husband second marriage
-
నాకెందుకు అన్యాయం చేశావ్.. కరెంట్ పోల్‌కు కట్టేసి చితకబాదింది!
సాక్షి, పెద్దపల్లి: తన భర్త రెండో వివాహం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న భార్య.. అతడికి దేహశుద్ధి చేసింది. భర్తను ఓ కరెంట్ స్థంభానికి కట్టేసి చితకబాదింది. చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ షాకింగ్ ఘటన మంథనిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన అఖిలను శ్రీకాంత్ రెడ్డి వివాహం చేస్తున్నాడు. నాలుగేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అఖిల పేరెంట్స్ శ్రీకాంత్ రెడ్డికి కట్నంగా 20 లక్షలు ఇచ్చారు. అయితే, వీరిద్దరికీ కొడుకు జన్మించిన అనంతరం.. శ్రీకాంత్ భార్యను వదిలిపెట్టి వెళ్లాడు. అనంతరం, వరంగల్‌లో మరో మహిళను వివాహం చేసుకున్నట్టు తెలుసుకున్న అఖిల.. కుటుంబ సభ్యుల సాయంతో శ్రీకాంత్ రెడ్డిని హన్మకొండ నుంచి స్వర్ణపల్లికి తీసుకువచ్చారు. అనంతరం, శ్రీకాంత్‌ను కరెంట్ పోల్‌కు కట్టేసి.. భార్య అతడిని చితకబాదింది. చెప్పులతో కొట్టింది. ఈ క్రమంలో చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. -
పెళ్లయిన 21 రోజులకే భర్త రెండో పెళ్లి.. మొదటి భార్యకు తెలియడంతో..
సాక్షి, రంగారెడ్డి: పెళ్లయిన ఇరవై రోజులకే ఓ ప్రబుద్ధుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి విషయం భార్యకు తెలియడంతో ఐదు నెలలుగా ఆమెను మభ్యపెడుతూ వచ్చాడు. కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను వేధిస్తుండడంతో తట్టుకోలేక గురువారం మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన చిన్నమంగళారంలో చోటుచేసుకుంది. మొయినాబాద్ ఎస్ఐ శిరీష తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిన్నమంగళారానికి చెందిన మురళీకి 2021 నవంబర్ 25న నగరంలోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. మురళి అదే సంవత్సరం డిసెంబర్ 13న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం భార్య లావణ్యకు తెలియడంతో నిన్న బాగా చూసుకుంటానంటూ ఐదు నెలలుగా మభ్యపెడుతూ వచ్చాడు. ఇటీవల భర్త మురళీతోపాటు అత్త, ఆడపడుచులు వేధింపులు మొదలు పెట్టారు. తట్టుకోలేక లావణ్య గురువారం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: రూ.20 లక్షల కట్నం, ఘనంగా పెళ్లి.. ఏడాది కాకముందే.. -
రెండో పెళ్లికి సిద్ధమైన భర్త: భార్య నిరసన
సాక్షి, శ్రీరంగరాజపురం: భార్య, పిల్లలుండగానే మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. సమాచారమందుకున్న భార్య, పిల్లలు కలిసి భర్త ఇంటి వద్ద నిరసనకు దిగారు. భర్త, అత్త మామలు పరారైన సంఘటన శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిమిట్టలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు సంధ్య తమగోడును మీడియాకు వినిపించింది. చిత్తూరులోని కొండమిట్టకు చెందిన లలిత, మురళి దంపతుల కుమార్తె సంధ్యను శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిమిట్టలోని నిర్మల, నాగరాజ్‌పిళ్లై దంపతుల కుమారుడు ఉదయ్‌కుమార్‌కు 2006లో పెద్దలు పెళ్లి జరిపించారు. పెళ్లయిన ఏడాదికే వీరు ఉపాధి కోసం గుంటూరుకెళ్లి 2010 వరకు అక్కడే ఉన్నారు. అప్పుడే వీరికి శాలిని(15), రోహిత్(10) జన్మించారు. తరువాత స్వగ్రామం కొత్తపల్లిమిట్టకు చేరుకుని అత్త, మామలతో కలిసి ఉన్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. క్రమంగా అత్త, మామ, భర్త సంధ్యను వేధించడం మొదలుపెట్టారు. అయినా పిల్లల కోసం వేధింపులను ఐదేళ్లు భరించింది. తరువాత భరించలేని స్థితిలో 2015లో తన ఇద్దరు పిల్లలతో చిత్తూరుకు వెళ్లి అద్దె ఇంట్లో కాపురం పెట్టింది. కుటుంబం కోసం ప్రైవేట్ కళాశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో విడాకులు కావాలంటూ ఉదయ్‌కుమార్ కోర్టుకెక్కాడు. దీంతో సంధ్య కోర్టులో భర్తతో విడిపోవాలన్న ఆలో చన తనకు లేదని జడ్జి ముందు వాపోయింది. కోర్టులో తీర్పు వెలువడక ముందే ఉదయ్‌కుమార్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న సంధ్య భర్త ఇంటి ముందు పిల్లలతో కలిసి నిరసనకు దిగింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. దీంతో వారు నిరసన విరమించారు. -
మొదటి భార్యకు తెలీయకుండా రెండో వివాహం
-
అమ్మా.. డాడీని మర్చిపోమ్మా..
తిరుపతి క్రైమ్: భార్య, కుమార్తె ఉండగానే మరో మహిళను గుట్టు చప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకొన్నాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన తిరుపతి పెద్ద కాపు వీధిలో జరిగింది. మొదటి భార్య సరస్వతిని భర్త వెంకట చలపతి ఇంటి నుంచి గెంటి వేసాడు. దీంతో సరస్వతి తన కుమారైతో కలసి న్యాయం చేయాలంటూ ఈస్ట్ పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డు మీద బైఠాయించింది. బాధితురాలు, పోలీసుల కథనం.. స్థానిక పెద్దకాపు వీధిలో ఉన్న వెంకట చలపతితో 13 ఏళ్ల క్రితం సరస్వతికి వివాహమైంది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి 6 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ నేపథ్యంతో తన భర్త గుట్టుగా రెండో వివాహం చేసుకున్నాడని సరస్వతి తెలుసుకుంది. అప్పటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు తలెత్తేవి. ఈ క్రమంలో వెంకట చలపతి రెండో భార్య బంధువులు అందరూ సరస్వతిని కలిసి కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు. దీనిపై ఆమె ఈస్ట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా అక్కడే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఆమె వారి వద్దకు వెళ్లకుండా స్టేషన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద తన కుమార్తెతో కలిసి బైఠాయించి న్యాయం చేయాలంటూ బోరున విలపించసాగింది. ఈస్ట్ స్టేషన్ ఎస్ఐ జయచంద్ర అక్కడికి చేరుకుని మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రెండో భార్యతో ఆమె భర్త బైక్‌పై పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. ఇది చూసిన సరస్వతి ఆగ్రహంతో ఊగిపోయింది. పరుగున భర్త వద్దకు వెళ్లి లాగే ప్రయత్నం చేసింది. రెండో భార్య మాత్రం ప్రేక్షకురాలైంది. సరస్వతి బైక్ తాళం లాక్కునేందుకు యత్నించేసరికి వెంకట చలపతి అక్కడి నుంచి రెండో భార్యతో ఉడాయించాడు. చివరకు మహిళా కానిస్టేబుల్ సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మా... డాడీని మర్చిపోమ్మా.. తండ్రిని పోలీస్ స్టేషన్ దగ్గర చూసిన ఆ చిన్నారి తల్లితో కలిసి... అతడి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. డాడీ మా పక్కకు రా డాడీ... అంటూ భోరున విలపించినా తండ్రి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు తల్లి నడిరోడ్డుపై ఏడుస్తుండటంతో ...ఆ చిన్నారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ... అమ్మా డాడీని మర్చిపోమ్మా, నాకు డాడీ వద్దు, ఆయన మీద కేసు వేసి విడాకులు ఇచ్చేయ్. నాకు ఇంకా డాడీ లేడు.. నువ్వు ఏడవొద్దమ్మా’ అంటూ తల్లిని ఓదార్చింది. -
భర్త రెండో వివాహాన్ని అడ్డుకున్న మలేషియా యువతి
చెన్నై , టీ.నగర్: ముత్తుపేట సమీపంలో భర్త రెండో వివాహాన్ని మలేషియా యువతి అడ్డుకోవడంతో ఆదివారం సంచలనం ఏర్పడింది. తిరువారూరు జిల్లా, ముత్తుపేట సమీపంలోగల పెరుగవాల్తాన్ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ (30) మలేషియాలో ఉద్యోగి. అక్కడ ఒక హోటల్లో పనిచేస్తుండగా అదే హోటల్లో పనిచేస్తున్న మలేషియాకు చెందిన దుర్గాదేవిరామీస్ (25) అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2016లో వివాహం చేసుకున్నారు. ఇలావుండగా సొంతూరికి వెళ్లి వస్తానని తెలిపి రాజ్‌కుమార్ 15 రోజుల క్రితం పెరుగవాల్తాన్ చేరుకున్నాడు. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు అతనికి వేరొక యువతితో వివాహ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం అక్కడున్న ఒక మండపంలో వివాహానికి ఏర్పాట్లు జరగసాగాయి. ఈ విషయం తెలుసుకున్న మలేషియా యువతి దుర్గాదేవిరామీస్ దిగ్భ్రాంతి చెందారు. దీంతో రెండు రోజుల క్రితం ఆమె పెరుగవాల్తాన్కు చేరుకున్నారు. ముత్తుపేట డీఎస్పీ ఇనికోదివ్యన్ వద్ద రాజ్‌కుమార్‌కు తనకు జరిగిన వివాహం గురించి పెళ్లిపత్రికతోపాటు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాహాన్ని అడ్డుకోవాల్సిందిగా పోలీసులకు డీఎస్పీ ఆదేశించారు. దీంతో పోలీసులతోపాటు ఆదివారం దుర్గాదేవిరామీస్ కల్యాణ మండపం చేరుకున్నారు. అక్కడ ఇరు కుటుంబాల బంధువులు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. రాజ్‌కుమార్, నవ వధువు పరారీలో ఉన్నట్లు కనుగొన్నారు. -
నాకు న్యాయం చేయండి
సిద్దిపేటకమాన్ : రెండో పెళ్లికి సిద్ధమైన తన భర్త నుంచి తనకు న్యాయం చేయాలని సిర్సినగండ్లకు చెందిన సరిత కన్నీటి కన్నీటి పర్యంతమైంది. ఆడపిల్లలు పుట్టారనే నెపంతో విడాకులు తీసుకుంటున్నట్లు లాయర్ ద్వారా నోటీస్ ఇప్పించి, అనంతరం నా న్యాయవాదితో కుమ్మక్కై థర్డ్ పార్టీ డైవోర్స్ వచ్చినట్లు పత్రాలు సృష్టించాడని ఆవేద వ్యక్తం చేసింది. మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న తనకు సిర్సినగండ్లకు చెందిన తాటిపాముల శ్రీనివాస్‌తో 2006 లో విహాహం జరగగా, 2008లో మొదటి పాప, 2015లో రెండో పాప పుట్టిందని తెలిపింది. రెండవ పాప పుట్టిన అనంతరం తాను పుట్టింకి వెళ్లగా భర్త రాలేదని, కనీసం ఇంటికి రమ్మని కూడా అనలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత డైవోర్స్ కేసు ఫైల్ చేసి, నా తరపు లాయర్‌తో కుమ్మక్కై తనకు తెలియకుండానే ఎక్స్ పార్టీ డైవోర్స్ తీసుకున్నాడని కన్నీటి పర్యంతం అయ్యింది. ఆ కాపీని అందరికి చూపిస్తూ మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలిపింది. ఈ నెల 6న చేర్యాల మండలం మర్రిముచ్చాలకు చెందిన ఓ అమ్మాయితో కొమురవెల్లి దేవస్థానంలో పెళ్లికి సిద్ధమవ్వగా తాను కేసు పోలీసులకు ఫిర్యాదు చేయగా పెళ్లి ఆపారని తెలిపింది. గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారని చెప్పింది. గ్రామంలో మంగళవారం పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడడానికి వెళ్లగా భర్త రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద మనుషులు అతనికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, ఆ తర్వాత స్విచ్ఛాప్ చేసుకున్నాడని తెలిపింది. తన లాగే మరో అమ్మాయి మోస పోకుండా ఉండాలనే విలేకరుల సమావేశం నిర్వహించినట్లు చెప్పింది. -
ఆడ బిడ్డలు పుట్టారని..
∙రెండో పెళ్లి చేసుకున్న భర్త ∙నిలదీసిన భార్యపై దాడి మదనపల్లె క్రైం : ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారని, మగ బిడ్డ కావాలని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య నిలదీయడంతో రాళ్లతో దాడి చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం మేరకు... పీటీఎం మండలం చలిమామిడికి చెందిన నరసింహులు, ఉత్తమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీనరసమ్మను 15 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా కదిరి పట్టణం బాలప్పగారి క్వార్టర్స్‌లో ఉంటు న్న సత్తెన్న, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు ఎస్.శ్రీనివాసులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. మగ బిడ్డ లేకపోవడంతో శ్రీనివాసులు రెండో పెళ్లి చేసుకోవాలని ఏడాదిగా భార్యను వేధిస్తున్నాడు. ఆమె బిడ్డల కోసం వేధింపులను భరిస్తూ వచ్చింది. నెలరోజుల క్రితం శ్రీనివా సులు అదే జిల్లా గాండ్లపెంట మండలం ఎర్రజేనుకు చెందిన లక్ష్మి అనే యువతిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. నాలుగు రోజుల క్రితం భర్తను నిలదీయడంతో అతను ఆమెపై ఇటుక రాళ్లతో విచక్షణ రహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారు గమనించి బాధితురాలిని పుట్టింటికి పం పించారు. తీవ్ర గాయాలతో అవస్థలు పడుతున్న బిడ్డను చూసి తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. అనంతరం వారు పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
చిత్తూరు (పుంగనూరు): కుటుంబ కలహాలతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండల కేంద్రంలోని కోనేటి పాలెం వీధిలో గురువారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన గాయత్రి (26)కి, హరినాథ్ రెడ్డితో ఏడేళ్ల కిందట వివాహం అయింది. అప్పటినుంచి తరచు భర్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా హరి రెండో పెళ్లి చేసుకొవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గాయత్రి బుధవారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.