బరాటం సాయి, మామిడి నాగరాజు (ఫైల్)
శ్రీకాకుళం ,గార: విహారం విషాదం మిగిల్చింది. పిక్నిక్‌లో తోటి స్నేహితులతో కలిసి సందడిగా గడిపిన ఇద్దరు యువకులు అందరూ చూస్తుండగానే సముద్రంలో గల్లంతయ్యారు. స్థానికులు ఎంతగా గాలించినా గల్లంతైన వారి జాడ తెలియకపోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ విషాద ఘటన కళింగపట్నం బీచ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం నగరంలోని బరాటం వీధికి చెందిన బరాటం వెంకటరమణ కుమారుడు సాయి (20) స్థానిక పెద్దమార్కెట్‌లో తోపుడు బండిపై పండ్లు అమ్ముతుండేవాడు. పిక్నిక్ జరుపుకొనేందుకు పది మంది స్నేహితులతో కలిసి ఆదివారం కళింగపట్నం బీచ్‌కు వచ్చాడు.
మధ్యాహ్నం స్నేహితులతో కలిసి భోజనం చేసి సాయంత్రం సముద్రంలో స్నానానికి దిగాడు. అందరూ సందడి చేస్తున్న సమయంలో సాయి ఒక్కసారిగా గల్లంతయ్యాడు. స్థానిక యువకులు ఎంత వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు సముద్రంలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. సాయి తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఎస్.లక్ష్మణరావు తెలిపారు.
ఇదే బీచ్‌లో విజయనగరం జిల్లా రామభద్రపురం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు (17) అనే ఇంటర్మీడియెట్ విద్యార్థి కూడా ఆదివారం సాయంత్రం గల్లంతయ్యాడు. సుమారు 30 మంది స్నేహితులతో కలిసి బీచ్‌కు పిక్నిక్ కోసం వచ్చాడు. అందరూ కలిసి సాయంత్రం సముద్ర స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. మృతుడి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి సత్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తలే రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment