రైలుపట్టాలపై నరసింహారావు మృతదేహం నరసింహారావు (ఫైల్ ఫొటో)
శ్రీకాకుళం ,కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కాశీబుగ్గ ఎల్‌సీ గేటు ఫ్లై ఓవర్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడి తల.. మొండెం నుంచి వేరుపడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మందస మండలం బొగాబంద గ్రామానికి చెందిన బొంసుగంటి దండాసి, వరలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు నరసింహారావు(23) విదేశాలలో ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. నెల రోజుల కిందటే స్వగ్రామం వచ్చాడు. రెండో కుమారుడు రాంబాబు కాశీబుగ్గ ఐటీఐలో చదువుతుండగా, చిన్నకుమారుడు చైతన్య గొప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తండ్రి కిరణా షాపు నిర్వహిస్తున్నారు.
విశాఖ వెళ్తానని చెప్పి..
నరసింహారావు బుధవారం ఉదయాన్నే రెండు రొట్టెలు తిని తండ్రి వద్దకు వెళ్లాడు. విశాఖపట్నం వెళ్తానంటూ రూ.2 వేలు తీసుకుని పలాస రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. ఇంతలో ఏం జరిగిందో కానీ మధ్యాహ్నం 2.45 గంటలకు పలాస నుంచి విశాఖపట్నం వెళ్తున్న వాస్కోడిగామా రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మొండెం నుంచి తల వేరుపడింది. కాళ్లు పక్క ట్రాకుపైకి వెళ్లడం, అదే లైనులో గూడ్స్ రైలు రావడంతో స్థానికులు కేకలు పెట్టారు. వెంటనే జీఆర్‌పీ పోలీసులు వచ్చి రైలును నిలిపివేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కన్నవారికి కడుపుకోత మిగిల్చి..
కుమారుడు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న దండాసి, కుటుంబ సభ్యులు హుటాహుటిన రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైలుపట్టాలపై విగతజీవిగా పడి ఉన్న నరసింహారావును చూసి బోరున విలపించారు. ఎవరి మీదో కోపం పెట్టుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చావా.. అంటూ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment