల్లో ఉంచాడని, అక్కడకు వస్తూపోతూ...తనుంటున్న గదికి కూడా తీసుకువెళ్లేవాడని చెప్పింది. దీనిపై ప్రశ్నించగా నా ఇష్టం అంటూ...తానేమి చేసినా అడ్డు చెప్పనంటూ లేఖ రాసి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. దీన్ని తాను వ్యతిరేకించడంతో వేధింపులు ప్రారంభించాడని ఆరోపించింది. నిద్రమాత్రలు మింగా.. నా భర్త శంకరరావు పెట్టే వేధింపులు భరించలేక..మా అమ్మకు విషయాలు చెప్పలేక తీవ్ర మనోవేదనతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించానని, చుట్టు పక్కల వారు ఆసుపత్రికి తీసుకువెళ్లి బతికించారని సుదీప చెప్పింది. దీనిపై తన భర్త ఈ పనేదో మీ కన్నవారింటి దగ్గర చేయాలని వేధించాడని తెలిపింది. హైదరాబాద్‌లో ఉండగా తనకు అబార్షన్ మాత్రలు కూడా వేయించాడని చెప్పింది. విషయం నా తల్లికి తెలిసి పెద్ద మనుషుల సమక్షంలో విషయం పెట్టారని హాస్టల్లోనే ఉంచాలని సూచించడంతో అక్కడే ఉన్నానని పేర్కొంది. తరువాత వేధింపులు భరించలేక విశాఖలోని అక్క దగ్గరకు వచ్చి ఉన్నానని డబ్బులు కావాలంటే చిరాకు పడేవాడని రోదిస్తూ చెప్పింది. అత్తవారింటికి గౌరీపురం వెళ్తానంటే చంపుతానని బెదిరించేవాడని, దీంతో కన్నవారింటికి వచ్చేశానని తెలిపింది. కాపురానికి తీసుకెళ్లే వరకు పోరాటం.. తనను కాపురానికి తీసుకెళ్లే వరకు పోరాడతానంటూ సుదీప అత్తింటి ముందు మౌన పోరాటానికి కూర్చోవటం, ఆమెకు మద్దతుగా మహిళా మండలి సభ్యులు, తల్లి దేముడమ్మ గౌరీపురం చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారమందుకున్న ఎస్.ఐ ఎ.నరేష్, పోలీసు సిబ్బంది గౌరీపురం చేరుకుని మహిళలతో చర్చించారు. ఎస్.ఐ నరేష్ సూచన మేరకు మౌన పోరాటానికి దిగిన గిరిజన మహిళ సుదీప, ఆమె తల్లి దేముడమ్మ, మహిళా మండలి సభ్యులు పోలీసు స్టేషన్‌కు తరలివెళ్లారు. -
భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం
సరుబుజ్జిలి : మరో మహిళతో తన భర్త కాపురం చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా భర్త ఇంటి ఎదుటే మౌన పోరాటానికి దిగింది. దీనికి రొట్టవలస గ్రామం వేదికైంది. బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం వీరఘట్టం గ్రామానికి చెందిన శీరాపు నాగభూషణరావు, శ్రీదేవిల ఏకైక కుమార్తె మాధురిని రొట్టవలస గ్రామానికి చెందిన కొన్న రామ్మూర్తి, మీనాక్షి దంపతుల రెండో కుమారుడు వసంతకుమార్‌కు ఇచ్చి 2014 ఆగస్టు 14వ తేదీన వివాహం జరిపించారు. వసంతకుమార్ గ్రామంలో ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో పదకొండున్నర లక్షల రూపాయలను వసంతకుమార్‌కు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. పెళ్లయిన రెండు నెలల తరువాత మాధురి, వసంతకుమార్ దంపతులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో అక్కడ నుంచి మాధురి కన్నవారికి ఎటువంటి ఫోన్‌గాని, ఇతర సమాచారం రాలేదు. అదే ఏడాది డిసెంబర్ రెండో తేదీన తమ కుమార్తె మాధురితో ఫోన్ చేయించి అంతా బాగానే ఉన్నామని చెప్పమన్నాడని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఇదే క్రమంలో కోటబొమ్మాళి మండలం సాలిపేట గ్రామానికి చెందిన ఓ వివాహితను కూడా తమ అల్లుడు వసంతకుమార్ హైదరాబాద్ రప్పించుకుని ఆమెతో కాపురం చేస్తున్నాడని, అప్పటి నుంచి తమ కుమార్తెను పట్టించుకోవడం మానేశాడని మాధురి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయమై ఎన్నిసార్లు తమ అల్లుడిని ప్రశ్నించినా స్పందించలేదన్నారు. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టినా పట్టించుకోకపోవడంతో మాధురి కొద్ది నెలలుగా కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ మాధురి, ఆమె తల్లిదండ్రులు వసంతకుమార్ ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని మాధురి భర్త వసంతకుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తన భార్య సక్రమంగా తనపట్ల ఉండక పోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. వేరొక అమ్మాయితో అకారణంగా కొంతమంది తనను ఇరికించినట్టు చెప్పారు.