ప్రతీకాత్మక చిత్రం
గుంటూరు లీగల్: లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జీవితఖైదుతో పాటు రూ.15వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.సీతారామకృష్ణారావు సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాలు.. బాపట్ల మండలంలోని పూండ్లలో ఒకే ఇంటిలో ఉత్తరం వైపు పోర్షన్‌లో బాధితురాలి కుటుంబం, దక్షిణం వైపు పోర్షన్‌లో నిందితుడి కుటుంబం నివాసం ఉంటున్నారు. బాధితురాలు కాలేజికి వెళ్లి వచ్చే సమయంలో నిందితుడి ఆమెను రోజూ అనుసరించేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. బాధితురాలిని కూడా తనను ప్రేమించమని బెదిరించాడు.
వేధింపుల విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. ఈ నేపథ్యంలో నిందితుడు, బాధితురాలి తల్లిదండ్రులకు మధ్య వివాదం జరిగింది. దీంతో తల్లిదండ్రులు కూతురిని నూజివీడులోని బంధువుల ఇంటికి పంపారు. పెళ్లి సంబంధం కుదుర్చుకుని వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో నిందితుడి ఆమెపై అసత్య ప్రచారం చేయడంతో పెళ్లి ఆగిపోయింది.
దీంతో బాధితురాలు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు గుంటూరులో హాస్టల్‌లో చేరింది. 2014 ఆగస్టు 11న సొంతూరు వెళ్లింది. రాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో నిందితుడు ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి గుంటూరు తీసుకెళ్లి తన స్నేహితుడి ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు బాపట్ల రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చదవండి: కొత్త పెళ్లి కొడుకు షాకింగ్ ట్విస్ట్.. బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి..
పోలీసులు విచారణ అనంతరం కోర్టులో చార్జిషిటు దాఖలు చేశారు. నిందితుడు చండిక శ్రీనివాస్ వర్మపై నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. రూ.15 వేలు బాధితురాలికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శ్యామలా కేసు వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment