
చిత్తూరు (మదనపల్లె టౌన్) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని భార్య మహ్మద్‌సనా(23) బుధవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఆమె గురువారం మదనపల్లె రూరల్ మండలం, దిగువ వాండ్లపల్లెలోని భర్త రమేష్‌కుమార్ ఇంటి ఎదుట నిరసనకు దిగింది. ఆమె మాట్లాడుతూ తనది నల్గొండ జిల్లా, చింతలపల్లె మండలం, కుడిమేకు గ్రామమని.. 2019లో అక్కడ ఈసెట్‌లో శిక్షణ తీసుకుంటుండగా రమేష్‌కుమార్‌తో పరిచమైందని వెల్లడించింది. జనవరి 4న మదనపల్లెలోని ఓ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది.
రమేష్‌కుమార్, మహ్మద్‌సనా పెళ్లినాటి ఫొటో(ఫైల్)
మరుసటి రోజు నుంచి అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయని వాపోయింది. ఇటీవల మదనపల్లెలోని ఎస్టేట్‌లో అద్దె ఇంటికి వెళ్లామని వెల్లడించింది. మూడు రోజుల క్రితం రమేష్ బయటకు వెళ్లి వస్తానని తిరిగి ఇంటికి రాలేదని తెలిపింది. అత్తింటి వారే తన భర్తను దాచిపెట్టారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తింటివారు, ఒక పార్టీ నాయకుడు కలిసి తన భర్తను వదిలి వెళ్లిపోవాలని బెదిరించారని వెల్లడించింది. కాగా రమేష్ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనా కుటుంబీకులే రమేష్‌ను అదృశ్యం చేశారని ఆరోపించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అత్తారింటి వద్ద నిరసన తెలుపుతున్న మహ్మద్ సనా
Comments
Please login to add a commentAdd a comment