అత్తింటి ముందు ఆందోళన చేస్తున్న ప్రేమస్వరూప
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): కట్నం ఇవ్వడం ఆలస్యమైందని తన భర్తతో కాపురం చేయనివ్వకుండా అత్తింటి వారు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఒక వివాహిత అత్తింటి ముందు ధర్నాకు దిగింది. తన భర్త విడాకుల నోటీసు పంపాడని, తనకు భర్త కావాలని డిమాండ్ చేస్తోంది. ఆమె కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన దాసరి ప్రేమస్వరూపకు పట్టణ ఐతానగర్ జయప్రకాష్‌నగర్‌కు చెందిన తోటకూర పవన్‌తో 2014లో వివాహమైంది. వివాహం సందర్భంగా రూ.5 లక్షలు కట్నం ఇస్తామని ప్రేమస్వరూప పుట్టింటి వారు అంగీకరించారు.
చదవండి: ఉమెన్స్ బ్యూటీ పార్లర్.. ఆమె డాబూ దర్పం చూసి.. చివరికి లబోదిబో..
పెళ్లి అయినా కట్నం డబ్బులు ఇవ్వకపోవడంతో కేవలం ఆరు నెలలకే పుట్టింటికి పంపారని, అప్పటి నుంచి తన భర్తతో కాపురం చేయనీయకుండ అత్త, మామ, ఆడపడుచు అడ్డుకుంటున్నారని ప్రేమస్వరూప ఆరోపించింది. తన భర్త నుంచి విడాకుల నోటీసు రావడంతో, తాము కట్నం డబ్బులు ఇవ్వడానికి శనివారం సాయంత్రం రాగా, తన అత్త ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు న్యాయం చేయాలని, భర్తతో కలసి ఉండేలా చూడాలని ప్రాధేయపడుతోంది. సమాచారమందుకున్న టూ టౌన్ పోలీసులు పవన్ ఇంటికి వచ్చి బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు తన కుటుంబసభ్యులు, బంధువులతో కలసి పవన్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. అయితే ప్రేమస్వరూప గతంలో ఆమె అత్తింటి వారిపై 498ఏ కేసు పెట్టిందని, ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్నాయని, బాధితురాలు, ఆమె తరఫు వారితో మాట్లాడుతున్నామని సీఐ బి.కోటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment