భర్త ఇంటి ముందు...భార్య మౌన పోరాటం
♦ గిరిజన మహిళకు మద్దతుగా మహిళ సంఘాలు
♦ తలుపులు వేసి పరారైన అత్తింటి వారు...
♦ చర్చించిన ఎస్‌ఐ
♦ కాపురానికి తీసుకెళ్లే వరకు ఆందోళన కొనసాగిస్తా...
శృంగవరపుకోట రూరల్: తనను కులాంతర వివాహం చేసుకున్న భర్త కాపురానికి తీసుకువెళ్లాలని గిరిజన మహిళ కాకి సుదీప(20) భర్త ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. తనకు మద్దతుగా వచ్చిన కరకవానిజోరు, రాయవానిపాలెం, అడ్డతీగ, డెప్పూరు తదితర గిరిజన గ్రామాలకు చెందిన మహిళా మండలి సభ్యులు, తల్లి దేముడమ్మతో కలిసి జరిగిన అన్యాయాన్ని విలేకరులకు వెల్లడించింది. రాయవానిపాలెం గ్రామానికి చెందిన తనను ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు గౌరీపురం గ్రామానికి చెందిన చల్లా శంకరరావు ప్రేమించాడని తెలిపింది.
ఏడాది పాటు ప్రేమించుకున్న తాము పెద్దల అంగీకారంతోనే గత ఏడాది మార్చి 5వ తేదీన రాయవానిపాలెం చర్చిలో, 6న ఎస్.కోట దారగంగమ్మ ఆలయంలో తమ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని పేర్కొంది. అదే నెల 7న స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోగా ఇక్కడకు తమ అత్తమామలు హాజరు కాలేదని సుదీప చెప్పింది. అనంతరం హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న తన భర్త శంకరరావు అక్కడకు తీసుకువెళ్లి ఒక హాస్టల్‌లో ఉంచాడని, అక్కడకు వస్తూపోతూ...తనుంటున్న గదికి కూడా తీసుకువెళ్లేవాడని చెప్పింది. దీనిపై ప్రశ్నించగా నా ఇష్టం అంటూ...తానేమి చేసినా అడ్డు చెప్పనంటూ లేఖ రాసి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. దీన్ని తాను వ్యతిరేకించడంతో వేధింపులు ప్రారంభించాడని ఆరోపించింది.
నిద్రమాత్రలు మింగా..
నా భర్త శంకరరావు పెట్టే వేధింపులు భరించలేక..మా అమ్మకు విషయాలు చెప్పలేక తీవ్ర మనోవేదనతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించానని, చుట్టు పక్కల వారు ఆసుపత్రికి తీసుకువెళ్లి బతికించారని సుదీప చెప్పింది. దీనిపై తన భర్త ఈ పనేదో మీ కన్నవారింటి దగ్గర చేయాలని వేధించాడని తెలిపింది. హైదరాబాద్‌లో ఉండగా తనకు అబార్షన్ మాత్రలు కూడా వేయించాడని చెప్పింది.
విషయం నా తల్లికి తెలిసి పెద్ద మనుషుల సమక్షంలో విషయం పెట్టారని హాస్టల్‌లోనే ఉంచాలని సూచించడంతో అక్కడే ఉన్నానని పేర్కొంది. తరువాత వేధింపులు భరించలేక విశాఖలోని అక్క దగ్గరకు వచ్చి ఉన్నానని డబ్బులు కావాలంటే చిరాకు పడేవాడని రోదిస్తూ చెప్పింది. అత్తవారింటికి గౌరీపురం వెళ్తానంటే చంపుతానని బెదిరించేవాడని, దీంతో కన్నవారింటికి వచ్చేశానని తెలిపింది.
కాపురానికి తీసుకెళ్లే వరకు పోరాటం..
తనను కాపురానికి తీసుకెళ్లే వరకు పోరాడతానంటూ సుదీప అత్తింటి ముందు మౌన పోరాటానికి కూర్చోవటం, ఆమెకు మద్దతుగా మహిళా మండలి సభ్యులు, తల్లి దేముడమ్మ గౌరీపురం చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారమందుకున్న ఎస్.ఐ ఎ.నరేష్, పోలీసు సిబ్బంది గౌరీపురం చేరుకుని మహిళలతో చర్చించారు. ఎస్.ఐ నరేష్ సూచన మేరకు మౌన పోరాటానికి దిగిన గిరిజన మహిళ సుదీప, ఆమె తల్లి దేముడమ్మ, మహిళా మండలి సభ్యులు పోలీసు స్టేషన్‌కు తరలివెళ్లారు.