సవర రాజారావు మృతదేహం
శ్రీకాకుళం, కొత్తూరు: నూతన సంవత్సరాన్ని ఎంతో సందడిగా గడపాల్సిన ఆ ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని అడ్డంగి గిరిజన గ్రామానికి చెందిన సవర రాజారావు (28) మంగళవారం విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాజారావు తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని పోషించుకుంటూ వస్తున్నాడు. రాజారావు విద్యుత్ షాక్‌కు గురికావడంతో ఆ కుటుంబం వీధిన పడింది. అడ్డంగి గ్రామానికి రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్‌కో సిబ్బందికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. విద్యుత్ వైర్లకు తగిలి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని ట్రాన్స్‌కో సిబ్బంది గిరిజనులకు సూచించారు.
ఈ మేరకు గ్రామానికి చెందిన నలుగురు గిరిజన యువకులు విద్యుత్ వైర్లకు తగిలి ఉన్న చెట్ల కొమ్మలు తొలగించేందుకు బయలుదేరి వెళ్లారు. విద్యుత్ సరఫరాను సిబ్బంది నిలిపివేశారనే భావనతో రాజారావు వైరకు ఆనుకొని ఉన్న జీడి చెట్ల కొమ్మలను తొలగించే ప్రయత్నం చేశాడు. ఇంతలో షాక్‌కు గురై అక్కడకక్కడే మృతి చెందాడు. వీఆర్‌వో జి.రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ బి.సింహద్రి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రాజారావు (అవివాహితుడు) మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబాన్ని పోషిస్తున్న అన్నయ్య మృతి చెందడంతో చెల్లి, తమ్ముళ్ల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment