శ్రీరంగరాజపురం: భర్త ఇంటి ముందు నిరసన తెలుపుతున్న సంధ్య, పిల్లలు
సాక్షి, శ్రీరంగరాజపురం: భార్య, పిల్లలుండగానే మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. సమాచారమందుకున్న భార్య, పిల్లలు కలిసి భర్త ఇంటి వద్ద నిరసనకు దిగారు. భర్త, అత్త మామలు పరారైన సంఘటన శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిమిట్టలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు సంధ్య తమగోడును మీడియాకు వినిపించింది. చిత్తూరులోని కొండమిట్టకు చెందిన లలిత, మురళి దంపతుల కుమార్తె సంధ్యను శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిమిట్టలోని నిర్మల, నాగరాజ్‌పిళ్లై దంపతుల కుమారుడు ఉదయ్‌కుమార్‌కు 2006లో పెద్దలు పెళ్లి జరిపించారు.
పెళ్లయిన ఏడాదికే వీరు ఉపాధి కోసం గుంటూరుకెళ్లి 2010 వరకు అక్కడే ఉన్నారు. అప్పుడే వీరికి శాలిని(15), రోహిత్(10) జన్మించారు. తరువాత స్వగ్రామం కొత్తపల్లిమిట్టకు చేరుకుని అత్త, మామలతో కలిసి ఉన్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. క్రమంగా అత్త, మామ, భర్త సంధ్యను వేధించడం మొదలుపెట్టారు. అయినా పిల్లల కోసం వేధింపులను ఐదేళ్లు భరించింది. తరువాత భరించలేని స్థితిలో 2015లో తన ఇద్దరు పిల్లలతో చిత్తూరుకు వెళ్లి అద్దె ఇంట్లో కాపురం పెట్టింది. కుటుంబం కోసం ప్రైవేట్ కళాశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో విడాకులు కావాలంటూ ఉదయ్‌కుమార్ కోర్టుకెక్కాడు.
దీంతో సంధ్య కోర్టులో భర్తతో విడిపోవాలన్న ఆలో చన తనకు లేదని జడ్జి ముందు వాపోయింది. కోర్టులో తీర్పు వెలువడక ముందే ఉదయ్‌కుమార్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న సంధ్య భర్త ఇంటి ముందు పిల్లలతో కలిసి నిరసనకు దిగింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. దీంతో వారు నిరసన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment